కొమ్ములు తిరిగిన కొట్లాట

15 Aug, 2014 23:49 IST|Sakshi
కొమ్ములు తిరిగిన కొట్లాట

రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి... కత్తులతో మనుషుల్ని మనుషులు చంపుకునే వికృత క్రీడ ఎప్పుడో కనుమరుగైంది. కానీ అనాదిగా స్పెయిన్‌లో  బుల్‌ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చావే భయపడేలా అత్యంత క్రూరంగా చంపుతుంటే.. అది చూసి చప్పట్లు చరిచి, ఈలలు వేసే సంస్కృతి వందల ఏళ్లుగా వదలడం లేదు. క్రీడగా చెప్పుకునే బుల్‌ఫైట్‌పై ఈ వారం మైదానం ప్రత్యేకం.
 - శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
ఐదారు వందల కిలోల బరువున్న ఎద్దును ఎదుర్కోవడం ఒక మనిషికి సాధ్యం కాదు.. కానీ అదే ఎద్దును శారీరకంగా, మానసికంగా వేధించి.. రెండు రోజులు కడుపు మాడ్చి.. వీపుపై కత్తుల్లాంటి వాటితో పోట్లు పొడిచి.. రక్తం కారేలా చేసి.. ఇరవై నిమిషాల్లో చంపే వికృత క్రీడ బుల్ ఫైట్.. స్పెయిన్, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ ఫైట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది.
 
వందల ఏళ్లుగా...

ఎద్దులతో కొట్లాట అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్పెయిన్ బుల్‌ఫైట్. అక్కడ బుల్ ఫైటింగ్ కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. పురాతన రోమ్ కాలంలో బుల్ ఫైటింగ్‌కు ప్రజాదరణ చాలా ఎక్కువ. ఏళ్లుగా ఇది స్పెయిన్ సంస్కృతిలో భాగమైంది. అయితే స్పెయిన్‌లో ప్రస్తుత తరహాలో జరుగుతున్న  బుల్ ఫైటింగ్ 300 ఏళ్లుగా సాగుతోంది.
 
పోటీలకు ప్రత్యేక ఎద్దులు...

స్పెయిన్‌లో బుల్ ఫైటింగ్‌కు ఉపయోగించే ఎద్దులు ప్రత్యేక బ్రీడ్‌కు చెందినవి. పశువుల్లో ఉపజాతి అయిన బాస్ టారస్ ఇబెరికస్ ఎద్దును బుల్‌ఫైటింగ్‌లో ఉపయోగిస్తారు. వీటిని టోరో బ్రావో, ఇబెరియన్ బుల్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ స్పెయిన్‌తో పాటు పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో పెంచుతారు. ఇవి ఎక్కువగా నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అసాధారణ స్థాయిలో జన్యువులు, డీఎన్‌ఏ ఉండటం వల్ల దూకుడుతనం, శక్తి, బలం, సత్తువ అధికంగా ఉంటుంది. వీటినే పోటీల్లో బరిలోకి దించుతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న వీటి బరువు 500 నుంచి 700 కేజీల మధ్య ఉంటుంది.
 
వీళ్లే బుల్ ఫైటర్లు...

బుల్ ఫైటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించేది ప్రధాన మెటడారే. ఇతనికి స్టార్ హోదా ఉంటుంది. స్టార్ మెటడార్ కోసమే కొందరు ప్రత్యేకంగా బుల్ ఫైటింగ్ చూస్తారు. బుల్ ఫైటింగ్‌లో మెటడార్‌కు మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తారు. ముగ్గురు బాండెరిల్లేరోస్, ఇద్దరు పికెడార్‌లు తమ వంతు సాయం చేస్తారు. ఇక ఎద్దును చంపే క్రమంలో వీరందరి పాత్ర ఉన్నా.. చివరికి హీరో మాత్రం ప్రధాన మెటడారే.
 
అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలూ...

బుల్ ఫైటింగ్ ఉద్దేశం ఎద్దులను చంపడం. అయితే ఈ పోటీల్లో అప్పుడప్పుడు బుల్‌ఫైటర్లు చనిపోతారు. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రెచ్చగొట్టే క్రమంలో కానీ.. లేదంటే వాటి వీపులో పికాను లేదంటే బ్యాండెరిల్లాస్‌ను పొడిచే క్రమంలో బుల్‌ఫైటర్లను ఎద్దులు కుమ్మేస్తాయి. ఎద్దుల కుమ్ముడికి బుల్‌ఫైటర్లు చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1700వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా బుల్ ఫైటర్లు చనిపోయినట్లు విశ్లేషకుల అంచనా.
 
ఫైటర్లు.. శిక్షణ..
 
బుల్ ఫైటింగ్‌లో ఎద్దును చంపడమంటే మాటలు కాదు.. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రింగ్‌లో చంపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. బుల్ ఫైటర్ల కోసం బుల్ ఫైటింగ్‌ను ప్రోత్సహించే దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే స్కూళ్లు కూడా ఉంటాయి. చాలా మంది శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐదేళ్ల వయసు నుంచి బుల్‌ఫైటింగ్‌లో ట్రైనింగ్ ఇస్తారు.  ఇక స్పెయిన్‌లో బుల్‌ఫైటర్ రింగ్‌లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది.
 
జంతు ప్రేమికుల సమరం...
 
బుల్‌ఫైట్ చూసే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతీయేటా ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల కారణంగా 2.5 లక్షల ఎద్దులు చనిపోతున్నాయి. అయితే వీటిని అత్యంత పాశవికంగా చంపడాన్ని నిరసిస్తూ కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బుల్ ఫైటింగ్ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్‌లో జరుగుతున్నాయి. అయితే జంతు ప్రేమికుల పోరాటం కారణంగా అర్జెంటీనా, కెనడా, క్యూబా, డెన్మార్క్, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో బుల్ ఫైటింగ్‌పై నిషేధం విధించారు.
 
క్రీడనా? కళనా?

వందల ఏళ్లుగా జరుగుతున్న బుల్ ఫైటింగ్ క్రీడ అని కొందరు వాదిస్తుంటే.. కాదు కాదు.. ఇదో కళ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో జరుగుతుండటంతో బుల్‌ఫైటింగ్‌పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఎద్దులను చంపడమూ ఓ క్రీడేనా? అని సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి.
 
బుల్‌ఫైట్ సాగేదిలా...
 
కేవలం 20 నిమిషాల్లో ముగిసే బుల్‌ఫైట్ మూడు దశల్లో సాగుతుంది. ఎద్దును భయపెట్టేలా శబ్దం చేయడంతో పోటీ ప్రారంభమవుతుంది.
     
తొలి దశలో పికెడార్‌లు గుర్రంపై స్వారీ చేస్తూ ఎద్దును కవ్విస్తారు. అలిసిపోయేలా చేయడమే వారి పని.
     
అదే క్రమంలో వాళ్లు తమ దగ్గరున్న 6 నుంచి 8 అంగళాల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న ‘పికా’ అనే ఆయుధంతో వీపు భాగంలో పొడిచి మెడ నరాలు తెగేలా చేస్తారు. దీంతో ఎద్దు శరీరంలోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎద్దు మరణానికి ఇక్కడే కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
     
రెండో దశలో సహాయ మెటడార్‌లు(వీరిని బాండెరిల్లేరోస్ అని కూడా పిలుస్తారు) బ్యాండెరిల్లాస్(ఈటె లాంటి పదునైన కత్తి)తో రంగంలోకి దిగుతారు. ఐదు, ఆరు బ్యాండెరిల్లాస్‌లను ఎద్దు వీపుభాగంలో లోనికి గుచ్చుతారు. దీంతో అది అలిసిపోతుంది.  
     
మూడోది, అంతిమ దశలో ప్రధాన మెటడార్ రింగ్‌లోకి వచ్చి ఎద్దు ప్రాణాలను తీస్తాడు. ఎరుపు బట్టతో ఎద్దును ఆటూ ఇటూ ఆడిస్తూ అది పూర్తిగా కింద పడిపోయేలా చేస్తాడు. ఇదంతా ముగియడానికి 6 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ప్రధాన మెటడార్ ప్రాణాలు తీయడంలో ఇబ్బంది పడితే అతనికి సహాయకుడిగా మరొకరు రింగ్‌లోకి వస్తారు. చివరికది రక్తం కక్కుకుని ప్రాణాలు విడుస్తుంది.
 
పలు దేశాల్లో...
బుల్ ఫైటింగ్‌లో ఎద్దును అత్యంత క్రూరంగా చంపడాన్ని చూశాం... అయితే కొన్ని దేశాల్లో బుల్ ఫైట్‌ను అటు ఎద్దుకు, ఇటు బుల్ ఫైటర్‌కు హాని జరగకుండా పోటీలు నిర్వహిస్తారు. మరికొన్ని దేశాల్లో రెండు ఎద్దుల మధ్య పోటీలను కూడా నిర్వహిస్తారు.
 
 పెర్షియన్ గల్ఫ్(ఒమన్, యూఏఈ)లో రెండు ఎద్దుల మధ్య బుల్ ఫైట్ పోటీలు జరుగుతాయి.
 
 అమెరికాలో బుల్ ఫైటర్ (రొడియో క్లౌన్) పేరుతో పోటీలు జరుపుతారు.
 
 టర్కీ, టాంజానియా, జపాన్‌లలో ఎద్దుల మధ్య పోటీలు నిర్వహిస్తారు.
 
జల్లికట్టుపై సుప్రీం నిషేధం...

భారత్‌లో అత్యంత వివాదాస్పదమైన క్రీడ ‘జల్లికట్టు’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ ఏడాది మేలో నిషేధం విధించింది. ప్రతీయేటా తమిళనాడులో జరిగే ఈ జల్లికట్టు పోటీలు జరిగిన ప్రతీసారి వివాదాస్పదమే. స్పెయిన్ బుల్‌ఫైటింగ్‌లా ఎద్దును ఈ పోటీల్లో చంపరు. అయితే ఇందులో పాల్గొనే వాళ్లు ఎద్దును  లొంగదీసుకుంటారు. ఈ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
 
ఆ రెండు రోజులూ...

బుల్ ఫైట్‌లో రింగ్‌లోకి వచ్చిన ఎద్దు రంకెలేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొమ్ములతో కుమ్మేయాలన్న కసితో అటూ, ఇటూ పరుగెత్తుతుంది. అయితే సాధారణంగా ఎద్దులు ఎవరికీ హాని చేయవు. కానీ రింగ్‌లోకి వచ్చిన తర్వాత అది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. అలా చేయడానికి కారణం ఉంది. బుల్‌ఫైట్‌కు సిద్ధం చేయడంలో భాగంగా రెండు రోజుల పాటు దానికి నరకం చూపిస్తారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు.
 
నీళ్లలో తడిపిన న్యూస్ పేపర్లను దున్నపోతు రెండు చెవుల్లోకి దూరుస్తారు. దీంతో వాటికి ఏమీ వినిపించదు.
 
దూదిని ముక్కు రంధ్రాల్లోకి దూర్చడం ద్వారా  శ్వాసక్రియకు ఆటంకం కలిగేలా చేస్తారు. ఫలితంగా అది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది.
 
 వాజిలిన్‌ను రెండు కళ్లకు రుద్దుతారు. దీంతో వాటికి చూపు మందగిస్తుంది.
 
 కాళ్లు కాలిపోతున్నాయనిపించేలా గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని పూస్తారు. దీనివల్ల ఎద్దు పట్టుతప్పిపోతుంది. ఒకరకంగా అది కింద పడిపోయేలా చేస్తుంది.
 
 జననాంగాల్లోకి సూదిని గుచ్చుతారు.
 
 బలమైన లాక్సెటీవ్స్ అనే డ్రగ్స్‌ను ఆహారంతో కలిపి పెడతారు. అది తిన్న ఎద్దు విరేచనాలకు లోనవుతుంది. ఫలితంగా నీరసంగా తయారవుతుంది.
 
 ఎద్దు బలహీనంగా తయారయ్యేలా (కొన్నిసార్లు బలంగా తయారయ్యేలా) డ్రగ్స్ తినిపిస్తారు.
 
 రింగ్‌లోకి  పంపే కంటే రెండు రోజుల ముందు ఎద్దును చీకటిగా ఉన్న బాక్స్‌లో ఉంచుతారు. దీంతో అది దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది.  
 
 రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా రింగ్‌లోకి వదులుతారు. బాక్స్‌లోంచి బయటకు వచ్చిన ఎద్దు తనకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్న భావనతో రింగులో కలియ తిరుగుతుంది. అదే సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కొమ్ములతో చంపేయాలన్న కసి దానిలో కనిపిస్తుంది. అందుకే రింగ్‌లో కనిపించిన వారిని కనిపించినట్లుగా కుమ్మేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది.
 

మరిన్ని వార్తలు