కొసరి కొసరి నేర్పించండి

11 May, 2015 23:55 IST|Sakshi
కొసరి కొసరి నేర్పించండి

కేరెంటింగ్
 
నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, నేటి బాలలను ఉత్త పౌరులుగా కాకుండా, ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. అందుకు ఏం చేయాలంటే...   పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా తయారవుతారు. అందుకే ముందు మనం హుందాగా, నీతి నిజాయితీలతో నడుచుకుంటూ ఉంటే వారు మన నుంచి ఆ మంచిని అలవర్చుకుంటారు.పెద్దలను గౌరవించడం, చిన్నవారితో ప్రేమగా నడుచుకోవడం, తోటివారితో స్నేహంగా మసలుకోవడం ముందు మన నుంచే మొదలు కావాలి.బాల్యం నుంచీ చిన్నారులకు నీతికథలు, రామాయణ, భారత, భాగవతాలు, దేశభక్తి కథలు, ఈసప్ టేల్స్ వంటివి చెప్పడం వల్ల వారికి నైతికత అలవడుతుంది. సృజనాత్మకంగా తయారవుతారు.

ఇంటినీ, ఒంటినీ, పరిసరాలనూ ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో... వీధులను, రోడ్లను కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచడం అవసరమనే విషయాన్ని వారికి తెలియజెప్పండి.  వీధి దీపాలు, వీధి పంపులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి వాటిని దుర్వినియోగం చేయకుండా, వాటిని కాపాడటాన్ని బాధ్యతగా గ్రహించేలా చేయాలి. విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను వంటి వాటిని సకాలంలో చెల్లించటం ఎంత అవసరమో చెబుతూ, మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలేమిటో వారంతట వారే తెలుసుకునేలా చేయండి.హింస, అశ్లీలత ఉండే సినిమాలు, టీవీ సీరియల్స్ వంటివి చూడకుండా జాగ్రత్త పడండి.ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించేలా చేయండి.
 

మరిన్ని వార్తలు