పౌష్టికాహారంతో కేన్సర్‌ ముప్పు తక్కువ

27 Jul, 2018 01:41 IST|Sakshi

పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ.. తగినంత వ్యాయామం చేస్తూ... మద్యానికి దూరంగా ఉంటే కేన్సర్‌ వచ్చే అవకాశం చాలా తక్కువని అంటున్నారు అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా! కొత్తేముంది అంటున్నారా? చాలానే ఉంది. 2009లో మొదలైన ఒక సర్వే ఆధారంగా తాము ఈ అంచనాలకు వచ్చినట్లు తాజా అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టోవోయిర్‌ చెప్పారు. నలభై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 41 వేల మంది ఆహారపు అలవాట్లను పరిశీలిస్తూ సాగింది ఈ అధ్యయనం. ఆరు నెలలకు ఒకసారి వీరు తమ ఆహారపు అలవాట్లను ఇంటర్నెట్‌ ద్వారా పరిశోధకులకు అందించారు. ఆ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు పోషక విలువలను లెక్కగట్టి విశ్లేషించారు.

దాదాపు ఎనిమిదేళ్ల తరువాత సర్వే చేసిన వారిలో 1489 మందికి కేన్సర్‌ సోకినట్లు తెలిసింది. ప్రత్యేకమైన సిద్ధాంతాలను ఉపయోగించుకుని కేన్సర్‌ వచ్చినవారు తీసుకున్న ఆహారానికి, ఇతరుల ఆహారానికి ఉన్న తేడాలను గమనించినప్పుడు అధిక పోషకాహారం తీసుకున్న వారికి కేన్సర్‌ వచ్చే అవకాశం 12 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. రొమ్ము కేన్సర్‌ విషయంలో ఇది 14 శాతం కాగా, ప్రోస్టేట్‌ కేన్సర్‌ విషయంలో 12 శాతమని టోవోయిర్‌ తెలిపారు. ఈ అధ్యయనం ద్వారా మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా కేన్సర్‌ ముప్పును తగ్గించవచ్చునని తెలుస్తోందని వివరించారు.  

>
మరిన్ని వార్తలు