అవకాశాన్ని వెతుక్కోవాలి!

27 Aug, 2017 00:36 IST|Sakshi
అవకాశాన్ని వెతుక్కోవాలి!

మనలో చాలామందికి ఎన్నో విషయాలలో ప్రతిభ ఉంటుంది. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశం తమ తలుపు తట్టగానే చక్కగా అందిపుచ్చుకుంటారు. వెంటనే పని ప్రారంభిచేస్తారు. అయితే, తెలివైన వాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడరు. వెతుక్కుంటారు. ఉదాహరణకు వర్షం అంతటా ఒకేలా పడుతుంది. ముత్యపు చిప్పలో పడ్డ నీటిబొట్టు ఆణిముత్యమవుతుంది. సముద్రంలో పడ్డ వానచినుకు వల్ల సముద్రానికీ ప్రయోజనం ఉండదు. వానచుక్కకీ ఉపయోగం ఉండదు. ముత్యపు చిప్పలాంటి వారు అలా అవకాశాలను అందుకుంటారు. ఆణిముత్యాల్లా తయారవుతారు. అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక కళ.

అ కళ అందరికీ ఉండకపోవచ్చు కానీ, అలవరచుకోవాలి నెమ్మదిగానైనా. లేదంటే సముద్రంలో పడ్డ వానచినుకుల్లా నిరుపయోగంగా తయారవుతారు. మనిషి పుట్టిందే విజయం సాధించడానికే. ఓడిపోవడానికి కాదు. అలాగని ఓడిపోయిన వారందరూ పనికి రాని వారు కాదు. ఎలా విజయం సాధించాలో ప్రళాళిక వేసుకోవాలి. విజయం సాధించేవరకు ఆ ప్రణాళికకు తగ్గట్టుగా పని చేయాలి. మనమేమిటో మనం తెలుసుకోవాలి. మనకు మనమే అభివృద్ధి చెందాలి. ఎవరో వచ్చి మనల్ని అభివృద్ధి చేయరు. ఊతం ఇస్తారంతే! ఆ ఊతాన్ని పట్టుకుని పాకిన వారే పైపైకి పోతారు. మన పెరట్లో అనుకోకుండా పడి మొలిచిన కాకర, బీర, చిక్కుడు, సొర, పొట్ల, దోస వంటి తీగజాతి మొక్కలు కూడా ఆసరా కోసం ఎదురు చూడవు. చిన్న చిన్న గోడపగుళ్లనో, దగ్గరలో ఉన్న వృక్షాలనో, కర్రదుంగలనో పట్టుకుని పైపైకి పాకుతాయి. పందిరి వేస్తే అల్లుకుంటాయి.

మరిన్ని వార్తలు