జ్ఞానం వికసించిన రోజు...

30 Apr, 2015 23:40 IST|Sakshi
జ్ఞానం వికసించిన రోజు...

మే 4, సోమవారం బుద్ధపూర్ణిమ
 
కొందరు ఆయన్ని గొప్ప తత్త్వవేత్తగా కొనియాడతారు. ఇంకొందరు సమాజాన్ని చక్కదిద్దిన సంస్కర్తగా శ్లాఘిస్తారు. ఆయనే పశువుల్లా, పాశవికంగా బతికే మానవులకు శాంతి, అహింస, కరుణ, దయ, జాలి, ప్రేమ, మైత్రి లాంటి ధర్మాల్ని ప్రబోధించిన బుద్ధుడు. క్రీస్తుకు 600 సంవత్సరాల పూర్వమే మనిషి నడవడికకు మెరుగైన దారి చూపిన మార్గదర్శి ఆయన. అంతటి మహనీయుడు మన దేశం నేలమీద పుట్టడం మనందరికీ గర్వకార ణం. ప్రపంచానికి శాంతి, అహింసల్ని ప్రబోధించిన దేశంగా భారతదేశం పొందిన కీర్తికి ఈ తథాగతుడే కారణం.
 
బుద్ధుని బోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే. అజరామరాలే. వీటన్నింటిలో వెలకట్టలేనివి పంచశీల. బుద్ధుడు జ్ఞానానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో, అంతకు మించి శీలానికి ఇచ్చాడు. శీలం అనేది అందరికీ ఉండాల్సిన నైతిక గుణంగా భావించాడు. ప్రబోధించాడు. శీలం మన జీవన విధానమని చాటాడు.

బుద్ధుడు చెప్పిన శీలం అంటే నైతిక జీవనమే. మనవల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడని విధానమే శీలం. ఈ నైతిక జీవనం మనిషిని మానసిక రుగ్మతలకు దూరం చేస్తుంది. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే పరిపూర్ణమానవుడిగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది.

1. పంచశీలలో ‘జీవహింస చేయను’ అనేది మొదటిది. స్వర్గసుఖం కోసం యజ్ఞాల్లో వేలాది జీవుల్ని బలివ్వడాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు. రాజులు సాగించే అమానుషమైన జంతువేటల్ని వ్యతిరేకించాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది అని బోధించాడు.
 
2. రెండోది దొంగతనం గురించి, ‘పరుల సొమ్ము దొంగిలించను’ అని సాధారణంగా చెప్పుకుంటాం కానీ బుద్ధుడు దొంగిలించడమే కాదు, నీది కాని వస్తువుని, నీవు కష్టపడి సంపాదించని వస్తువుని, మరొకరు నీకు దానంగా ఇవ్వని వస్తువుని దారిలో దొరికినా తీసుకోకూడదు- అలా తీసుకున్నా అది పరుల సొమ్మును హరించడమే అన్నాడు.
 
3. మూడోది ‘అబద్ధాలు చెప్పను’ అనేది. దీనినే బుద్ధుడు ‘ముసావాద’ అన్నాడు. అంటే మోసపు మాటలు చెప్పను అని. ఎదుటి వారికి నష్టాన్ని కలిగించడం కోసమో లేదా తాను లాభం పొందడం కోసమో చెప్పే మోసపు మాటలు పలకరాదన్నాడు.
 
4. నాలుగోది కామానికి సంబంధించినది. సాధారణంగా స్త్రీ, పురుషుల శారీరక వాంఛల్ని కామం అంటాం. అయితే భార్యాభర్తల పవిత్ర సంబంధాన్ని బుద్ధుడు తప్పు పట్టలేదు. ‘కామదురాచారం’ మాత్రం కూడదని చెప్పాడు. కుటుంబ వ్యవస్థని గౌరవించాడు.
 
5. ఇక ఐదవది, మత్తుపానీయాలు, మత్తుని, ఉద్రేకాల్ని కలిగించే పదార్థాన్ని సేవించకూడదని చెప్పాడు. వీటివల్ల మనిషి తన విజ్ఞత కోల్పోయి, ఉచ్చనీచాలు ఎరుగని పశువులా ప్రవర్తిస్తాడని, ఎదుటివారికి ఇబ్బందికరంగా తయారవుతాడని ప్రబోధించాడు.
 ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే- నేరం, శిక్షలతో పనేముంటుంది? మనిషికి తప్పు చేసిన భావన ఎప్పుడూ కలుగదు. కాబట్టి సంతోషంగా, నిస్సిగ్గుగా, నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా బతకగలుగుతారు. అవాంతరాలకి, అవాంఛనీయ విధానాలకీ, అక్రమాలకీ తావులేని అందమైన ప్రపంచం రూపొందుతుంది. మనిషి జీవితానికి ఒక విలువ వస్తుంది. ఉత్సాహంగా బతికే మనిషి జీవితం కుంటుపడదు. వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతుంది.

ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా- ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు.

బుద్ధుడు బోధించిన ఈ పంచశీల మనిషి జీవితానికి ఒక చక్కటి నియంత్రణ. ఎందుకంటే- ప్రతివ్యక్తి పంచశీల ధరించి, స్వతంత్ర నియంత్రణ కలిగి ఉంటే... ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసగించడు. ఒకడు మరొకని దోపిడీ చేయడు. దగా చేయడు. చంపుకు తినడు. ఎదుటి వారి జీవితంలో అనవసరంగా తల దూర్చడు. దురాశాపరుడు కాడు- తోటి వ్యక్తుల్తో, సమాజంతో తగవు పడడు. ద్వేషాన్ని పెంచబోడు. పాపాన్ని మూటగట్టుకోడు. నలుగురితో మంచిగా ఉంటాడు. నలుగురి మేలు కోరుకుంటాడు- కాబట్టి అతనికి అడుగడుగునా అడ్డంకులుండవు. వెనక్కి లాగేవారు కానీ, ఎత్తి పడేసేవారు గానీ ఉండరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలో మానవీయతనే చూస్తాడు. మానవీయునిగానే జీవిస్తాడు. పంచశీలను తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకుంటాడు. పంచశీలను పాటించేవాడు తనను తాను గెలుచుకుంటాడు. జీవితాన్ని గెలుస్తాడు, జీవనాన్ని గెలుస్తాడు. నిజమైన విజేతగా నిలుస్తాడు.
 అందుకే... బుద్ధం శరణం గచ్ఛామి.
  - బొర్రా గోవర్ధన్
 
బౌద్ధం- పున్నమి: బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పున్నమికి ప్రాముఖ్యత లేదు.  బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిన ది, ఇల్లు విడిచినదీ, జ్ఞానోదయం పొందినదీ, పరినిర్వాణం పొందినదీ వైశాఖ పూర్ణిమరోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించినదీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు; అశోకుని కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడు శ్రీ లంకలో బౌద్ధధర్మం ప్రారంభించినది  ( విదేశంలో తొలి బౌద్ధ ధర్మస్థాపన) జ్యేష్ట పౌర్ణమినాడు కాగా, ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా