సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు

20 Dec, 2018 00:24 IST|Sakshi

నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్‌ షాప్‌లు, ఫోన్లలోనే డాక్టర్‌ సలహాలు, ఓవర్‌ ది కౌంటర్‌ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, ఇంటర్నెట్‌ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చి సమస్యను తీవ్రం చేసే మరొక అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడట వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌కు ప్రమోషన్‌ ఇచ్చి లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. 

అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే కనుగొంటే ఆధునిక వైద్యంలో ఏ సవాలుకైనా సమాధానం లభిస్తుంది. రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సావిధానాలు రెండూ వైద్యరంగానికి కొత్తదనాన్ని సంతరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. క్యాన్సర్‌ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే సాధారణ లక్షణాలూ కొంత ఎక్కువ కాలం కొనసాగినప్పుడు రోగి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అందుకే సాధారణ లక్షణాలే ఒక్కోసారి క్యాన్సర్లను ఎలా పట్టిస్తాయో తెలుసుకోవడం మంచిది.  

తలనొప్పి:  చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్‌ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. తలనొప్పికి కారణం తెలుసుకోవడం, మైగ్రేన్‌ అయితే నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడితే సమస్య తగ్గుతుంది. ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్‌ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు. 

గొంతునొప్పి: చల్లటి పదార్థాలు, వాతావరణం, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. రెండుమూడు రోజుల్లో తగ్గకపోతే మందులు కోర్సుగా వాడటం లాంటి ప్రయత్నాలు చేశాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. థైరాయిడ్‌ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి. 

దగ్గు, ఆయాసం: ముఖ్యంగా సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్‌ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహిస్తే మంచిది. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు. 

కడుపు ఉబ్బరం, మంట: వేళకు ఆహారం తీసుకోకపోవడం, కంటికి ఇంపుగా నోరూరించే అనారోగ్య పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో మనలో చాలా మంది కడుపులో మంట, తేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గడం, వికారం వంటి లక్షణాలను తరచూ చూస్తున్నారు. ముందు సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్‌ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది. 

మూత్రవ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడటం, ఆగిఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని కొందరు భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్‌ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా  పొరబడవచ్చుగానీ కొన్ని సందర్భాల్లో ఒవేరియన్, యుటిరైన్‌ క్యాన్సర్లు కూడా అయ్యే అవకాశాలుంటాయి. 

మలవిసర్జనలో తేడాలు: అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే మాత్రం దాన్ని పైల్స్‌ అనుకుంటే పొరబాటు పడుతున్నట్లే. దక్షిణభారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపించే కోలన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. ఆహార పదార్థాలు మార్చి మార్చి తీసుకుంటూ ఇబ్బందిపడే కంటే సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ అసలు భాగం నుంచి ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. 
ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. 

అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్‌ / లంగ్‌ క్యాన్సర్లకు సూచన కావచ్చు. శరీరం మీద మచ్చలు, వాటిలో మార్పుల మీద కూడా ఒక కన్నేసి ఉంచితే మంచిది. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్‌ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్‌చెకప్స్‌ చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు.


Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

మరిన్ని వార్తలు