క్యాంపస్ అంబాసిడర్‌‌ - పి. నరహరి- ఐఐఎం - ఇండోర్

28 Sep, 2014 23:25 IST|Sakshi
క్యాంపస్ అంబాసిడర్‌‌ - పి. నరహరి- ఐఐఎం - ఇండోర్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - ఇండోర్. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ సంస్థ.. ఏ ఐఐఎంలోనూ లేని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియెట్ అర్హతతోనే అందిస్తోంది. ఇక్కడ సెకండియర్ పీజీపీ చదువుతున్న పాయల నరహరి.. ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీగా కూడా ఉన్న ఆయన తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా...
 
క్యాంపస్ అద్భుతం

మా ఊరు చిత్తూరు జిల్లాలోని పాయలవారిపల్లి. క్యాంపస్.. దాదాపు 200 ఎకరాల్లో ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పరంగా.. ఆడిటోరియం, లైబ్రరీ, క్యాంటీన్, హాస్టళ్లు, ల్యాబ్ లు, ప్లే గ్రౌండ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. రెండేళ్లకు కలిపి కోర్సు ఫీజు రూ.15 లక్షలు. ప్రతి రోజూ ఉదయం 8.45 నుంచి రాత్రి 11.30 వరకు క్లాసులు, ఇండస్ట్రియల్ లెక్చర్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్.. ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాం.
 
ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు

రెండేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. రెండో ఏడాదిలో ఎన్నో ఎలక్టివ్స్ అందుబాటులో ఉంటా యి. గవర్నెన్స్, స్ట్రాటజీ, ఆపరేషన్స్, ఫైనా న్స్.. ఇలా ఎన్నింటినో ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో ఒక కంపెనీ మేనేజర్‌కు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, నాయకత్వ నైపుణ్యాలను నేర్పిస్తారు. కోర్సులో భాగంగా ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు ఉంటాయి.
 
కేస్ స్టడీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం
 
అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ కోర్సులో భాగంగా ఉంటాయి. లెక్చర్‌తోపాటే ఆయా అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఎక్కువగా వివిధ కంపెనీల పరాజయాలను కేస్ స్టడీస్‌గా ఎంచుకుంటాం. సంబంధిత కంపెనీ చేపట్టిన స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది? అందుకు దారితీసిన కారణాలేమిటి? ఎక్కడ లోపాలు దొర్లాయి? ఎలా చేసి ఉంటే విజయవంతమయ్యేది? ఇలా సమస్యను విశ్లేషించి పరిష్కారం సూచిస్తాం.
 
కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి
 
ఐఐఎం- ఇండోర్‌లో మరో అద్భుత కార్యక్రమం.. రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థుల గ్రూప్‌కు ఒక్కో జిల్లా కేటాయిస్తారు. విద్యార్థుల బృందం.. ఆ జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగా అందుతున్నాయా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? పరిష్కార మార్గాలు.. ఇలా అధ్యయనం చేసి ఒక నివేదికను సంబంధిత జిల్లా కలెక్టరుకు ఇవ్వాలి.
 
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్..
 
మన తెలుగు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సును అత్యుత్తమ కెరీర్ ఆప్షన్‌గా భావించాలి. కోర్సులో చేరితే మంచి భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. చిన్నవయసులోనే మంచి ఎక్స్‌పోజర్ ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ప్రభుత్వాలు చేపట్టే వివిధ పథకాల అమలు, ప్రజలకు పథకాల లబ్ధి చేరడం కోసం ప్రభుత్వం మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటే మంచిదని నా అభిప్రాయం.
 

మరిన్ని వార్తలు