బుడగలు సృష్టిస్తే కేన్సర్‌ మాయం!

7 Jun, 2018 00:34 IST|Sakshi

రక్తనాళాల్లో సూక్ష్మస్థాయి బుడగలను సృష్టిస్తే కేన్సర్‌ కణాలను చిటికెలో నాశనం చేయవచ్చునని అంటున్నారు చైనా, ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా... ఇందులో మంచి తర్కమే ఉంది. కేన్సర్‌ కణుతులు బోలెడన్ని రక్తనాళాలను సృష్టించుకుని శక్తిని గ్రహిస్తూంటాయి. రక్తసరఫరా ఆగిపోతే కణుతులు పెరగలేవు. కొద్దికాలంలోనే నశించిపోతాయి కూడా. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఆచరణలోకి తీసుకువచ్చే విషయంలో ఇబ్బందులు ఉండేవి. చైనా, ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు ఒక ద్రవాన్ని కణితికి రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళంలోకి ఎక్కించారు. ఆ తరువాత కొన్ని శబ్ద ప్రకంపనలను ప్రసారం చేసినప్పుడు ఈ ద్రవం నుంచి బుడగల్లాంటివి ఏర్పడ్డాయి. రక్త సరఫరాను అడ్డుకున్నాయి కూడా.

అంతేకాకుండా .. చిన్నస్థాయి బుడగలు క్యాపిలరీల్లోకి కూడా వెళ్లిపోయి అక్కడ విధ్వంసం సృష్టించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మింగ్సీ వాన్‌ తెలిపారు. ఈ సరికొత్త గ్యాస్‌ ఎంబోలో థెరపీ ద్వారా మందులు కూడా నేరుగా కణుతుల్లోకి ఎక్కించవచ్చునని, ఫలితంగా అతి తక్కువ దుష్ప్రభావాలతో చికిత్స సాధ్యమవుతుందని వివరించారు. త్వరలోనే ఎలుకలపై పరీక్షించి ఈ విధానానికి మరింత పదును పెడతామని, ఆ తరువాత అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు