పిల్లలు ఎఫెక్ట్‌ అవుతారు 

24 Apr, 2018 00:04 IST|Sakshi

కేరెంటింగ్‌

తల్లిదండ్రులూ.. కాస్త జాగ్రత్త. చిన్నారుల ఎదుట అస్తమానం కీచులాడుకుంటూ ఉండటం, తల్లిపై తండ్రి గృహహింసకు పాల్పడుతూ ఉండటం చిన్నపిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. చిన్న వయసులో పసిపిల్లల ఎదుట తల్లిదండ్రుల కొట్లాటలూ, ఇంట్లో ఒకరినొకరు మానసికంగా హింసించుకోవడం జరుగుతుంటే... ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లలో చాలా రకాల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మాంట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అలైస్‌ షేర్మెర్‌హార్న్‌ అంటున్నారు. అధ్యయనం కోసం ఆమె తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయసున్న 99 మంది చిన్నారులను ఎంపిక చేశారు.

వాళ్ల వాళ్ల భావోద్వేగ స్థాయిలను బట్టి ఆ సమూహాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఆ తర్వాత వారికి రకరకాల భావోద్వేగాలతో ఉన్న  జంటల ఫొటోలు చూపించారు. ఆ ఫొటోల్లోని జంటలు కొన్ని కోపంగా ఉంటాయి. మరికొన్ని సంతోషంగా ఉంటాయి. కొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఆ ఫొటోలను చూసి ఆ జంటల తాలూకు వాస్తవ భావోద్వేగాలను పిల్లలు చెప్పాలి. అయితే తమ ఇళ్లలో తీవ్రమైన కీచులాటలు, పోట్లాటలను చూసే పిల్లలు ఫొటోల్లో కనిపించే భావోద్వేగాలను సరిగా గుర్తించలేకపోయారట! అంటే... వాళ్ల మెదడుల్లో భావోద్వేగాలను ప్రాసెస్‌ చేసే యంత్రాంగం దెబ్బతిన్నట్లు ఈ పరిశోధన తెలుపుతోందని అధ్యయనవేత్తలు అంచనావేశారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌ అనే సంచికలో ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు