సత్ఫలితాలిస్తున్న  కేన్సర్‌ వ్యాక్సిన్‌...

8 Mar, 2018 04:42 IST|Sakshi

ఇమ్యునోథెరపీ ద్వారా కేన్సర్‌కు మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. కేన్సర్‌ కణాలపై ఉండే వేర్వేరు పెప్టైడ్‌లతో తయారైన వ్యాక్సిన్‌ కణుతులను సమర్థంగా నాశనం చేయగలదని వీరు ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా స్పష్టమైంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసేందుకు ఈ పెప్టైడ్‌లు ఉపయోగపడతాయని చాలాకాలంగా తెలిసినప్పటికీ వేర్వేరు పెప్టైడ్‌లను ఒకచోట చేర్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ ఇమ్యునోథెరపీతో పరిమితమైన ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో వైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చర్మం అడుగుభాగంలోకి చొప్పించగల ఓ ప్రత్యేక పదార్థంతో ప్రయోగాలు చేశారు.

గొట్టం లాంటి ఆకారంలోకి మారిపోయే ఈ పదార్థంపై ఒక రకమైన పాలిమర్‌ పూత పూశారు. తద్వారా తాము కేన్సర్‌ కణాలకు చెందిన వేర్వేరు రకాల పెప్టైడ్లను ఒక దగ్గరకు చేర్చగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలిన్‌ లీ తెలిపారు. రోగనిరోధక వ్యవస్థకు చెందిన డ్రెన్‌డ్రైటిక్‌ కణాలు ఈ పెప్టైడ్‌లను గుర్తించి చైతన్యవంతమవుతాయని.. వాటిపై దాడి చేసి నాశనం చేస్తాయని లీ అన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు