కారు డ్రైవర్ చెప్పిన పాఠాలు

27 Apr, 2014 22:36 IST|Sakshi
కారు డ్రైవర్ చెప్పిన పాఠాలు

ప్రేరణ
 
ఆయన వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు. జుట్టు నెరిసిపోయింది. చూపు మందగించింది. ఆ వ్యక్తి  దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలో 25 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. అలాగనీ ఆయన భారీ వేతనం వచ్చే చాలా గొప్ప ఉద్యోగం చేసినవారు కాదు. పేరు కూడా మీరు ఇప్పటిదాకా విని ఉండరు. ఆయన నా కారు డ్రైవర్. పేరు కరుణన్..  జీవితంలో కొన్నిసార్లు విలువైన పాఠాలను సాధారణ వ్యక్తుల నుంచి కూడా నేర్చుకుంటాం. ఓ రోజు ఉదయం కరుణన్ నాతో చాలాసేపు మాట్లాడారు. తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కరుణన్‌గొప్ప కాలేజీల్లో ప్రముఖుల సమక్షంలో అతిథి ప్రసంగాలు చేయకపోయినా ఆయన నాతో  చెప్పినవి నేటి యువతరానికి తప్పకుండా ఉపయోగడతాయి. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
 
లెసైన్స్ వస్తే డ్రైవింగ్ వచ్చినట్టేనా?
 
డ్రైవింగ్ లెసైన్స్ వచ్చినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. అంతకు కొన్ని నెలల ముందుగానే కారు నడపడం నేర్చుకున్నా. లెసైన్స్ వచ్చేయగానే డ్రైవర్ అయినట్లు కాదు. అది వాహనం నడపడానికి ఒక అనుమతి పత్రం మాత్రమే. అథారిటీ స్టాంప్ లాంటిది కాదు. కారును పూర్తిగా నడపడం వచ్చినవారే డ్రైవర్ తప్ప లెసైన్స్ సంపాదించుకున్నవారు డ్రైవర్ కాలేరు. ఎంబీఏ డిగ్రీ ఒక వ్యక్తిని మేనేజర్‌గా మార్చలేదు. కొన్నేళ్లు పని నేర్చుకొని, తగిన అనుభవం సంపాదిస్తేనే మేనేజర్ అనే హోదాను పొందుతారు. నేటితరం విద్యార్థులు డిగ్రీ చేతికి రాగానే అన్ని నేర్చుకున్నట్లేనని భ్రమపడుతున్నారు. కానీ, అది ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఒక డిగ్రీ, డిప్లొమా, లెసైన్స్... వాస్తవ జీవిత అనుభవాల నుంచి నేర్చుకొనేందుకు ఒక వ్యక్తికి తగిన అర్హత కల్పిస్తాయి. అంతేతప్ప పరిపూర్ణుడిగా మార్చలేవు.
 
బాహ్య ప్రపంచం ఎంతో భిన్నం:
 
నేను కారు నడపడం నేర్చుకున్నా. కానీ, నా తొలి ఉద్యోగం చిన్న టెంపో వాహనం నడపడం. కారుతో పోలిస్తే దీని స్టీరింగ్ చక్రం, గేర్లు చాలా భిన్నంగా ఉన్నాయి. నేను దీన్ని తేలికగా డ్రైవ్ చేస్తానని అనుకున్నా.. కానీ, కనీసం స్టార్ట్ కూడా చేయలేకపోయా. తరగతి గది బయట ఉండే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, అకౌంటెంట్లు, ఇతరులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. బయటి ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడానికి సంసిద్ధులు కావాలి.
 
 కొన్ని మెట్లు కిందికి దిగండి:

 నేను రాత్రిపూట క్లీనర్‌గా కూడా పనిచేశా. వాహనాల లోపల ఉండే విడిభాగాలను పరిశీలించి, వాటి పనితీరును అర్థం చేసుకొనేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దానివల్ల నేను ఒక మంచి డ్రైవర్‌గా మారగలిగాను. దేశంలో నేడు పేరుప్రఖ్యాతులు సంపాదించిన మార్కెటింగ్ నిపుణులంతా ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో సబ్బులు, కోలాలు, ఇతర వస్తువులు అమ్మినవారే. ఆ అనుభవం నుంచే వారు పాఠాలు నేర్చుకొని ఉన్నతస్థానాలకు ఎదిగారు. మీరు జీవితంలో విజయం సాధించాలని నిజంగా కోరుకుంటే.. మీ స్థాయి నుంచి కొన్నిమెట్లు కిందికి దిగండి. చేతులకు మరకలు అంటినా ఫర్వాలేదు బాగా కష్టపడండి.
 
 మంచి యజమాని.. విలువైన జీతం:

 నా మొదటి ఉద్యోగంలో వేతనం చాలాచాలా తక్కువ. కానీ, యజమాని చాలా మంచివాడు. పనిలో తప్పులు చేసినా సరిదిద్దుకోవడానికి ఆయన నాకు అవకాశాలిచ్చారు. యజమాని నుంచి నేర్చుకున్న మంచి విషయాలు మనసులో ముద్రించుకుపోయాయి. మీ తొలి ఉద్యోగంలో.. జీతభత్యాల గురించి, సంస్థ పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మంచి యజమాని దొరికితే.. అంతకంటే విలువైన వేతనం ఉండదు.
 
 చేస్తున్న పనే ముఖ్యం:

 బాగా ఖరీదైన, విలాసవంతమైన కార్లనే నడపాలనే కోరిక నాలో ఉండేది. ప్రారంభంలో టెంపో, స్కూల్ వ్యాన్, సిటీ బస్సు నడపాల్సి వచ్చింది. వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాను. తర్వాత గొప్ప కార్లను నడిపే అవకాశాలు వచ్చాయి. కంపెనీ ముఖ్యం కాదు, చేస్తున్న పనే ముఖ్యం. తర్వాత రాబోయే ఉద్యోగం, పదోన్నతులు, వేతనాల గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా.. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తే విజయం, ఆనందం వాటంతట అవే అనివార్యంగా వస్తాయి.
   -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 

>
మరిన్ని వార్తలు