బ్యూటీ క్వీన్‌.. వర్కవుట్‌తో విన్‌

31 Oct, 2018 09:09 IST|Sakshi

బ్యూటీ కాంటెస్ట్‌లో విజయం ఈజీ కాదు  

అందంతో పాటు ఫిట్‌నెస్‌ కీలకం  

శిక్షణ ఆద్యంతం ఆసక్తికరం  

ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతుంటారు. కదలికల్లో కవ్వింపు ఉంటుంది. అన్నింటా ‘రాణి’ంపు ఉట్టిపడుతుంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని వచ్చిన అమ్మాయిల తీరే మారిపోతుంది. దీనికి కారణం కాంటెస్ట్‌లో పాల్గొన్న సమయంలో వారితో చేయించే సాధన. ముఖ్యంగా ఫిట్‌నెస్‌–డైట్‌ రొటీన్‌  అని చెప్పాలి. నగరానికి చెందిన యువతులకు బ్యూటీ పోటీలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ కాంటెస్ట్‌లలో పాల్గొనే వారికిచ్చే శిక్షణకు సంబంధించి నిపుణులు చెబుతున్న విశేషాలివి... 

 

సాక్షి, సిటీబ్యూరో   : అటు శరీరాన్ని, ఇటు బాడీ లాంగ్వేజ్‌ని తీర్చిదిద్దడానికి ఫిట్‌నెస్‌ అత్యవసరం.దీని కోసం వీరితో చేయించే సాధన క్రమం ఇలా ఉంటుంది.  
మైండ్‌ అండ్‌ బాడీ: యువతుల దేహంతో పాటు మైండ్‌ని కూడా తప్పనిసరిగా ట్యూన్‌ చేస్తారు. దీని కోసం ఫ్రీనెక్‌ ఎక్సర్‌సైజ్‌లు, బ్రీతింగ్‌ ప్రాక్టీస్‌ చేయిస్తారు. అలాగే పర్వత త్రికోణాసన, అర్ధకటి చక్రాసన, వజ్రాసన తదితర ప్రాధమిక స్థాయి యోగాసనాలు వేయిస్తారు.  
బాడీ బ్యాలెన్స్‌: శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడమే దీని ఉద్దేశం. ర్యాంప్‌వాక్‌ చేసేటప్పుడు సరైన విధంగా అడుగులు కదపడానికి పిలాటిస్‌ వ్యాయామం చేయిస్తారు. అలాగే దృష్టిని ఒకే చోట నిలుపుతూ మాట్లాడడానికి  ఏకాగ్రత అవసరం. కాబట్టి యోగాని పిలాటిస్‌తో కలిపి ప్రత్యేక వర్కవుట్‌ చేయిస్తారు.  
బాడీ ఎటాక్‌: సాధన ఊపందుకున్నాక చేయించే ప్రక్రియ ఇది. దీనిలో భాగంగా క్రీడాకారుల శైలి వ్యాయామాలు చేయిస్తారు. కేవలం బాడీ వెయిట్‌తో మాత్రమే చేసే వర్కవుట్స్‌ దీని స్పెషాలిటీ. వీటికి ఏరోబిక్స్‌ కూడా జత చేస్తారు.  
బూట్‌ క్యాంప్‌: పచ్చని ప్రకృతి, సహజమైన వాతావరణంలో దీనిని చేయిస్తారు. ఇది సర్క్యూట్‌ స్టైల్‌ వర్కవుట్‌. పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్, లంజెస్, కెటిల్‌ బెల్స్, బాల్‌ వర్క్‌లతో పాటు స్కిప్పింగ్, రన్నింగ్, కాలిస్థెనిక్స్‌ వంటివి ఉంటాయి. మరికొందరితో కలిసి చేయాల్సిన వ్యాయామ విధానం ఇది.  
బాడీపంప్‌: చాలామంది అమ్మాయిలకు తమకు ఫ్యాట్‌ ఉన్న విషయం తెలియదు. ఈ కాంటెస్ట్‌లలో ఏ మాత్రం ఫ్యాట్‌ ఉన్నా ఫలితం వ్యతిరేకం కాక తప్పదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొవ్వును కరిగించే వ్యాయామశైలి అయిన బాడీపంప్‌ను చేయిస్తారు. వెయిట్స్‌తో చేసే స్ట్రెంగ్త్‌ ట్రయినింగ్‌ ఆధారంగా రూపుదిద్దుకున్న వ్యాయమం ఇది. లోయర్‌బాడీ కంటే అప్పర్‌ బాడీకి కాస్త ఎక్కువగా వెయిట్స్‌ ఉపయోగిస్తారు.  
లెథల్‌ లెగ్స్‌: సరైన టోనింగ్‌ ఉంటేనే లోయర్‌ బాడీ లుక్‌ బాగుంటుంది. అందుకే లోయర్‌బాడీ టోనప్‌ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందింది లెథల్‌ లెగ్స్‌. దీనిలో స్క్వాట్స్, లంజెస్, లెగ్‌ రైజర్స్, లెగ్‌ కిక్స్‌ వంటివి ఉంటాయి.   
కూల్‌డౌన్‌: వ్యాయామాన్ని వార్మప్‌తో ప్రారంభించి తప్పనిసరిగా దేహం కూల్‌డౌన్‌ కావాలి. దీనికోసం కొన్ని రకాల సెల్ఫ్‌ స్ట్రెచ్‌లు కనీసం 10సెకన్లు అదే భంగిమలో ఉండేట్టు చేయిస్తారు. శవాసనంతో ఫిట్‌నెస్‌ రొటీన్‌ ముగిసిన తర్వాత వ్యక్తిగత సందేహాలను నివృత్తి చేసేందుకు 15నిమిషాల పాటు గ్రూప్‌ డిస్కషన్స్‌ ఉంటాయి.  

డైట్‌..వెరీ స్పెషల్‌
అందాల పోటీల్లో పాల్గొనే వారికి డైట్‌ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఫ్యాట్‌లెస్‌గా అన్ని పోషకాలతో ఉంటుంది. తెల్ల బియ్యంతో వండిన అన్నం అసలు ఉండదు. ఇక అత్యధికంగా వినియోగించేవి కూరగాయలు. డైట్‌ విషయంలో టైమ్‌టేబుల్‌ ఏ మాత్రం మిస్సవకుండా జాగ్రత్త పడతారు. రోజుకు కనీసం గంటన్నర పాటు వ్యాయామాలు చేస్తున్నప్పుడు ముఖసౌందర్యం దెబ్బతినకుండా, మేని మెరుపు కోల్పోకుండా జాగ్రత్తగా డైట్‌ని తీర్చిదిద్దుతారు. పోషకాహార నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన  వంటకాల మెనూ వీరికి వడ్డిస్తారు. 

బ్రేక్‌ ఫాస్ట్‌: పుచ్చకాయ, బొప్పాయి పండు ముక్కలు, కీరదోసకాయ, టమాటా ముక్కలు, వెన్న తీసిన పెరుగు, వీట్‌ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్, ఎండు ఖర్జూరాలు, బాదం, ఎగ్‌ వైట్స్, ఉడకబెట్టిన బీన్స్, ఓట్‌మీల్, కొతిమీర పచ్చడి, ఊతప్పం, వెజిటబుల్‌ సాంబార్, బటర్‌మిల్క్, కమలా పండ్లు, పైనాపిల్‌ జ్యూస్, వీట్‌బ్రెడ్, విభిన్న గింజధాన్యాలతో రూపొందిన మల్టీ గ్రెయిన్‌ బ్రెడ్‌ తదితర సమాహారంగా ఉంటుంది.
లంచ్‌: టమాటా సలాడ్స్, క్యారెట్స్‌ లేకుండా ఇండియన్‌ గ్రీన్‌ సలాడ్స్, క్యాబెజీ రెడ్‌ ఆనియన్‌ సలాడ్స్, స్టీమ్డ్‌ అమెరికన్‌ కార్న్‌ చాట్, టమాటా సాస్‌తో గ్రిల్డ్‌ వెజిటబుల్స్, రోటీలు, మేతీ మూంగ్‌ దాల్, గోధుమ పిండి చపాతీలు ఉంటాయి.
డిన్నర్‌: స్టీమ్డ్‌ చికెన్, పప్పు, గోధుమ బ్రెడ్‌ రోల్స్, ఉడికించిన బ్రౌన్‌రైస్, చేపలు, పుదీనా పరాటాలు వంటివి రాత్రి డైట్‌కి ఉపయోగిస్తారు.  
 తరచూ వెజ్‌సూప్‌లు, కొబ్బరి నీళ్లు, జల్‌జీరా జ్యూస్‌లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ అందిస్తారు. ఇందులో పూర్తిగా కాకపోయినా కూసింతైనా ఫాలో అవగలిగితే కిరీటం సంగతేమో గానీ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడడం సాధ్యమే. అందుకే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచినవారు, ఫైనలిస్ట్‌గా మాత్రమే మిగిలినవారు కూడా ఈ కాంటెస్ట్‌ మా జీవితాన్ని మార్చేసింది అని చెబుతారు.  

మరిన్ని వార్తలు