ఈ ఇంటిదొంగలను పట్టేద్దామా?!

17 Oct, 2019 01:26 IST|Sakshi

గృహ– విష(య)o

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత అందరికీ తెలిసిందే. మన ఇంట్లోనే దాగి ఉండి... మనకు హాని చేసే ఈ విషాల విషయంలో అది అక్షర సత్యం. మనం నిరపాయకరంగా భావించే అనేక చోట్ల ఈ విషాలు నక్కి ఉంటాయి. మన నట్టింట్లో అనుక్షణం నడయాడుతుంటాయి. మనింట్లో మనకే తెలియకుండా పొంచి ఉండి కాటేసి చిమ్మే అనేక విషాలనూ... వాటికి విరుగుడు మార్గాలను తెలుసుకుందామా. వాటి గురించి ఒక అవగాహన కల్పించుకోవడం కోసమే ఈ కథనం.

ఇటీవల మన ఇండ్లలోకి కొత్తరకం పాత్రలు వస్తున్నాయి. లోహం అయితే చాలా బరువుగా ఉండటం వల్ల ఈ తరహా పాత్రలు ఇప్పుడు వినియోగదారులను ఆకర్శిస్తున్నాయి.  నిజానికి చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్‌ ఆరోగ్యానికి అంత అందమైనవి కాదు. ఈ పాత్రలు ‘మెలామైన్‌’ అనే ప్లాస్టిక్‌లాగానే ఉండే ఒకరకం పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే వేడికి ఆ మెలామైన్‌ అణువులు... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా ఒంట్లోకి చేరిపోతుంటాయి. మెలమైన్‌ వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో సైతం ప్రచురితమైంది. ఈ పదార్థం వల్ల కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతో పాటు క్యాన్సర్‌ ప్రమాదమూ ఉన్నట్లు సాక్షాత్తూ డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలూ పేర్కొంటున్నాయి.

కొంతమంది నేరుగా ఈ బౌల్స్‌ను మైక్రోవేవ్‌ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదంటూ అమెరికాలో ఔషధాలకు అనుమతి ఇచ్చే అత్యున్నత ప్రమాణాల సంస్థ అయిన ఎఫ్‌డీఏ గట్టిగా సిఫార్సు చేస్తోంది. దీనివల్ల హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ స్రావంపై ప్రభావం ఉంటుందట. దాంతో గర్భధారణ సమస్యలు వస్తాయంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక పురుషుల్లోనూ... వీర్యకణాల సంఖ్య తగ్గడం, వాటి కదలికలు మందగించడం, హార్మోన్ల స్రావాలు తగ్గడం జరుగుతాయి. చాలామందిలో డయాబెటిస్‌ వచ్చే ముప్పు విపరీతంగా పెరుగుతున్నట్లుగా కూడా ఒక అధ్యయనంలో తేలింది.

నివారించండిలా: వేడివేడి సూప్‌లూ, కూరలు, ఇతరత్రా పదార్థాలను  వడ్డించాలనుకుంటే పింగాణీ బౌల్స్‌ లేదా పింగాణీ ప్లేట్లే మంచివి. వాటిలో తినడమే ఆరోగ్యదాయకం.

మన సోఫాల్లో మరెన్నో విషపదార్థాలు...
మంటలు అంటుకున్నా సురక్షితంగా ఉండేలా ఇటీవల ఆధునికమైన కొన్నిరకాల సోఫాలను రూపొందిస్తున్నారు. వీటిని ఫైర్‌ రెసిస్టెంట్‌ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలను ఫ్లేమ్‌ రిటార్డెంట్స్‌ అంటారు. ఈ సోఫాలపై మనం చేతులు ఆనించినప్పుడు ఈ రసాయనాలు చేతులపైకి చేరతాయి. అవే చేతులతో మనం ఏవైనా ఆహారపదార్థాలను తిన్నప్పుడు... ఆ విషాలు  ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ విషాలు మన గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్‌ సిస్టమ్‌)ను దెబ్బతీస్తాయి. ఫలితంగా ఎంజైముల, జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రధానంగా ఈ దుష్ప్రభావం ప్రధానంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడే అవకాశం ఉంది. దాంతో కొన్ని రకాల ప్రత్యుత్పత్తి సంబంధిత వ్యాధులు రావచ్చు. ఒక్కోసారి క్యాన్సర్లు వచ్చేందుకూ అవకాశాలున్నాయి.

నివారించండిలా: సోఫాలను క్రమం తప్పకుండా వాక్యూమ్‌ క్లీనర్‌తో తరచూ శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా శుభ్రపరిచే సమయంలో ఎయిర్‌ఫిల్టర్‌ ఉపయోగించడం మరింత మంచిది. ఇలాంటి సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినేముందు నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం.

ప్రకాశవంతమైన లైట్లతో ఆరోగ్యానికి ముప్పు
మీరు ఇంట్లో రాత్రి నిద్రపోయే సమయంలో పెద్ద లైట్లు అస్సలు వేసుకోకండి. బాగా కాంతి తక్కువగా ఉండే (డిమ్‌గా ఉండే) జీరో బల్బులు మాత్రమే వాడండి. రాత్రివేళల్లో అలముకునే చీకటి కారణంగానే మన మెదడుల్లో... మెలటోనిన్‌ అనే హార్మోన్‌ స్రవిస్తుంది. ఇది స్రవించడం వల్లనే మనకు నిద్ర వస్తుంది. లైట్లు వేసుకుని పడుకోవడం వల్ల మెలటోనిన్‌ తగ్గుతుంది. దాంతో రాత్రి నిద్ర పట్టదు. ఫలితంగా నిర్ణీత వేళల్లో నిద్రతెప్పించేందుకు మన మెదడులోని  వ్యవస్థ అయిన ‘సర్కాడియన్‌ రిథమ్‌’ దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపేందుకు చాలా ఆస్కారం ఉంది.నిద్రలేమి వల్ల మహిళల్లోనైతే బ్రెస్ట్‌ క్యాన్సర్లకు, పురుషుల్లోనైతే ప్రోస్టేట్‌ క్యాన్సర్లకు అవకాశం ఉంటుంది. అంతేకాదు... పెద్దపేగు, బ్లాడర్, పాంక్రియాటిక్‌ క్యాన్సర్ల రిస్క్‌ పెరుగుతుందని పేర్కొన్న ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీలో ప్రచురితమయ్యాయి.

నివారించండిలా: రాత్రి చీకటి అలముకోగానే మెలటోనిన్‌ స్రవించేలా చేయడం అన్నది ప్రకృతి  స్వాభావికంగా చేసిన ఏర్పాటు. దాన్ని బ్రైట్‌లైట్స్‌తో దెబ్బతీయవద్దు. రాత్రివేళల్లో చాలా డిమ్‌ లైట్స్‌ మాత్రమే ఉపయోగించండి.

కర్టెన్ల వెనక కాలకూటం
గతంలో మన ఇళ్లలో బట్టలతో చేసిన కర్టెయిన్లు వాడేవాళ్లం. కానీ ఇటీవల ఒక రకం ప్లాస్టిక్‌తో చేసిన బ్లైండ్లను వాడటం పరిపాటి అయ్యింది. చాలా కాలం పాటు మన్నికతో ఉండటానికి మనం ప్లాస్టిక్‌ వంటి పదార్థంతో రూపొందించిన ఈ తరహా  కర్టెన్లను వాడుతున్నాం. ఇక బాత్‌రూమ్‌లలోనైతే నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం మనం వాడే షవర్‌ కర్టెయిన్లన్నీ తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్‌ మెటీరియల్‌తో తయారవుతున్నాయి. వాటిని వాటర్‌ప్రూఫ్‌గా తయారు చేయడానికి విధిగా ఒకరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్‌ కర్టెన్లు సాధారణ బట్టల్లాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా ‘థాలేట్‌’ అనే పదార్థంతో వీటిని తయారుచేస్తారు.

ఈ షవర్‌ కర్టయిన్లలో మాత్రమే కాకుండా... మన ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్‌పేపర్లు, అనేక రకాల ఫ్లెక్సీలు కూడా ఈ పదార్థంతోనే తయారుచేస్తుంటారు. ఈ థాలేట్‌ అనేది పురుషుల సెక్స్‌ హార్మోన్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్‌ క్వాలిటీ) బాగా దెబ్బతింటుంది. ఇక ఈ కర్టెయిన్ల మీదుగా వీచే గాలి అలర్జీలను ప్రేరేపిస్తుంది. దాంతో అనేక శ్వాససంబంధ సమస్యలు రావడం జరగవచ్చు. దీర్ఘకాలంలో ఆస్తమా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మహిళల విషయానికి వస్తే... ఈ తరహా వాల్‌పేపర్లు, గృహాలంకరణ వస్తువులు, కర్టెయిన్లు ఉన్న ఇండ్లలో గర్భవతుల ఉంటే ఇవి వారికి మరింత ప్రమాదకరం.

ఇవి ఉపయోగించడం అంటే... పుట్టబోయే పిల్లలు ఇంట్లోకి రావడానికి ముందే వారి ఆరోగ్యకరమైన చిన్ని అవయవాలను పూర్తిగా కలుషితం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడమే. ఇలాంటి కర్టెయిన్లు, వాల్‌పేపర్లు, అలంకరణ సామగ్రి ఉపయోగించే ఇళ్లలో పెరిగిన పిల్లల్లో ఏడీహెచ్‌డీ వంటి రుగ్మతలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలా అధ్యయనల్లో తేలింది. నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ ధోరణులు పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్‌ సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి.

నివారించండిలా: ఇంట్లోని డోర్‌ కర్టెన్లు, షవర్‌ కర్టయిన్ల కోసం వీలైనంత వరకు నిరపాయకరమైన మెటీరియల్‌తో తయారు చేసినవే వాడండి. దెబ్బతిన్నప్పుడు మార్చుకోవడం శ్రమ అయినా సరే... కాటన్‌తో తయారైన కర్టెయిన్లనే వాడండి. ఫర్నిచర్‌గా, అందంగా ఉండే ప్లాస్టిక్‌ పీవీసీతో తయారు చేసిన వాటికంటే కలపతో తయారు చేసిన వాటినే వాడండి.

నాన్‌స్టిక్‌ పాత్రలతో చాలా ప్రమాదం...
మనం వంట వండినప్పుడు అది పాత్రల అడుగున అంటుకుపోనివ్వకుండా చేసే నాన్‌స్టిక్‌ తరహా గిన్నెలు, పెనం వంటి గృహోపకరణాలకు ఇటీవల బాగా ప్రాచుర్యం పెరిగింది. వీటిని ‘నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌’గా అభివర్ణిస్తుంటాం. నాన్‌స్టిక్‌ కిచెన్‌వేర్‌ ఆరోగ్యానికి కీడు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా వంటపాత్రల్లో వండిన వంటలను తిన్న పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్‌ వంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని ఈ అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్‌ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి గృహోపకరణాలు ఉపయోగించే వారిలో సంతానలేమి అంటే... పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం వంటి అనర్థాలు కలుగుతాయని ‘ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌స్పెక్టివ్‌’  హెల్త్‌ జర్నల్‌లోని నివేదికలు చెబుతున్నాయి.

నివారించండిలా
టెఫ్లాన్‌ కోటింగ్‌ ఉన్న నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌కు బదులుగా సాధారణ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వంటివి ఉపయోగించడం మంచిది. ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు ఈ నాన్‌స్టిక్‌ గృహోపకరణాలను ఉపయోగించడం మానేయాలి. మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండాల్సిన వంటకాలకు ఈ నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌ను ఉపయోగించకపోవడమే మంచిది.

వంటింట్లోకి గాలి ధారాళంగా రావాలి
ఇంటి నిర్మాణం సమయంలో వంటింటికి చాలా మంది చాలా తక్కువ స్థలాన్ని కేటాయిస్తారు. ఇదెంతో ప్రమాదకరం. కిచెన్‌లోకి గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కిరోసిస్‌ స్టవ్‌లు ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిరోసిన్‌ మండే సమయంలో కొన్ని హానికర వాయువులు వెలువడతాయి. ఇక కట్టెల పొయ్యి అయితే కార్బన్‌ డై ఆక్సైడ్‌తోపాటు కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి హానికరమైన వాయువులు వస్తాయి. వీటివల్ల ప్రాణాపాయం కూడా తప్పని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే కిచెన్‌ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి.  

నివారించండిలా వంటగది విశాలంగా ఉండేలా చూసుకోండి. కిచెన్‌ను అనవసరమైన వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంట... కిచెన్‌లో వద్దు. ఆరుబయటే చేయండి.  

బాత్‌రూమ్‌లో హానికర రసాయనాలెన్నో
హానికరమైన రసాయనాలకు బాత్‌రూమ్‌ కూడా ఒక నెలవే. అక్కడ ఉపయోగించే షాంపూలలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇక సువాసన వచ్చేందుకు గాను కొన్ని రకాల సబ్బుల్లో చేర్చే సుగంధ ద్రవ్యాల వల్ల కూడా చర్మంపై అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు.

నివారించండిలా
రసాయనాలు తక్కువగా ఉండే స్వాభావిక పదార్థాలతో చేసిన సబ్బులు, షాంపులు ఉపయోగించండి.

ఇంటిబయటే చెప్పులూ, బూట్లు, సాక్స్‌...
ఒకటి రెండు రోజులు అవే వేసుకుంటే సాక్స్‌ (మేజోళ్లు) దుర్వాసన వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాలిని పట్టుకుని ఉండే మేజోడులో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ దుర్వాసన వస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాక సాక్స్‌ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. అందుకే పాదరక్షలు, ప్రధానంగా సాక్స్‌ ఇంటి బయటే వదలాలి. ఉతికి పొడిగా మారాక మాత్రమే వాటిని ఇంట్లోకి తీసుకురావాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్పులు, పాదరక్షలు, షూస్, సాక్స్‌ స్టాండ్‌ ఇంటి బయట ఉండటమే మంచిది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతోనే మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఉండే అనేక రకాల విషాలను, హాని చేసే ముప్పులను నివారించుకోవచ్చు.
డా‘‘ ఎం. రామకృçష్ణ,
సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,
మలక్‌పేట్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు