చలాకీ నవ్వులకు కేరాఫ్ అడ్రస్!

13 Nov, 2014 23:21 IST|Sakshi
చలాకీ నవ్వులకు కేరాఫ్ అడ్రస్!

విదేశాలలో...

పిల్లలకు ఆనందం మాత్రమే కావాలి. పిల్లలున్న చోట ఆనందం మాత్రమే ఉంటుంది. వారి కళ్లల్లో ఆశ్చర్యం, మోములో సంతోషం తుళ్ళి తుళ్ళి ఆడాలంటే పర్యటనలు చేయాలి. వారి సంబరం అంబరాన్ని అంటాలంటే ఆ పర్యటనలు పసందుగా మారాలి. ఈ ఏడాది ప్రపంచంలో పిల్లలు మెచ్చే అత్యుత్తమమైన విహార ప్రదేశాలను అతి పెద్ద ట్రావెల్ గైడ్ వెబ్‌సైట్ ‘లోన్లీప్లానెట్’ శోధించి మరీ మన ముందుంచింది. ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా! పిల్లలను ఆనందసాగరంలో ఓలలాడించే ఈ పర్యాటక ప్రదేశాలను వీలును బట్టి ప్లాన్ చేసుకోవచ్చు.
 
మంచులో షికార్లు... లాప్లాండ్
ఫిన్‌లాండ్ దేశంలోని ‘లాప్లాండ్’ చలికాలం అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక్కడి ‘రిసిటంటూరి’జాతీయ ఉద్యానంలో చలికాలమంతా మంచు కిరీటాలను ధరించిన వృక్షాలతో అలరారుతుంటుంది. గడ్డకట్టిన మంచులో బండ్లు లాగే కుక్కలు, జింకల పరుగులు, ఉండుండి చేపలు ఎగరడం.. వాటి మధ్యే మనం తిరగడం ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. రాత్రుళ్లు ఎక్కువ సమ యం ఉండే నెలలు అక్టోబర్ - మార్చి. ఈ ఆరు నెలలు మంచుపై పడే సన్నని సూర్య కిరణాలు అబ్బురపరుస్తాయి. జూన్- ఆగస్టు వరకు రోజంతా పగటి వాతావరణమే ఉంటుంది. అంటే అర్థరాత్రి కూడా సూర్యుడు వెలుగుతుంటాడన్నమాట.
 
ఇసుక గూళ్లు... బెలిజ్
మధ్య అమెరికాలోని బెలిజ్ ప్రాంతంలో వందల సంఖ్యలో దీవులు ఉన్నాయి. అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కట్టుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. 7-12 ఏళ్ల పిల్లలకైతే ఈ ప్రాంతం పండగ సంబరాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వన్యప్రాణుల జీవనశైలిని పిల్లలు అతి సమీపం నుంచి పరిశీలించవచ్చు. బీచ్‌లలో డ్రమ్స్‌ను ఎలా వాయించాలో నేర్చుకోవచ్చు. నీటిలోని అందాలను చూడటానికి, సుదూరంగా ఉండే అటవీ ప్రాంతానికి బోట్‌లలో స్విమ్మింగ్ హోల్స్ ద్వారా చేరుకోవచ్చు.
 
జలపాతాల హోరు ఐస్‌లాండ్
యూరోప్‌లో అతి పెద్ద జలపాతపు ప్రవాహాలు, అతి పెద్ద హిమనీనద ప్రవాహం, నిరంతరం మండే అగ్నిపర్వతాలు, వేడినీటి కొలనులు... ఏ వయసు వారికైనా థ్రిల్ కలిగించే అద్భుతాలకు ఐస్‌లాండ్ చక్కని వేదిక. ఇక్కడ గుర్రపు స్వారీలు, నీటిపై పడవలతో షికార్లు, కీచురాళ్ల రొదలు, తిమింగిలాలు,.. ఇవన్నీ పిల్లల్ని మరో లోకంలో విహరించేలా చేస్తాయి. విదేశీ పర్యాటకులకు ఈ దేశం చక్కని విడిదిని ఏర్పాటు చేస్తుంది. యూరోప్ దేశాల నుంచి ఐస్‌ల్యాండ్‌కు విమానయాన సదుపాయాలు ఉన్నాయి.
 
కథల పందిరి.. డెన్మార్క్
మిగతా దేశాలతో పోల్చితే డెన్మార్క్‌లో పిల్లల ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలిచే అంశా లు లెక్కకు మించి ఉన్నాయి. ‘టివోలి’ ప్రాంతంలో కథలలో చెప్పినట్టు కళ్లకు కట్టే అమ్యూజ్‌మెంట్ పార్క్ ఉంది. ఇందులో సంగీత హోరులో ఉరకలెత్తవచ్చు. రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల ను తిలకిస్తూ పసందైన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఇక ‘లెగోల్యాండ్ బిల్లండ్’లో ప్రపంచంలోని విగ్రహాల నమూనాలు 20 కోట్ల దాకా ఉన్నాయి. ఇక్కడి రంగులరాట్నంలో తిరగడం.. పిల్లలకు ఎనలేని థ్రిల్ ఇస్తుంది.

గుర్రపు బగ్గీలు... ప్రేగ్
చెక్ రిప్లబ్లిక్‌లోని ప్రేగ్ వారాంతపు వినోదాలకు పెట్టింది పేరు. ఇక్కడ గుర్రపు బగ్గీలపై ప్రయాణం మరచిపోలేనిది. ఇక్కడి ఎత్తై పర్వతప్రాంతాలు, నిర్మాణాలన్నీ  జానపద కథలలోగా అనిపిస్తాయి. నలుచదరంగా ఉండే పాత పట్టణం, చార్లెస్ బ్రిడ్జి, పెట్రిన్ హిల్‌లోని అద్దాల గది, కొయ్యబొమ్మలు, అపార్ట్‌మెంట్ నెంబర్ 46 అనే అద్భుతమైన భవనపు దీపాల సొగసు... పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకుంటాయి.

మరిన్ని వార్తలు