ధర్మభేరి

29 Jan, 2015 23:16 IST|Sakshi
ధర్మభేరి

కోసలరాజుకు ఏనుగుల మీద స్వారీ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన గజశాలలో మంచి మంచి ఏనుగుల్ని పెంచేవారు. వాటిలో ఒక అందమైన ఏనుగుంది. అది ఎంతో ఉల్లాసంగా, బలంగా ఉండేది. యుద్ధరంగంలో విజృంభించేది. ఒరోజు అది ఒక కొలనులో దిగి, అనుకోకుండా బురదలో దిగబడి పోయింది. ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయింది. ఆ కొలను ఆవలి గట్టు మీద బుద్ధుడు తన శిష్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. భటులు బుద్ధుని దగ్గరకు వెళ్లి, గజరాజం ఒడ్డుకు చేరే మార్గం బోధించమన్నారు.
 బుద్ధుడు వారితో ‘వెంటనే పోయి యుద్ధభేరీలు తెచ్చి మోగించండి’’ అన్నాడు. భటులు వెళ్లి- భేరీలు తెచ్చి మోగించారు. ఆ భేరీనాదం విన్న వెంటనే ఏనుగులో ఉత్సాహం పెల్లుబుకింది. ఒక్కసారిగా ముందుకు కదిలింది. బురదలోనుండి ఒక్క ఉదుటున ఒడ్డుకు ఎక్కి ఘీంకరించింది. రాజభటులు సంతోషపడ్డారు. వినమ్రంగా బుద్ధునికి నమస్కరించి వెళ్లిపోయారు.

అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో ‘‘చూశారా! భేరీ నాదంతో ఆ గజరాజం క్లేశాలనుంచి బైటపడింది. అలాగే మనం కూడా అనేక క్లేశాల బురదలో దిగబడిపోతాం. వీటినుండి బైటపడాలంటే మనం ధర్మం అనే భేరీనాదం వినాలి. అప్పుడు మాత్రమే ఈ ఊబినుండి బైటపడగలం.’’ అని హెచ్చరించాడు. శ్రద్ధగా విని భిక్షువులు బుద్ధునికి నమస్కరించారు.        - బొర్రా గోవర్ధన్

 

మరిన్ని వార్తలు