సంబంధం... బంధాల సమ్మేళనం !

27 Jul, 2017 23:12 IST|Sakshi
సంబంధం... బంధాల సమ్మేళనం !

ఆత్మీయం

రోజువారీ జీవితంలో మనకు రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా సందర్భాలలో మన సన్నిహితులతో సంబంధాలే ఆ సమస్యలకూ, ఇబ్బందులకూ, ఆందోళనలకూ పునాది వేస్తుంటాయి. దాంతో, కోపం వస్తుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, అసలు ఈ ‘సంబంధం’ అనే మాటలోనే ‘బంధం’ అన్న పదముంది. అంటే, ప్రతి సంబంధమూ తెలియకుండా బంధనాల మధ్య చిక్కుపడేలా చేస్తుంటుందన్న మాట.

ఒక్కసారి మన సంబంధాల గురించి ఆలోచిస్తే... తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో, తోడబుట్టినవాళ్ళతో, బంధువులతో, మిత్రులతో, సహోద్యోగులతో, పరిచయస్థులతో – ఇలా ప్రతి ఒక్కరితో మనకున్న సంబంధాలపై దృష్టి సారించాలి. ఆ సంబంధాల వల్ల అవతలివారి నుంచి మనకూ, అలాగే మన నుంచి అవతలివారికీ ప్రశాంతత లభిస్తోందా, లేదా అన్నది చూసుకోవాలి. నిజంగా సంతోషం కలుగుతోందా అన్నది ఆలోచించాలి. నిజానికి, చాలా సందర్భాలలో సంతోషం ఉండదు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడమే ఉంటుంది.
అలాగని మనం ఈ ప్రపంచాన్ని వదిలేసి, ముక్కుమూసుకొని అడవుల్లో తపస్సు చేసుకుంటూ కూర్చోలేం కదా.

ఎవరితోనూ సంబంధం లేకుండా గడపలేం కదా. సరిగ్గా ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి మన యోగులు, మహర్షులు చెప్పిన మార్గం ఒకటుంది. అంచనాలు, ఆకాంక్షలు, కోరికలు లేకుండా ప్రేమపూర్వకంగా మనుషుల మధ్య సంబంధాలను పట్టి ఉంచేది ఆధ్యాత్మికత అని వారు తేల్చారు. మానవ సంబంధాల వల్ల సమస్యలు వస్తున్నాయని భావిస్తే, ఈ రకమైన ఆధ్యాత్మిక సంస్కృతిని దానిలో మేళవించడం కీలకం. దానివల్ల మనుషుల మధ్య షరతులు లేని ప్రేమబంధం నెలకొంటుంది. అప్పుడు బాధలు, కష్టాలు ఉండవు.

>
మరిన్ని వార్తలు