గడ్డికి అగ్గి.. భూసారం బుగ్గి!

19 Nov, 2019 06:28 IST|Sakshi

పొలాల్లో ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలకు నిప్పు

టన్ను బరువైన గడ్డికి నిప్పు పెడితే సేంద్రియ కర్బనం సహా 33.8 కిలోల పోషకాలు వృథా

పంట కోతలు, నూర్పిళ్లు పూర్తయ్యాక గడ్డిని, మోళ్లకు నిప్పంటించడం అనే దురలవాటు వల్ల గాలి కలుషితమవుతుండటమే కాకుండా భూసారం నాశనమవుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల గాలిలో ధూళికణాల సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగిపోవటంతో ఇటీవల కొన్ని రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి రావడం మనకు తెలుసు. ఈ దుస్థితికి ఒకానొక ముఖ్య కారణం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వరి పంటను యంత్రంతో కోసిన తర్వాత మిగిలే మోళ్లను తగులబెట్టడమేనని తెలిసిందే. ఇలా పంట పొలాల్లో గడ్డీ గాదాన్ని వదిలించుకోవడానికి నిప్పు పెట్టటం వల్ల గాలి పీల్చడానికి పనికిరానంత పాడైపోతోంది సరే. అయితే, భూమికి ఏమేరకు నష్టం జరుగుతోంది?

 దేశంలో ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. రైతులు తగులబెడుతున్న పంటవ్యర్థాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్య పంటల మోళ్లను, చెరకు ఆకులే 70% వరకు ఉంటాయని, ఇందులో 34% వరి గడ్డి, 22 శాతం గోధుమ గడ్డి ఉన్నాయని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. పంజాబ్‌లో ఏటా 2 లక్షల టన్నుల వరి గడ్డి ఉత్పత్తవుతుండగా, ఇందులో 80 శాతం గడ్డిని తగులబెడుతున్నారు.

పొలంలో గడ్డికి నిప్పంటిస్తే ఆ భూమిలో ఒక సెంటీమీటరు లోతు వరకు భూమి పైపొరలో మట్టి 33.8–42.2 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతకు గురవుతుంది. ఫలితంగా భూసారానికి అత్యంత కీలకమైన సూక్ష్మజీవరాశి, శిలీంధ్రాల సంతతి నశించిపోతుంది. అంతేకాదు, భూమి సేంద్రియ లక్షణం కూడా నాశనమవుతుంది. భూమి పైపొరలోని మేలు చేసే మిత్రపురుగులు నశించిపోవడం వల్ల పంటలపై శత్రుపురుగుల దాడి పెరిగిపోతుంది. తగులబడిన భూమి పైపొర మట్టికి నీట కరిగే సామర్థ్యం తగ్గిపోతుంది.

ఒక టన్ను పంట వ్యర్థాలను తగులబెట్టినప్పుడు మట్టిలోని సేంద్రియ కర్బనంతోపాటు (5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 25 కిలోల పొటాషియం, కిలోకు పైగా గంధకం వంటి) 33.8 కిలోల పోషకాలు నాశనం అవుతున్నాయని ఒక అంచనా. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత కొద్ది రోజుల్లోనే గోధుమ నాటుకోవాల్సిన అవసరం కొద్దీ రసాయనిక వ్యవసాయం చేసే రైతులు కంబైన్‌ హార్వెస్టర్‌ ద్వారా వరి ధాన్యం నూర్పిడి చేసిన తర్వాత మోకాళ్ల ఎత్తున ఉండే మోళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు. ప్రభుత్వం నిషేధించినా, జరిమానాలు విధించినా రైతులు ఈ అలవాటు మానలేకపోతున్నారు.

అయితే, ఒక అధ్యయనం ప్రకారం పంజాబ్, హర్యానా ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు గడ్డిని అసలు తగులబెట్టడం లేదని తేలింది. ఒకటికి నాలుగు పంటలను కలిపి పండించడం, పంట వ్యర్థాలను భూమికి ఆచ్ఛాదనగా లేదా కంపోస్టు తయారీకి వాడుకోవడం(వ్యర్థాల పునర్వినియోగం).. ఇవి సేంద్రియ సేద్యంలో ముఖ్యమైన నియమాలు. అందువల్ల సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులకు గడ్డిని తగులబెట్టే అవసరం రావడం లేదన్న మాట. రసాయనిక వ్యవసాయం, ఏక పంటల సాగు పద్ధతిలోనే ఈ సమస్య మూలాలున్నాయని గ్రహించాలి.

కంపోస్టు తయారీ పద్ధతి
వరి గడ్డి వంటి పంట వ్యర్థాలను పశువుల పేడ, మూత్రాన్ని కలిపి సూక్ష్మజీవుల తోడ్పాటుతో కుళ్లబెట్టి కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు, తగినంత పొడవుతో గొయ్యి తీయించాలి. అందులో చెత్తను ఆరు అంగుళాల మందం వరకు నింపి, దానిపై పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. తిరిగి ఇంకొక 6 అంగుళాల మందం వరకు మళ్లీ గడ్డి, పొట్టు వంటి సేంద్రియ వ్యర్థాలు వేయాలి. తిరిగి పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. ఈ విధంగా గడ్డి గాదాన్ని పొరలు పొరలుగా వేస్తూ.. భూమిపై ఎత్తుగా దిబ్బ వేసుకోవాలి. దిబ్బ లోపలికి గాలి పోకుండా పేడతో పూత పూయాలి. సూక్ష్మజీవుల చర్య ద్వారా గొయ్యిలో వేసిన గడ్డీ గాదం కుళ్లి సుమారు 90–100 రోజుల్లో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా