పుట్ట గొడుగులు తినాలంటే!

30 Jun, 2018 02:53 IST|Sakshi

అనాది నుంచి వస్తున్న మానవ పరిణామక్రమంలో, మేధా సాంకేతిక ప్రాభవంలో, ‘ఆహార పరిణామం’ కూడా ఒక ప్రధాన అంశమే. మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి పనికొచ్చే ఆహారం ‘ప్రకృతి’  ఎప్పుడూ ప్రసాదిస్తూనే ఉంది. అది వృక్షసంబంధం కావచ్చు. జంతు సంబంధం కావచ్చు. జంతుసంబంధాలలో మళ్లీ రెండు విభాగాలు ఉన్నాయి. జంతువులను, పక్షులను చంపగా లభించే తాజా మాంసం, చేపలు, పక్షిగా మారే ముందు దశలోని అండములు.

రెండవది జంతు దత్తమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవి. పూర్తిగా శాకాశారం కానివి, పూర్తిగా మాంసాహారంలోనికి రానివి మధ్యస్థంగా ఉండేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ పుట్టగొడుగు.అన్ని రకాల పుట్ట గొడుగులు ఆహారానికి పనికిరావు. ఇవి తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో రకరకాలుగా ఉంటాయి. ఇవి భూమి మీద, భూమిలో కూడా పెరుగుతాయి. ‘అతి తక్కువ కాంతి, తేమతో కూడిన తక్కువ వేడి’ వాతారవణంలో పెరిగే ఒకరకమైన ఫంగస్‌ ఇవి.

ఆయుర్వేద భావప్రకాశ సంహితలో... పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి తెల్ల రంగులో ఉన్నవి తినడానికి యోగ్యమని చెప్పబడింది. కర్రలు, వెదురు, పేడలపై పుట్టినవి తెల్లగా ఉంటే అంతగా దోషకరం కావు కాబట్టి తినొచ్చు. ఇవి కాని ఇతర రకాలైన  పుట్ట గొడుగులు ఎక్కువ జిగురుగా ఉండి, అత్యంత శీతకరమై కఫాన్ని వృద్ధిచేయడమే కాకుండా ‘వాంతులు, విరేచనాలు, జ్వరాల’ ను కలుగచేస్తాయి.

శ్లో‘‘ ఉక్తం సంస్వేదజం శాకం భూమి ఛత్రం శిలీంధ్రకం అక్షితి గోమయ కాష్టేషు వృక్షాదిషు తదుద్భవేత్‌ ‘‘...గురువత్‌ ఛర్ది అతిసార జ్వర శ్లేష్మామయప్రదాః’’ ‘‘శ్వేత శుభ్రస్థలీ కాష్టవంశగోమయ సంభవాః నాతిదోషకరాః, తేస్యుః శేషాః తేభ్యోవిగర్హితాః‘

వంటకాలు: సూపు, మంచూరియా, కూరలు, అట్లు మొదలైనవి.
జాగ్రత్తలు: పచ్చిది రుచి చూస్తే ‘చేదుగా’ ఉండకూడదు. కొన్ని నిషిద్ధ ప్రదేశాలలో లభించేవి, నల్లగా, ఇతర రంగులలో ఉండేవి చేదుగా ఉంటాయి. ఇది గమనించి తినదగిన రంగు, రుచి, వాసనలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఈ రోజుల్లో వీటిని కృత్రిమంగా కూడా పండిస్తున్నారు. కొంతమంది సనాతనులు దీనిని తామసిక ఆహారంగా పరిగణించి తినకూడనిదిగా భావిస్తున్నారు.

పోషకాలు: పుట్ట గొడుగులలో ‘పీచు’ అధికంగా ఉంటుంది కనుక సుఖ విరేచనం కలిగిస్తుంది. కొవ్వుల శాతం చాలా తక్కువగాను, శర్కర, పిండి పదార్థాలూ ఓ మోస్తరుగానూ, ప్రోటీన్లు (మాంసకృత్తులు) తగు రీతిలో లభిస్తాయి. విటమిన్లు ‘బి 6, సి, డి’ సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తాయి. సోడియం అస్సలు లేదు. పొటాషియం చాలా అధికస్థాయిలో ఉంటుంది కనుక శరీరానికి ప్రయోజనకరమే కాకుండా, అధిక రక్తపోటును తగ్గించడానికి అమోఘంగా పనిచేస్తుంది.


– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

27,28,29 తేదీల్లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు

భూసార నిపుణుడు డా. లాల్‌కు ‘జపాన్‌ ప్రైజ్‌’

రుణం ఎలా తీర్చాలో తెలియటం లేదు..

మల్బరీ సాగులో మహిళా రైతులు

మట్టి మర్మమెరిగిన మహా రైతు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రీల్ సైంటిస్ట్‌.. రియల్‌ సైంటిస్ట్‌

ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’ 

పొలిటికల్‌ ఎంట్రీపై కరీనా కామెంట్‌

అడ్వంచరస్‌ ఫన్‌ రైడ్‌ : టోటల్‌ ధమాల్‌

ధనుష్‌కు జోడీగా సీనియర్‌ హీరోయిన్‌