తలసరి ఆదాయంలో వెనుకే ఉన్నాం!

13 Jul, 2018 00:38 IST|Sakshi

ఈ విషయంలో అభివృద్ధి చెందాల్సింది ఎంతో ఉంది 

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌  

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం ఊహించినదేనని, తలసరి ఆదాయ పరంగా ఇప్పటికీ మనం తక్కువ స్థాయిలోనే ఉన్నామని, ఈ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌. అంతర్జాతీయంగా భారత్‌ చెప్పుకోతగ్గ స్థాయిలో జోక్యం చేసుకునే విధంగా ఉండాలని కుమార్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మన దేశం బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ‘‘చాలా ఎక్కువగా అంచనా వేసిందే. అధిక వృద్ధి రేటు ఫలితమే ఇది. త్వరలోనే బ్రిటన్‌ను అధిగమిస్తాం. 2018లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఐదో స్థానానికి చేరుకుంటాం. 

కానీ, మన తలసరి ఆదాయం ఫ్రాన్స్‌తో పోలిస్తే 20 రెట్లు తక్కువ. కనుక మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు’’ అని రాజీవ్‌ కుమార్‌ అన్నారు. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్‌ పాత్ర అంతర్జాతీయ వేదికపై మరింత ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తగిన విధంగా సన్నద్ధమై, జాతి ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా అర్థవంతమైన పాత్ర పోషించాలన్నారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన గణాంకాల ఆధారంగా 2017లో మన దేశం 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో స్థానికి చేరుకున్న విషయం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు