ఫస్ట్ ర్యాంకు రావాలా?! ప్రణాళిక తప్పనిసరి

13 Mar, 2015 22:50 IST|Sakshi
ఫస్ట్ ర్యాంకు రావాలా?! ప్రణాళిక తప్పనిసరి

13-19 కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
కిరణ్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ప్రసారం అయ్యే సమయంలో టీవీకి అతుక్కుపోయి చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోతాడు. పదవ తరగతి హాఫ్ ఇయర్లీలో మంచి మార్కులు వచ్చినా, ప్రీ ఫైన ల్లో అన్నీ సబ్జక్టులూ ఫెయిలయ్యాడు. తల్లిదండ్రులు భయపడిపోయారు. పదవ తరగతి ఫెయిలైతే ఇక భవిష్యత్తు ఎలా? అని ఆలోచించి ఒక సైకాలజీ కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లారు.

‘‘నీకు క్రికెట్ ఆట మీద చక్కని అవగాహన ఉంది కదా! ఈసారి కప్ ఎవరికి వస్తుందో తెలుసా?’ అనడిగాడు కౌన్సిలర్. అక్షరాలా ఆ అబ్బాయి ఊహించిన టీమే వరల్డ్ కప్ సాధించింది. జ్ఞానాన్ని బదిలీ చేయవచ్చు... సైకాలజీలో ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ట్రైనింగ్’ అనే అధ్యాయం ఉంది. అంటే మనకు తెలిసిన ఒక సబ్జక్టులోని జ్ఞానాన్ని మరొక సబ్జక్టులోకి బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న అబ్బాయి మోటార్‌సైకిల్ సునాయాసంగా నేర్చుకోగలడు. తెలుగు బాగా చదివే అబ్బాయి కన్నడ భాష కూడా త్వరగా నేర్చుకోగలడు. అదే విషయాన్ని కౌన్సిలర్ ఆ అబ్బాయికి చెప్పి, క్రికెట్ మీద ఉన్న జ్ఞానాన్ని చదువు మీదకు మళ్లించేలా కొన్ని సజెషన్లు ఇచ్చారు. సహజంగా తెలివైనవాడు కావటం, వ్యూహ ప్రతివ్యూహాలు గుర్తించగలిగే ప్రజ్ఞ ఉండటంతో త్వరగానే నేర్చుకున్నాడు.
 కిరణ్‌కి పరీక్షల ప్రణాళికలను ఇలా తయారు చే సి ఇచ్చారు కౌన్సిలర్ -

1. ప్రణాళిక, పరీక్షల తేదీలు; 2. చదువుకునే సమయం;  3. సబ్జక్టులు చదివే క్రమం (కష్టమైనవి ముందు చదవాలి); 4. వివరణలు - విశ్లేషణలు (తెలియని విషయాలు టీచర్లను అడిగి తెలుసుకోవాలి); 5. కొండగుర్తులు, బండగుర్తులు లాంటివి బట్టీ పట్టవచ్చు. (ఉదా: యమాతారాజభానస, నజభజజజర); 6. పద్యాలు, పెద్దల నిర్వచనాలు (డెఫినిషన్స్) బట్టీ పట్టాలి;  7.ప్రశ్నలు - సమాధానాలు బట్టీ పట్టకూడదు; 8. ఒక్క ప్రశ్నను ఎన్ని కోణాల్లో అడగవచ్చో విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు (్చ+ఛ)2 ఎంత అని అడగవచ్చు. లేదా ్చ2+ఛ2+2్చఛ=? అని కూడా అడగవచ్చు. రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంచెం మార్చి ఇవ్వటంలో ప్రశ్నలను బట్టీ పట్టినవారు ఖంగుతిన్నారు. 9. ప్రతి ప్రశ్నకూ సమాధానం చదివి దానిలోని ‘కీపాయింట్స్’ని ప్రత్యేకంగా నోట్సులో రాసుకోవాలి. వీటినే బులెట్ పాయింట్స్ అంటారు.  

కుల పరమైనవి  మత పరమైనవి  ప్రాంతీయ పరమైనవి  నిరక్షరాస్యత  మహిళల స్థితిగతులు  బాలల హక్కులు- బాలకార్మికులు  చట్టం - సమాజం  అవినీతి పరులు ఈ పాయింట్స్‌ని బాగా వివరించి సొంతంగా రాయాలి. ఉదాహరణకు అవినీతి అంటే అందులో లంచగొండులు, అవినీతిపరులు, మాదకద్రవ్యాలు అమ్మేవారు, స్మగ్లింగ్ చేసేవారు, నేరాలు చేసేవారు.. ఇలా మీరు అనేక విషయాలు రాయవచ్చు. రోజూ పేపర్ చదివితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆ తాజా ఉదాహరణలు రాస్తే, పేపరు దిద్దే వారికి కూడా అభ్యర్థిపై అభిమానం కలుగుతుంది.

10. స్వయం పరీక్ష: చాలామంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోయే ముందు కూడా గబగబా చదివేస్తూ ఉంటారు. ఆటోల్లో, బస్సులో, చెట్ల క్రింద నాన్‌స్టాప్‌గా చదువుతారు. ఇది నిరర్థక విజయం సాధించటం లాంటిదే. చదివిన ఆ విషయాలు అప్పటికి మాత్రమే గుర్తుంటాయి. అందుకే దీనిని విరుగుడు స్వయంపరీక్ష అంటారు. అంటే ఇంట్లో చదివిన తరువాత, బాగా మననం చేసుకుని, పేపరుమీద ముఖ్యాంశాలు రాసుకోవాలి. అంటే టీవీలో న్యూస్ చదివేవారు ముందుగా ముఖ్యాంశాలు చెప్తారు తరువాత వివరాల్లోకి వెళ్తారు. అలాగే మీరు కూడా ముఖ్యాంశాలను పేపరు మీద రాయాలి.

11.ఒత్తిడి నిర్వహణ: ఇది చాలా అవసరం. పరీక్షలంటే ఒత్తిడి కొంచెం ఉండాలి. అది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. అందుకు రోజూ ఉదయం పది నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం లాంటి సాధన చేస్తే చాలు. ఇది మీ టీచర్లు లేదా పెద్దలను ఎవరిని అడిగినా చెప్పగలరు. పరీక్షల టెన్షన్ విడిచిపెట్టి ఇంట్లో వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పాలి. నవ్వుతూ ఉండాలి. అలాగని చెప్పి టీవీలు, ఫోను కబుర్లు వద్దు. వీలైతే సుడోకు, రూబిక్స్‌క్యూబ్ లాంటివి చేయవచ్చు. దీనివల్ల రివిజన్ సామర్థ్యం పెరుగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాలనిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

12. పాజిటివ్ థింకింగ్: ఇది అత్యవసరం. అన్నీ బాగా జరుగుతాయి. అన్నీ మంచి శకునములే అంటూ సానుకూల వైఖరిని అలవాటు చేసుకోవాలి. అంటే ‘నేను పదవతరగతి ఫస్ట్ ర్యాంకులో పాసవుతాను’ అని కాకుండా లక్ష్యాన్ని పొడిగించి సజెషన్లు ఇచ్చుకోవాలి. అంటే నేను గొప్ప డాక్టర్ని అవుతాను, గొప్ప ఇంజనీరు, గొప్ప సైంటిస్టు, గొప్ప చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను... అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఆటోమేటిగ్గా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అన్నీ అందులో వచ్చేస్తాయి. దీనికో కథ ఉదాహరణగా తీసుకోవచ్చు.
 ఒక నిరుపేద జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని అడవికి వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న ఒక మునీశ్వరుడు ‘‘మూర్ఖుడా! ఆత్మహత్య అనేది బలహీనత. తాత్కాలిక సమస్యని వదిలించుకునే శాశ్వత పరిష్కారం. ఆత్మహత్య చేసుకోవటానికి చాలా ధైర్యం కావాలి. నువ్వు భగవంతుడిని ప్రార్థించు నీ కష్టాలు తొలగిపోతాయి’’ అని సలహా ఇచ్చాడు.
 ‘‘అయ్యా నాకున్నది ఒక కష్టం కాదు. మూడు కష్టాలున్నాయి. మొదటిది పేదరికం. రెండవది నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మూడవది నాకు పిల్లలు లేరు. దేవుడిని ఏ కోరిక కోరాలి?’’ అన్నాడు.

‘‘ముందు, ఏకాగ్రతతో ప్రార్థించు. తరువాత ఆలోచనలు అవే వస్తాయి’’ అన్నాడు మునీశ్వరుడు. ‘‘సరే’’నని తపస్సు ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘నీకు ఒక్కటే వరం ఇస్తాను. ఏది కావాలో కోరుకో’’ అన్నాడు. ఏకాగ్రతతో తపస్సు చేయడంలో చక్కని ఆలోచన వచ్చింది. ‘‘దేవుడా! నా భార్య తన మనవడిని బంగారు ఊయలలో ఊపేలా ఆశీర్వదించండి’’ అనడిగాడు. సరేనన్నాడు దేవుడు. విద్యార్థులంతా ఈ కథ ద్వారా గమనించాల్సింది ఏంటంటే.. ఆ ఒక్క కోరికలోనే మూడు కోరికలు కలిసి ఉన్నాయి అనే విషయం. మీ లక్ష్యం కూడా అలాగే ఉండాలి.
 
ఈ ప్రణాళికను పాటించి, పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో రాణించిన కిరణ్ ఇప్పుడు వరంగల్‌లో ‘ఎన్‌ఐటి’ కళాశాలలో ఉన్నత చదువులు చదువుతున్నాడు.
 - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్,
 bvpattabhiram@yahoo.com
 ఫోన్: 040-23233232, 23231123
 

మరిన్ని వార్తలు