అనుకరణ... అనుసరణ

23 Dec, 2018 00:40 IST|Sakshi

బౌద్ధసంఘంలో కొందరు భిక్షువులు తమ గురువులను, ముఖ్యంగా బుద్ధుణ్ణి అనుకరిస్తూ జీవించేవారు. ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. అలాంటి వారిలో దేవదత్తుడు ఒకడు. బుద్ధునిలా కూర్చుని, బుద్ధునిలా నడుస్తూ, బుద్ధునిలా పడుకుని, ‘నేనూ బుద్ధునిలాగే నడుచుకుంటున్నాను. బుద్ధునితో సమానమైన వాణ్ణే’ అని అంటూ ఉండేవాడు. దేవదత్తునిలాగా మరికొంతమంది భిక్షువులు తయారయ్యారు. ఒకరోజున ఒక అనుకరణ భిక్షువు బుద్ధుని కొరకు వచ్చినప్పుడు బుద్ధుడు ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మహావృక్షం కింద ఒక ఏనుగు జీవిస్తూ ఉండేది. ఆ సమీపంలో ఒక సరోవరం ఉంది. దాని నిండా ఎర్రకలువలూ, ఎర్ర తామరలూ ఉన్నాయి. ప్రతిరోజూ సరోవరం నిండా వాటి పూలే. ఆ ఏనుగు రోజూ సరోవరంలో దిగి తామరతూడులు, దుంపలు లాగేసేది. పూలూ, తూడులు తినేది. దుంపలకు అంటిన బురదని నీటిలో జాడించి, శుభ్రం చేసుకుని తినేది. 

దాని బొరియల్లో ఒక గుంటనక్క జీవిస్తూ ఉండేది. అది ముద్దుగా, బొద్దుగా ఉన్న ఏనుగుని చూసి ‘నేనూ ఇలా బలంగా తయారవ్వాలి’ అనుకుంది. ‘ఏనుగు తామర తూడులు, దుంపలు తినడం చూసి నేనూ ఇక వీటినే తినాలి. ఏనుగులా బలాన్ని తెచ్చుకోవాలి’ అనుకుని సరస్సులో దిగి తామరతూడుల్ని పీకి దుంపల్ని బురదతో సహా తినడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు అలా తినేసరికి, దాని పేగుల్లో మట్టి పేరుకుని పోయి, జబ్బు చేసి, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న భిక్షువుకి ‘మనిషికి ఆచరణ స్వాభావికం కావాలి కానీ, ఎవరినో అనుకరించి, మనది కాని స్వభావాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్నది నటనే అవుతుంది కానీ నిజం కాదు’ అని అర్థమై తన నడవడిక మార్చుకుని, ఆచరణను సరిదిద్దుకున్నాడు. 

– డా. బొర్రా గోవర్ధన్‌ 

మరిన్ని వార్తలు