యాంత్రికంగా బతకడమూ అవసరమైనప్పుడు

9 Apr, 2018 01:33 IST|Sakshi

కొత్త బంగారం

కాథరిన్‌ లేసీ రాసిన ప్రప్రథమ నవల ‘నోబడీ ఈజ్‌ ఎవర్‌ మిస్సింగ్‌’లో 28 ఏళ్ళ వయసున్న కథకురాలైన ఎలిరియ రయిలీది ప్రధాన పాత్ర. బెనార్డ్‌  గ్రేడ్యుయేట్‌. టీవీ సీరియళ్ళు రాస్తుంటుంది. మనహాటన్లో ఉంటుంది. న్యూయార్క్‌ నుండీ న్యూజెర్సీకి వన్‌ వే టికెట్టు కొనుక్కుని ఆరేళ్ళ కిందట పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్‌ అయిన భర్తకు కూడా ఒక్క ముక్కా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఎవరికీ ఫోన్‌ చేయదు, మెయిల్‌ చేయదు. భర్తని ‘భర్త’ అని, లేక ‘ప్రొఫెసర్‌’ అని తప్ప, పేరుతో ప్రస్తావించదు. 

న్యూయార్కులో జరిగిన ఒక కవి సమ్మేళనంలో వర్నర్‌ అనే పేరున్న కవి ఆమెకు తన న్యూజెలాండ్‌ చిరునామా కాగితం మీద రాసిస్తాడు. న్యూజెలాండ్‌లో ఎలిరియ వీపు మీద బ్యాగ్‌ తగిలించుకుని అపరిచితులని లిఫ్టు అడుగుతూ, తల దాచుకోడానికీ, తినడానికీ చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుంటుంది. లేనప్పుడు పొలాల్లో, అడవుల్లో, పార్కుల్లో పడుకుంటుంది. భయప్రమాదాలని ఎదుర్కుంటూ దేశం తిరుగుతుంటుంది. తన్ని తాను ‘అడవి మృగం’ అనుకుంటుంది. నిజానికి ఇలా తిరగడానికి కారణం ఆమె తన నుంచి తానే పారిపోవడమే కాక, తనకున్న భయానికి గల మూలకారణాన్ని వెతుక్కోవడం కూడా. తను ‘ప్రతీదీ తప్పుగా చేసింది’ అన్న భయం. ఎలిరియ మనసులో జరిగే అంతర్గత పోరాటం గురించి పాఠకులకి అర్థం అవుతూనే ఉంటుంది.

వర్నర్‌ ఇంటికి ఆమె చేరేటప్పటికే ఈ చిన్న నవలలో వంద పేజీలు దాటతాయి. అప్పటికే, పాఠకులకు ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వయస్సు తేడా ఉన్న భర్తతో ఆమెకి పెళ్ళి జరిగిన అసాధారణమైన పరిస్థితులు, తను పొరపాటు చేసినప్పుడల్లా తనేదో చిన్నపిల్లయినట్టు, ‘ఏం? నోరు పెగలడం లేదా!’ అని మందలించే భర్త, తను గడిపే జీవితం తనదే అనిపించని భావన... తల్లి దత్తత తీసుకున్న కొరియా అమ్మాయి రూబీ ఆత్మహత్య, తనకన్నా రూబీని ఎక్కువ ప్రేమించే మద్యానికి బానిస అయిన తల్లితో తనకున్న సంతోషం లోపించిన సంబంధం...

వర్నర్‌ ఆమెకొక గది కేటాయించి మొదట ఆమె పట్ల ఆకర్షితుడైనప్పటికీ, కొన్నాళ్ళ తరువాత ఆమెని భరించడం చాలా బాధాకరం అనుకుని ఆమెని రోడ్డుమీద వదిలేస్తాడు. ఆఖర్న ఏ ప్రేరణా, యోచనా, పరిష్కారమూ లేకుండానే ఇంటికి తిరిగి వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా ఏఏ పరిస్థితుల్లో, ఎంత యాంత్రికంగా ప్రవర్తించాలో అని నేర్చుకుంటుంది. చైతన్య స్రవంతిలో నడిచే ఈ నవల ఎలిరియ తనలో తను పడే తర్జన భర్జన గురించినది. సంభాషణలని సూచించడానికి కొటేషన్‌ మార్క్స్‌ చోట ఇటాలిక్స్‌ ఉపయోగిస్తారు రచయిత్రి. నవలలో కనబరిచిన హాస్యం వ్యంగ్యంగా ఉండి, బాధ కలిగిస్తుంది. శైలి స్ఫుటంగా, కచ్చితంగా ఉంటుంది. కథ ప్రారంభం పాఠకులు కథకురాలితో సంభాషిస్తూ ఉండి, వారికి ముందే సగం కథ తెలిసినట్టు అనిపించేలా ఉంటుంది. వ్యక్తిగత సంక్షోభం అనుభవిస్తున్న ఒక యువతి యొక్క అధివాస్తవిక చిత్రం ఈ పుస్తకం. నవల శీర్షిక, జాన్‌ బెరీమాన్‌ కవిత ‘డ్రీమ్‌ సాంగ్‌ 29’ నుంచి తీసుకోబడినది. ఫర్రార్, స్ట్రౌస్‌ మరియు జిరూ కంపనీ ఈ నవలని 2014లో ప్రచురించింది. 2016లో రచయిత్రి కాథరీన్‌ లేసీ ‘వైటిన్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఫిక్షన్‌’ అవార్డు గెలుచుకున్నారు.

కాథరిన్‌ లేసీ, రచయిత్రి

-కృష్ణ వేణి   

>
మరిన్ని వార్తలు