ఎముక విరిగితే...

16 Jun, 2014 23:21 IST|Sakshi
ఎముక విరిగితే...

ప్రథమ చికిత్స
 
ప్రమాదవశాత్తూ జారిపడడం, వాహనాల ప్రమాదాలలో ఎముక విరగడం లేదా చిట్లడాన్ని చూస్తుంటాం. దీనినే ఫ్రాక్చర్ అంటాం. గాయమైన చోట చేతితో తాకినప్పుడు పేషెంటు భరించలేనంత నొప్పితో బాధపడుతున్నా, గుచ్చినట్లు నొప్పి ఉందని చెప్పినా అది ఫ్రాక్చరైందనడానికి సంకేతం. ఫ్రాక్చరైనప్పుడు కొన్నిసార్లు రక్తస్రావమవుతుంది. కొన్నిసార్లు దెబ్బ బయటకు కనిపించకుండా లోపల ఎముకకు మాత్రమే తగిలినప్పుడు మాత్రం రక్తస్రావం ఉండదు.
     
 ఫ్రాక్చర్ అయిన పేషెంటుని చాలా జాగ్రత్తగా లేవదీసి గట్టిగా, సమతలంగా ఉన్న బల్ల మీద పడుకోబెట్టాలి. పేషెంటుని కదిలించినప్పుడు ఎముకలు ఒకదానికొకటి ఒరుసుకుని ‘కరకర’ శబ్దం వచ్చిందంటే అదే ఎముక విరిగిన ప్రదేశం. ఎముక విరిగిన చోట మళ్లీ మళ్లీ రాపిడికి లోను కాకుండా ఉండడానికి దేహాన్ని సమస్థితిలో వెల్లకిలా పడుకోబెట్టాలి.
     
 గాయమైన చోట దుస్తులను తొలగించాలి. గాయానికి ఒత్తిడి కలగకుండా తీయడం సాధ్యం కాకపోతే ఆ మేరకు కత్తిరించి తొలగించాలి.
     
 గాయంతోపాటు రక్తస్రావమవుతుంటే వస్త్రాన్ని ఒత్తుగా మడత పెట్టి గాయం మీద అదిమి (ఎముకపై ఒత్తిడి పడకుండా ఒక మోస్తరుగా) పట్టుకోవాలి. ఫ్రాక్చరైనప్పుడు గాయాన్ని నీటితో కడిగే యత్నం చేయరాదు.
     
 రక్తస్రావం తగ్గిన తర్వాత గాయానికి బ్యాండేజ్ క్లాత్, అందుబాటులోని శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టి హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎముక విరిగిన చోట ఒత్తుగా వస్త్రాన్ని పెట్టి దానిపై మరో వస్త్రంతో కట్టుకట్టాలి.
     
 గాయమైన ప్రదేశాన్ని బట్టి సాధారణ వాహనంలో, లేదా అంబులెన్స్‌లో తీసుకెళ్లాలి. ఉదాహరణకు చేతి ఎముక ఫ్రాక్చర్ అయితే ప్రథమ చికిత్స తర్వాత సాధారణ వాహనంలో తీసుకెళ్లవచ్చు. కానీ, కాలు, వెన్నెముక, మెడ వంటి చోట్ల ఎముక విరిగినా, చిట్లినా అంబులెన్స్‌లో తీసుకెళ్లడమే శ్రేయస్కరం.
 

మరిన్ని వార్తలు