కార్డియోమయోపతి అంటే ఏమిటి...?

26 Aug, 2019 07:58 IST|Sakshi

కార్డియాలజి కౌన్సెలింగ్స్‌

నా వయసు 42 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపించుకుంటే ఆయన కార్డియాలజిస్ట్‌ వద్దకు పంపారు.  నా కండిషన్‌ ‘కార్డియోమయోపతి’ కావచ్చని కార్డియాలజిస్ట్‌ అంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? దీనికి చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరించండి.  – ఎమ్‌. శ్రీకాంత్‌రావు,కరీంనగర్‌

కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీరు వివరిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్‌ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్‌ కార్డియోమయోపతి, హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్‌ కార్డియోమయోపతి.

వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్‌ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్‌ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్‌ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్‌ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్‌ కార్డియోమయోపతిలో కనిపించే తొలి లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్‌), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్‌ట్రోఫిక్‌ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్‌ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్‌ట్రోఫిక్‌ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్‌ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. 

హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్‌ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌) పరికరాన్ని అమర్చుతారు.డాక్టర్‌ పంకజ్‌ జరీవాలా,సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడహైదరాబాద్‌

మరిన్ని వార్తలు