ఐక్య శాంతి సమితి

23 Oct, 2016 00:45 IST|Sakshi
సమితి ఆవిర్భావ శాంతి దూతలు: ‘యునెటైడ్ నేషన్స్’కు ఆ పేరు పెట్టింది అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచంలో శాంతి సామరస్యాల కోసం 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితి రేపు 71వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. యుద్ధం ఏ కారణం వల్ల జరిగినా అది మానవాళి వినాశనానికే దారితీస్తుంది. యుద్ధం ఎలా ప్రారంభం అయినా దానికి మూలం... జాతి, మత ఆధిక్య ఘర్షణల్లోనే కనిపిస్తుంది. అందుకే సమితి నిరంతరం అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. ‘‘మనుషులంతా ఒక్కటే అనుకున్నప్పుడు, దేశాలన్నీ ఒకటిగా ఉన్నప్పుడు మానవాళి సుఖశాంతులతో వర్థిల్లుతుంది’’ అని... వచ్చే జనవరి 1న సమితి కొత్త ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆంటోనియో గటెరస్ అంటున్నారు. సమితి ఎప్పుడూ మతాలను ప్రస్తావించదు. శాంతిని మాత్రమే ప్రవచిస్తుంది.

 మతాలు ఎన్నున్నా అవన్నీ మానవ కల్పితాలు తప్ప, దేవుని సంకల్పాలు కావు. అందుకే... ‘మతములన్ని మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచిపోవును’ అని స్వామి వివేకానంద అన్నారు. ఆయన అంతరార్థం జ్ఞానమే దైవమని. ఈ తరానికి అవసరమైన జ్ఞానం... శాంతి జ్ఞానం.  పురాణాలు దైవాన్ని ‘అద్వైతం’అని సంబోధించాయి. అంటే రెండో మాట, రెండో రూపం లేనిది అని. ‘ఏకైకం’ అన్నమాట. పవిత్ర ఖురాన్ ‘అల్లాహ్’ అంటే అత్యుత్తమమైన దేవుడు అని వివరిస్తోంది. పవిత్ర బైబిలు గంథంలో మోషే ప్రవక్త తనకు దర్శనం ఇచ్చిన మహాశక్తిమంతుడైన దేవుడిని తమరి నామధేయం ఏమిటో బయలు పరచమని ప్రాధేయపడతాడు. అందుకు బదులుగా యావే (డజిఠీజి); ‘యెహోవా’ అన్న గొప్ప శబ్దం వినిపిస్తుంది. హెబ్రీ భాషలో దానర్థం ‘సదా ఉన్నవాడు, ఉండేవాడు’.

 దైవశక్తి లేదా జ్ఞానశక్తి లేదా శాంతిశక్తి  యుగయుగాల వరకు జీవించే ఉంటుంది. మానవుల్లా, ఇతర జీవచరాల్లా కొంతకాలం ఉండి గతించేది కాదు. మతాలకు అతీతంగా ఆ దివ్యమైన శక్తిని ఆరాధించాలి. అప్పుడే మానవజీవితం సార్థకమౌతుంది. శాంతిమయం అవుతుంది. బైబిల్లోనే ఒక వాక్యం ఉంది. ‘సృష్టికర్త అయిన దేవుడిని నీ పూర్ణ హృదయంతో ఆరాధించు. నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ అని! సాటి మనిషిని ప్రేమించడం అంటే దైవాన్ని ఆరాధించడమే. పురాతన హిందూ శాస్త్రాలు ‘మానవ సేవే, మాధవ సేవ’ అని చాటుతున్నాయి. ఈ సూక్తిని పాటించినప్పుడు భూతలం స్వర్గమయం అవుతుంది. శాంతిధామం అవుతుంది.

 - యస్. విజయ భాస్కర్

మరిన్ని వార్తలు