మన్నించు మిత్రమా

29 Nov, 2018 00:26 IST|Sakshi

చెట్టు నీడ

ఒక జర్మన్‌ యాత్రికుడు చాలా దూరం ప్రయాణించి ఒక ఆధ్యాత్మిక గురువును దర్శించుకునేందుకు వచ్చాడు. ప్రయాణ బడలికలో చికాకుగా ఉన్న అతను విసుగ్గా బూట్లను విప్పి ఒక మూలకు విసిరేసి ఎదురుగా మూసి ఉన్న తలుపును కాలితో బలంగా తన్ని తెరిచి లోపలికి ప్రవేశించి గురువుకు నమస్కరించాడు. గురువు అతనితో ‘‘నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ముందు వెళ్లి ఆ తలుపునకు, నీ బూట్లకు క్షమాపణ చెప్పిరా’’ అన్నాడు. దానికతను ‘‘తలుపు నకు, బూట్లకు క్షమాపణ చెప్పమంటారేమిటి? వాటికి జీవముందా?’’ అని అడిగాడు. ‘‘తలుపును తన్నినప్పుడు, బూట్లను విసిరేసినప్పుడు వాటికి జీవం లేదు అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు. కానీ, నేను వాటికి క్షమాపణ చెప్పమన్నప్పుడు మాత్రం ఆ సంగతి నీకు గుర్తొచ్చిందా? ముందు వెళ్లి వాటికి క్షమాపణ చెప్పిరా. అంతవరకు నేను నీతో మాట్లాడను’’ అన్నాడు.

ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తాను ఇంత చిన్న విషయానికి ఆయనతో మాట్లాడకుండా వెళ్లిపోవడం సమంజసం కాదని గురువు చెప్పినట్లుగా తలుపు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, ‘‘కోపంలో నిన్ను అనవసరంగా తన్ని బాధపెట్టాను. నన్ను మన్నించు’’ అని వేడుకున్నాడు. అలాగే బూట్ల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, ‘‘మిత్రులారా! మిమ్మల్ని ఒక మూలకు విసిరేసి అవమాన పరిచాను. నా తప్పును మన్నించండి’’ అని వేడుకున్నాడు. ఇలా చేసిన వెంటనే అతని మనసులోని అలజడి మాయమై అనిర్వచనీయమైన ప్రశాంతత చోటు చేసుకుంది. క్షమాపణ తంతు ముగించి గురువు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. గురువు అతనిని చూసి నవ్వుతూ, ‘‘ఇప్పుడు నాకు బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకుందాం’’ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ జీవులను, మనల్ని జీవులుగా ఉంచేవాటినీ ప్రేమించాలి. ప్రేమించగలగాలి. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు