‘నేలమ్మ’ గొడుగు నీడలో..

6 Mar, 2018 05:28 IST|Sakshi

చిన్న, సన్నకారు రైతులు కాలం కలసిరాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుండడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బాధిత కుటుంబాలకు చెందిన మహిళా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్తింటి వారి నుంచి భూములు, ఆస్తులపై హక్కులు దక్కని దుస్థితి కొందరిదైతే.. ఒంటరి మహిళలుగా వ్యవసాయం కొనసాగించడంలో సమస్యలు మరికొందరిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరింగ్‌ సిటిజెన్స్‌ కలెక్టివ్‌(సీసీసీ) అనే స్వచ్ఛంద సంస్థ నిస్సహాయులైన రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతో నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి అండగా నిలుస్తోంది.

సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం లింగపల్లికి చెందిన పెద్దలింగన్నగారి బాలమణి అధ్యక్షతన రెండేళ్ల క్రితం ఈ సంఘం రిజిస్టరైంది. 30 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతోపాటు 200 మంది మహిళా రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరికి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంపై సంఘం శిక్షణ ఇప్పించింది. అనేక ఎకరాల పొలం కలిగి ఉన్నప్పటికీ .. ప్రతి ఒక్కరూ అరెకరం, పావెకరంలోనైనా సరే కంపోస్టు ఎరువుతో సేంద్రియ సేద్యం చేసి ఇంటికి సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. సంఘం అండదండలతో ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటూ పిల్లలను చదివించుకుంటున్నారు పలువురు రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిలో కొందరిని ‘సాగుబడి’ పలుకరించింది..

సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా..
మాకు ఎకరం చెల్క (మెట్ట) భూమి ఉంది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు పెట్టేవాళ్లం. నీటి కోసం 3 బోర్లు వేశాం. అప్పు పెరిగిందే గాని నీరు రాలేదు. కొడుకు పొట్ట చేతబట్టుకొని బొంబాయి వెళ్లాడు. నా భర్త పదేళ్ల క్రితం ఒకనాడు రాత్రి పదైనా ఇంటికి రాలేదు. చెట్టుకు ఉరిపోసుకున్నాడు.. సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా. బోరు నీటితో వరి వేశా.. రూ. 2 లక్షల అప్పుంది. బిడ్డ పెళ్లి చేయలేదు..

– పోతరాజు కనకమ్మ, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా

లగ్గం అయిన మూడేళ్లకే..
ఐదెకరాల చెల్క ఉన్నా.. పంటలు పండేది రెండెకరాల్లోనే. వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.3 లక్షల అప్పు అయ్యింది. నా భర్త ప్రభాకర్‌ లగ్గం అయినాక మూడేళ్లకే మందు తాగి చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వమే బోరు వేయించింది. వరి ఎకరం(35–40 బస్తాల ధాన్యం పండుతుంది), అర్థెకరం పత్తి వేస్తున్నా.  సంఘంతో కలిసి పనిచేస్తున్నా.

– గుర్రాల సుగుణ, చెల్లంకిరెడ్డిపల్లి, చిన్నకొండూరు మండలం, సిద్దిపేట జిల్లా

రెండెకరాల్లో వరి వేస్తున్నా..
రెండెకరాలుంది. 17 ఏళ్ల క్రితం నా భర్త రాములు 3 బోర్లు వేశాడు. నీరు రాలేదు. నీరు లేక 4 మడులు ఎండిపోయాయి. పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇద్దరు బిడ్డలు, కొడుకు. ఒక బిడ్డ బోన్‌కేన్సర్‌తో చనిపోయింది. ఇంకో బిడ్డ టీటీసీ చదివింది. రెండెకరాల్లో వరి వేస్తున్నా. సంఘం నేర్పిన విధంగా.. ఎటువంటి (రసాయనిక) మందులూ వేయకుండా చేస్తున్నా.

– ఉప్పునూతల రామలక్ష్మి, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా

సంఘం అండగా నిలబడింది..
మాది ఉమ్మడి కుటుంబం. ఆరెకరాల భూమి ఉంది. నా భర్త రమేశ్‌ ఏడేళ్ల క్రితం వర్షాధారంగా వరి వేశాడు. కోతకొచ్చే సమయంలో 2 బోర్లు ఫెయిలయ్యాయి. గుళికలు మింగి చనిపోయాడు.. మా భూమి మల్లన్నసాగర్‌లో పోయింది. మా పాప చదువుకు సంఘం తోడ్పడింది. అమ్మ వాళ్లింట్లోనే ఉండి సీసీసీ స్వచ్ఛంద సంస్థ వలంటీర్‌గా పనిచేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో తోటి మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నా. పెళ్లికి ముందు 9వ తరగతి చదివా. డిగ్రీ రాస్తున్నా..  

– మెంగన సుజాత, లక్ష్మాపూర్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా

ఏడాది పాటు సేంద్రియ సేద్యంపై శిక్షణ
సంఘం సభ్యులకు గత ఏడాదిలో అనేక దఫాలుగా సేంద్రియ వ్యవసాయ నిపుణులు కిషన్‌రావు వద్ద శిక్షణ ఇప్పించాం. తాము తినడానికి వరకు సేంద్రియంగా పండించుకుంటున్నారు. మహిళా రైతుల హక్కుల సంఘం నేతలు ఆశాలత, లక్ష్మిల తోడ్పాటుతో బాధిత మహిళల భూమి హక్కులపై చైతన్యం తీసుకువస్తున్నాం. ప్రవాస తెలుగువారితో కూడిన ఐ4ఫార్మర్స్‌ బృందం బాధిత మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తున్నది.

– సజయ (99483 52008), కేరింగ్‌ ఫర్‌ సిటిజెన్స్‌ కలెక్టివ్‌

మరిన్ని వార్తలు