టూకీగా ప్రపంచ చరిత్ర 109

4 May, 2015 00:30 IST|Sakshi
టూకీగా ప్రపంచ చరిత్ర 109

వేకువ
 
జ్ఞానం పొందేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు సిద్ధార్థుడు. కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోధర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది.
 ఆశ్రమాన్ని వదిలి, వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని తపస్సులో కూర్చున్నాడు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇలా లాభం లేదనుకుని నదివొడ్డునే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. అలా తర్కించుకోగా తర్కించుకోగా... మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు.


లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది.అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం.

ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం.అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు.

అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం. ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకం కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. బుద్ధుని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు దగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 (సమాప్తం)
 ఇన్ని రోజులుగా మీ ఆదరణ పొందిన ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ను నేటితో ముగిస్తున్నాము. దీనిని పుస్తకరూపంలో చూడాలనుకునేవారు ఈ క్రింది రచయితను సంప్రదించవచ్చు.
 - ఎడిటర్
 
 

మరిన్ని వార్తలు