తోక తెగిన కోతి!

4 Jan, 2015 00:20 IST|Sakshi
తోక తెగిన కోతి!

అనగనగా ఒక రోజు మేస్త్రీలు, వడ్రంగులు ఒక అందమైన భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అందరూ శ్రద్ధగా రకరకాల పనులు చేస్తుండగా చెట్లపై నుండి కొన్ని కోతులు చూడసాగాయి. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి వెళ్లారు. రామయ్య అనే ఒక వడ్రంగి మాత్రం పనిలో మునిగిపోయాడు. అతను ఒక పెద్ద దుంగను నిలువుగా రెండు ముక్కలుగా చేయాలనుకున్నాడు. రంపంతో ఆ దుంగను కోయసాగాడు.అక్కడే చెట్టు మీద ఉన్న కోతుల్లో ఒకటి రామయ్య చేసే పనిని గమనించసాగింది. చాలా సేపటి తర్వాత రామయ్యకు ఆకలి వేసింది. పని ఆపు చేశాడు. రామయ్య దుంగను మధ్య దాకా మాత్రం కోశాడు. కోయవలసిన జాగా గుర్తు కోసం అక్కడ ఒక ఇనుపసీలను దిగ్గొట్టాడు. భోజనం చేసేందుకు వెళ్ళి పోయాడు.

అతడు వెళ్ళగానే కోతి కిందకు దిగి. ఆ దుంగ చుట్టు తిరిగి, వడ్రంగి చేసిన పనిని పరిశీలించింది. దుంగకు మధ్యలో దిగ్గొట్టిన ఇనుప సీలను రెండుచేతులతో బలంగా లాగసాగింది. దాని తోక దుంగ చీలిక మీద వేలాడుతోంది. అలా ఊపుతుంటే కోతి చేతిలోనికి ఆ సీల ఊడి వచ్చింది. దాంతో దుంగ కోసిన రెండు సగాలు గట్టిగా కొట్టుకొని కలసిపోయాయి. కోతి తోక ఆ సీలకు, దుంగకు మధ్య చిక్కుకు పోయింది. దుంగ రెండు సగాలు కొట్టుకోవడం వల్ల తోక బాగా నలిగిపోయింది. గట్టిగా అరుస్తూ కోతి బలంగా తోకను లాక్కొంది. దానితో తోక తెగిపోయింది. తెగిపోయిన పొడవైన భాగం ఆ దుంగలో ఇరుక్కుపోయి అలాగే ఉండి పోయింది.

నీతి: తెలియని వస్తువులతో ఆటలాడరాదు. ఆపదలు కొని తెచ్చుకోరాదు.
 

మరిన్ని వార్తలు