విజయాన్ని చిత్రించుకోండి...

20 Mar, 2015 22:24 IST|Sakshi
విజయాన్ని చిత్రించుకోండి...

13-19  కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
పరీక్షల రోజులు దగ్గర పడుతున్నకొద్దీ పిల్లల్లో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఉండటం సహజమే. అది స్టూడెంట్‌కి ప్రేరణ కలిగించేలా ఉండాలి. కానీ అది ఎక్కువైతే మంచిది కాదు. If you think you can... yes you can, If you think you can not.. yes you are righ్ట అంటారు విజ్ఞులు. మీరు చేయగలరనుకుంటే అద్భుతాలు చేయగలరు. చేయలేననుకుంటే అక్షరాలా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మీ ఒత్తిడికి చెక్‌పెట్టండి. దీనికి పదే పదే సానుకూల సందేశాలు ఇచ్చుకోవాలి. లేదా వాటిని పేపరు మీద రాయాలి.

ఉదాహరణకు ఇక్కడ కొన్ని సందేశాలు చదవండి...

‘నాలో ఎటువంటి ఒత్తిడి లేదు’, ‘నేను చదివిన పుస్తకాల్లోని ప్రశ్నలకే సమాధానాలు రాయబోతున్నాను’, ‘నాకు ఎలాంటి టెన్షన్ లేదు’, ‘నేను స్వేచ్ఛాజీవిని’, ‘ఎటువంటి భయభ్రాంతులకు లోను కాను’, ‘నాలో ధైర్యం ఎంతో ఉంది. నేను పరీక్షల్ని సమర్థవంతంగా రాయగలుగుతాను.’ ఇలా ఉండాలి ఆ సందేశాలు.

విజువలైజేషన్: ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ముందు విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు మీరు ఎంతో ప్రశాంతమైన స్థితిని హాయిగా అనుభవిస్తున్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్. మీరు రాయబోయే పరీక్ష... వెళ్లబోయే ఇంటర్వ్యూ.. ఏదైనా సరే మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీరెంతో ప్రశాంతంగా ఉన్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్..

మీ పరీక్షలు దగ్గర పడ్డాయి. మీలో ఆనందం క్షణ క్షణానికి అధికమవుతుంది. పరీక్ష రోజు వచ్చింది. మీరెంతో ఆనందంగా లేచారు.  ఇక మళ్ళీ చదవాల్సినదేమీ లేదు. ఆఖరి నిమిషంలో చదివేది ఏమీ లేదు. ఇవన్నీ 364 రోజుల పాటు చదివినవే. రిలాక్స్.. రిలాక్స్.. ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లారు. మీ ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంది. సంతోషంగా హాల్లో అడుగుపెట్టారు. మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. మిగతా విద్యార్థులు కూడా ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటున్నారు. చాలా మంది మొహంలో ఏదో టెన్షన్... అది చూస్తే మీకు నవ్వు వస్తుంది.

మనం రాయబోయే పరీక్ష మనం చదివిన పుస్తకాల్లోదే కదా! మరెందెకు టెన్షన్! రాయబోయే పరీక్ష మనం చదువుకున్న భాషలోనే రాస్తాం కదా? ఇంకెందుకు భయం? అని మీకు అనిపిస్తుంది కదూ! రిలాక్స్.. రిలాక్స్.. ఇంతలో గంట మ్రోగింది. ప్రశ్నాపత్రాలు మీ అందరికీ పంచారు.

మీరు నవ్వుతూ మీ ప్రశ్నాపత్రం తీసుకున్నారు. అది చూడగానే  ఆనందంతో గట్టిగా అరవాలనిపించింది. ఎందుకంటే ప్రశ్నాపత్రం చాలా ఈజీగా ఉంది. అన్నీ చదివినవే. అన్నీ గుర్తున్నవే. ఇంకేం! ఆన్సరు పత్రం మీద, ముందుగా హాల్‌టికెట్ నంబరువేసి, సమాధానాలు రాయటం మొదలెట్టారు.

రిలాక్స్.. రిలాక్స్.. ఆశ్చర్యం! సమాధానాలు చకచకా రాస్తున్నారు. రిలాక్స్... రిలాక్స్... మొత్తానికి పేపరంతా తృప్తికరంగా రాశారు. సమయం ఇంకా పదినిమిషాలు ఉంది. రాసిన పేపరునంతా ఒకసారి చూశారు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు, స్పెల్లింగులు ఉంటే దిద్దారు. ఇంతలో బెల్ మ్రోగింది. ఇన్విజిలేషన్ అధికారికి మీ పేపరు ఇచ్చేశారు. ఆనందంగా బయటకు వచ్చారు.
 ఇంటికి వచ్చాకా మీ సమాధానాలు సరి చూసుకున్నారు. ఆల్ కరక్టు.. ఆల్ కరక్టు. అదే విధంగా మిగతా పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేశారు.

సెలవులిచ్చారు. హాయిగా కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఒకరోజు మీ ఇంటి కాలింగ్‌బెల్లు ఎవరో నొక్కారు. మీ వాళ్ళు వెళ్ళి తలుపుతీశారు. ఆయనొక కొత్త వ్యక్తి. ‘మీరెవరు?’ అని అడిగారు. ‘నేను ఫలానా టీవీ ఛానెల్ నుంచి వచ్చాను. మీ అబ్బాయి/ అమ్మాయికి స్టేట్ ర్యాంకు వచ్చిందని తెలిసింది, ఇంటర్వ్యూ కోసం వచ్చాను’ అన్నాడు.

 ఒక పక్క నాన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి, అమ్మ ఆనంద బాష్పాలు.. ఎంత అదృష్టవంతులు మీరు? ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? వాళ్లకి మనం ఇంతకన్నా ఇంకేమి ఇవ్వగలం? మీకు కూడా తెలియకుండానే కళ్ళవెంట ఆనందబాష్పాలు జల జల రాలుతున్నాయి.

రిలాక్స్.. రిలాక్స్...

(ఇలా ఒకటి రెండు నిమిషాల తరువాత తిరిగి మామూలు స్థితికి రావాలి) ఇప్పుడు మీరు నెమ్మది నెమ్మదిగా మామూలు స్థితికి రాబోతున్నారు. నేనిప్పుడు ఐదు నుండి ఒకటి వరకు అంకెలు లెక్కబెడుతున్నాను. ఒకటి అనేసరికి మీరు కళ్లు తెరవగలుగుతారు. సహజస్థితిలోకి రాగలుగుతారు.  ఐదు.. నాలుగు.. మూడు.. రెండు.. ఒకటి.. కళ్ళు తెరవండి. వెరీగుడ్.  కళ్లు తెరిచిన తరువాత, ఆ విద్యార్థిలో ఎంతో ఆత్మవిశ్వాసం మనం గమనించవచ్చు.

 జాకబ్‌సన్ రిలాక్సేషను ద్వారా, ఒక ప్రశాంతమైన స్థితికి పంపి, ఆ తరువాత విజువలైజేషన్ ద్వారా తామనుకుంటున్న స్థితిని ఊహించేలా చేయగలిగితే ఎవరికైనా ఎటువంటి భయాలనైనా పోగొట్టవచ్చునని కౌన్సెలింగ్‌లో రుజువైంది.  న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్.ఎల్.పి) అనే ప్రక్రియలో మనసులో నాటుకుపోయి ఉన్న భయాలను, భ్రాంతులను ఇదే పద్ధతిలో తీసి వేయవచ్చునని శాస్త్ర పరిశోధకులైన రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండరులు రుజువు చేశారు. వారు చెప్పేవాటిలో ముఖ్యమైనది..

దేశపటం దేశం కాజాలదు...అంటే- దేశపటంలో చూపినట్లు ఆ వంపులు, వాగులు అక్షరాలా అలాగే ఉండవు. అదేవిధంగా మన మనసులోనున్న భయాలు భ్రాంతులన్నీ నిజం కావు. అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు. వాటిని మనం సవరించుకోవచ్చు’ అంటారు వారు.
 
ఇది కేవలం స్టూడెంట్స్‌కే కాదు, టీచర్లు, కరస్పాండెంట్ల్లు, ఇతరులు కూడా సాధన చేయవచ్చు. తాము గొప్ప టీచరు అయినట్లు ప్రెసిడెంటు అవార్డు తీసుకుంటున్నట్లు తమ పిల్లలు విజయాలను సాధించినట్లు ఊహించుకోవచ్చు.
 ఈ సాధన వలన మనసులో ముద్రపడిన అనవసరమైన నె గెటివ్ భావాలు, పాజిటివ్‌గా మారటం ఖాయం. ప్రయత్నాలు కూడా అలాగే చేస్తారు. విజయాలు సాధిస్తారు.
 - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్,
 bvpattabhiram@yahoo.com
 ఫోన్: 040-23233232, 23231123
 

మరిన్ని వార్తలు