వారి ప్రేమను అ‘లా’ గెలిపించుకున్నారు!

10 Jan, 2016 23:17 IST|Sakshi
వారి ప్రేమను అ‘లా’ గెలిపించుకున్నారు!

కేస్ స్టడీ
 

సలీం, సుభాషిణి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ ఉన్నత విద్యావంతులు, ఆధునిక భావాలు కలవారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏ బాధ్యతలూ లేని జీవితం గడుపుతున్నవారు. ఇటీవలే వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, వివాహానికి అనుమతి కోరారు. ఇరువురి తలిదండ్రులూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మతాంతర వివాహానికి ససేమిరా అన్నారు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు సుభాషిణి, సలీం. సుభాషిణి తలిదండ్రులు దిగి రాలేదు. బెదిరించినా, ప్రాధేయపడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. సలీం తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు. కానీ ఒక బాంబ్ పేల్చారు. అదేమంటే ఒక ముస్లిమ్ యువకుడు హిందూ మహిళను వివాహమాడాలంటే ఆమె తప్పనిసరిగా ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పారు. అంతేకాకుండా వారి ‘లా’ మతాంతర వివాహాలను అంగీకరించదని, హిందువులను వివాహమాడాలంటే మతమార్పిడి తప్పనిసరి అని చెప్పారు. ఎంత ఆధునిక భావాలున్నా, సుభాషిణి సనాతన కుటుంబం నుండి వచ్చింది.

మతమార్పిడి ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఇరువురూ బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించినా, పరిష్కారం కనిపించలేదు. చివరకు స్నేహితుల సలహాతో ఓ న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి వివరించారు. దానినే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారనీ, దీనిననుసరించి జరిగే వివాహాలను రిజిస్టర్ వివాహాలని సామాన్య పరిభాషలో అంటారని వివరించారు. ఈ చట్టాన్ననుసరించి భిన్నమతాలకు చెందిన వారు వివాహాలు చేసుకోవచ్చనీ, వివాహాలకు లౌకిక లక్షణం కల్పించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యమని చెప్పారు. కులం, మతం, ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవచ్చనీ, ఈ వివాహాలకు చట్టబద్ధత ఉందని, అంతేగాక న్యాయపరంగా కూడా అన్ని హక్కులు, రక్షణలూ లభిస్తాయని హామీ ఇచ్చారు. ఈ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిస్తారని చెప్పారు. సుభాషిణి, సలీం ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రేమను సుసంసన్నం చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి ప్రేమ కథ ఆ విధంగా సుఖాంతం అయింది.

మరిన్ని వార్తలు