గుండెపోటును ముందే గుర్తించవచ్చా?

27 Jul, 2015 09:01 IST|Sakshi
గుండెపోటును ముందే గుర్తించవచ్చా?

కార్డియాలజీ కౌన్సెలింగ్


నాకు తరచుగా ఛాతీలో అసౌకర్యంగా ఉన్నప్పుడల్లా అది గుండెపోటేమో అన్న ఆందోళన కలుగుతోంది. గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందా? వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు పంపుతుంది? - రషీద్, ఆదోని
 
గుండెపోటు వచ్చేముందు కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. వాటిని బట్టి మనం ముందుగానే గుండెపోటును అనుమానించవచ్చు. ఎడమవైపు ఛాతీ నొప్పితోపాటు బరువుగా  ఉన్నట్లు అనిపించడం, ఊపిరాడని పరిస్థితి, మగత, చెమటలు పట్టడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తుంటే శరీరం గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు అందిస్తోందని గ్రహించాలి. కొందరికి దగ్గుతోపాటు నోటినుంచి రక్తం కూడా వస్తుంది. గుండెనొప్పికీ, గుండెపోటుకీ మధ్య తేడా ఉంది.

 

ఛాతీ నొప్పి ఉండే కాలవ్యవధిని బట్టి ఆ వ్యత్యాసాలను గుర్తించవచ్చు. ఛాతీ నొప్పి మొదలైన మూడు నిమిషాల్లో దానికదే తగ్గకపోతే అది గుండె నొప్పి అనుకోవాలి. అలాకాకుండా నొప్పి 10 నిమిషాలకు దాటి కొనసాగుతుంటే అది గుండెపోటుగా అనుమానించాలి. గుండెపోటు వచ్చిన సమయంలో నొప్పి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. అత్యధిక సందర్భాల్లో నొప్పి తీవ్రంగానూ, భరించలేనంతగా ఉంటుంది. ఛాతీలో అసౌకర్యం 15 నుంచి 30 నిమిషాలపైనే ఉన్నప్పుడు దానిని గుండెపోటుగా గుర్తించాలి.
 
మా బంధువులలో ఒకరు చాలాకాలంగా ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో గుండెనొప్పిని కూడా సాధారణమైన అసిడిటీగా భావించి, తేలిగ్గా తీసుకోవడంతో జరగరాని అనర్థం జరిగిపోయింది. అసలు అసిడిటీకీ, గుండెపోటుకూ తేడా ఎలా తెలుసుకోవాలి? - బి.రమ, విశాఖపట్నం
 
మంచి ప్రశ్న అడిగారు. కడుపులోనో లేదా గుండెలోనో మంట ఒక డైజిన్ టాబ్లెట్‌తో తగ్గిపోయి నప్పుడు, మెడ, వెన్ను తదితర నొప్పులకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్‌తో ఉపశమనం కలిగినప్పుడు దానిని అజీర్తి లేదా గ్యాస్ సమస్యగానో, కండరాల నొప్పిగానో భావించాలి. అలా కాకండా ఒకట్రెండు టాబ్లెట్లు వాడినా ఉపశమనం కలగకపోతే మాత్రం దానిని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే.

 

రెంటికీ తేడా ఏమిటంటే .. గుండెనొప్పి ఒకసారి వస్తే అది వదలకుండా వేధిస్తుంది. అదే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులయితే అవి వస్తూ పోతూ ఉంటాయి. అందువలన ఈ రెండింటి విషయం లో తికమక పడకుండా వాటి లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. గుండెపోటు లో ఛాతీలో కాకుండా చంకల నుంచి, మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా నొప్పి మొదలు కావచ్చు.  
 
డాక్టర్ గణేశ్ మధన్
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్

మరిన్ని వార్తలు