ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?

19 Apr, 2020 18:10 IST|Sakshi

మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? అని మనం చాలాసార్లు అనుకుంటాంగానీ మనిషన్న వాడు ఒక్కసారి కూడా దగ్గకుండా ఉంటాడా? అని అనుకోం. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి! ఊపిరితిత్తుల అంతరాళాల నుంచి వెలువడే పేలుడు లాంటి దగ్గును నిభాయించుకోవటం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఇదే జరిగిందనుకోండి. నిజానికి దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో మొదలు కాదు. మనం ఊపిరి తీసుకునే క్రమంలో గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకునేటప్పుడే మొదలవుతుంది. ఛాతీ, కడుపు, డయాఫ్రంలలోని కండరాలు ఒక్కసారి కుంచించుకుపోతాయి.

మామూలుగానైతే ఇది మన ముక్కులు, నోటి నుంచి గాలిని బయటకు తోస్తాయి కానీ కొండ నాలుక అడ్డుగా ఉంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. కొండ నాలుక తెరుచుకోగానే ఈ ఒత్తిడితో కూడిన గాలి మొత‍్తం నోటి ద్వారా వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ వెలువడతాయి. ఒకవేళ మనిషికి దగ్గు అనేది రాకపోతే కొండనాలుక మూతపడదు కాబట్టి ఊపిరితిత్తులు, అన్నవాహికలో గాలి చిక్కుకుపోదు. ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ ఉండవు. భలే ఉందే ఇది.. ఇలాగే జరిగితే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది చిక్కు. దగ్గు అనేది లేకపోతే మన గొంతు, శ్వాస వాహికలను చికాకుపెట్టే దుమ్ము, ధూళి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. వాటితోపాటు వచ్చే బ్యాక్టీరియా కూడా అక్కడే మకాం వేస్తుంది. వేగంగా అనారోగ్యం బారిన పడిపోతాం. ఆ విషయం మీకు తెలియను కూడా తెలియదు.

ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ అవుతుంది. శ్వాస ఆగిపోతుంది. దీంతో జనాలు దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నిలిచిపోతారు. అంటే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందన్నమాట. ఇది మళ్లీ మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు దారితీస్తుంది. పనిచేయబుద్ధి కాదు. ఉత్పాదకత తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. మీకు తెలుసా? ఒక వ్యక్తి రోజులో కనీసం 11సార్లు దగ్గుతారట. మన మనుగడకు దగ్గు ఎంత ముఖ్యమైనదంటే వైద్యులు ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల్లోని కఫాన్ని బయటకు తోసేసేందుకు రోగులతో బలవంతంగా దగ్గిస్తున్నారు. దీనికి అసిస్టివ్‌ కాఫ్‌ అని పేరు. అదృష్టం ఏమిటంటే కనురెప్పలు మూసినంత సహజంగా మనం దగ్గగలగడం. కావాల్సినప్పుడు ఆన్‌/ఆఫ్‌ చేయలేకపోవడం. కాబట్టి... దగ్గు వచ్చిందనుకోండి... ముఖానికి ఏదో ఒకటి అడ్డుపెట్టుకొని ఖళ్లు ఖళ్లు మనిపిస్తే సరి! అయితే వీలైనప్పుడల్లా చేతులు కడుక్కోవడం మరిచిపోకండి సుమా!

మరిన్ని వార్తలు