నా కొడుకు దగ్గరికి తోల్కపోండి

20 Dec, 2014 22:55 IST|Sakshi
నా కొడుకు దగ్గరికి తోల్కపోండి

శరాది
ఈమె పేరు ధరూరి లక్ష్మి. ఊరు కరీంనగర్‌జిల్లా రాయికల్‌మండలం కొత్తపేట. షార్జా ఈమెకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది! లక్ష్మికి ముగ్గురు కొడుకులు లక్ష్మణ్, బుచ్చన్న, లింగం. కూలితోనే కూడు దొరికే పేద దళిత కుటుంబం. ఎన్ని రోజులు ఈ కూలినాలి చేస్తాం.. దోస్తుల్లాగే తానూ గల్ఫ్‌కి పోవాలనుకున్నాడు బుచ్చన్న.   అప్పు చేసి 70 వేలు కూడబెట్టి కొడుకు చేతికిచ్చారు తల్లిదండ్రులు. షార్జా వెళ్లాడు బుచ్చన్న. భవన నిర్మాణ పనికి కుదిరాడు. మూడేళ్లు బాగానే గడిచాయి. ఇంకో వారం పదిరోజుల్లో ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతాడనగా జరిగిన ఓ దుర్ఘటన బుచ్చన్నను దోషిని చేసింది!

షార్జాలో బుచ్చన్న ఉంటున్న గదిలోకి కొత్తగా దిగాడు నిజామాబాద్‌జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన గోవర్థన్.  వారంరోజులు గడిచాయి. ఏ విషయం మీదో కాని ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి చేయి చేసుకునేదాకా వెళ్లింది. ఆవేశంతో బుచ్చన్న సత్తయ్యను తోశాడు. సత్తయ్య తల గది గోడకు కొట్టుకుంది. క్షణాల్లో ప్రాణం పోయింది. అది మర్డర్‌గా నమోదైంది. నేరస్థుడిగా బుచ్చన్న షార్జాజైల్లో ఖైదీ అయ్యాడు. అక్కడి షరియత్ లా అతనికి మరణశిక్ష విధించింది. ఇది 2001 నాటి సంగతి!

జీవితఖైదు: విషయం తెలిసిన బుచ్చన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏదో ఇన్ని డబ్బులు వెనకేసుకొని వస్తాడనుకుంటే ప్రాణాలనే పోగొట్టుకుంటున్నాడని. బుచ్చన్న కేసులో మైగ్రెంట్స్ కౌన్సిల్ ఇండియా కూడా స్పందించి అక్కడి న్యాయస్థానానికి విజ్ఞాపన పంపింది. ఆ వినతికి స్పందించిన షార్జాన్యాయస్థానం బుచ్చన్న మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. బుచ్చన్న నేటికి పదమూడేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. ఇప్పుడతని వయసు 44 ఏళ్లు. దేశంకాని దేశంలో.. నా అనే బంధంలేని బందిఖానాలో మగ్గుతున్న బుచ్చన్న మానసికంగా కుంగిపోయాడు. అది పక్షవాతం రూపంలో శరీరాన్ని అటాక్ చేసింది 2011 సంవత్సరంలో! నడుము నుంచి కింది భాగం అచేతనమైంది. కూర్చోలేడు.. కదలలేడు!

బెంగతో తండ్రి... ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గుతున్న కొడుకు కోసం బెంగటిల్లారు నర్సయ్య, లక్ష్మి. కొడుకు నడుము పడిపోయిందని తెలుసుకొని నర్సయ్య హతాశుడయ్యాడు. ఇంక కొడుకుని చూసుకోలేనేమో అని దిగులుతో ప్రాణాలే వదిలాడు.
  ‘కనీసం నేను చచ్చిపోయేలోపన్నా నా కొడుకుని చూపించుండ్రి సారూ’ అని ప్రాధేయపడుతోంది లక్ష్మి.  ‘నా కొడుకుని ఇక్కడికి తెచ్చుడు మీతో అయితలేనట్టుంది. కనీసం నన్ను అయినా షార్జాకి తోల్కపొండ్రి. నా కొడుకుని చూస్కుంట’ అని కన్నీళ్లు పెడుతోంది.  ఈ తల్లి మనసును అర్థం చేసుకునేదెవరు? ఆమెకు కొడుకును చూపించేదెవరు?

>
మరిన్ని వార్తలు