లీడర్‌

21 Dec, 2016 00:38 IST|Sakshi
లీడర్‌

సెలబ్రేటింగ్‌ లీడర్‌షిప్‌ డే

జన్మను దేవుడు నిర్ణయిస్తాడు.
బంధాన్ని మనిషి ఏర్పరుచుకుంటాడు.
జన్మబంధంగా లీడర్‌ నిలుస్తాడు.
ఆజన్మ బంధువుగా మనలో ఒకరై కలిసిపోతాడు.
ఇండియాలోనా? ఇంగ్లండ్‌లోనా? ఎక్కడ పుడతామో మనకు తెలియదు.
అంబానీలా? అంబలికైనా లేనివాళ్లా? ఎవరింట్లో పుడతామో తెలియదు.
తల్లిదండ్రులను, తోబుట్టువులను ఎంచుకోవడం మన చేతుల్లో లేదు.
కానీ... మంచి స్నేహితుణ్ని ఎంచుకోవడంలో...
మంచి లీడర్‌ని ఎంచుకోవడంలో మనదే చాయిస్‌. పూర్తిగా మనదే!
అవును. జన్మను దేవుడే ఇచ్చినా.. బంధాన్ని మానవుడే తెచ్చుకోగలడు.
ఆ బంధం... స్వచ్ఛమైనదైతే, నిశ్చలమైనదైతే, నిష్కల్మషమైనదైతే,
అణువణువూ సత్యమైనదే అయితే..
అది అనుబంధం అవుతుంది. భవబంధం అవుతుంది. ప్రేమబంధం అవుతుంది.
ఒకే తల్లికి పుట్టినంతగా... పేగుబంధం అవుతుంది.
అసలు బంధాల్లో గొప్ప బంధం ఏది?
కొందరు ప్రేమ బంధం అంటారు. కొందరు స్నేహ బంధం అంటారు.
ఇంకా చాలా ఉన్నాయి.
అనురాగబంధం, అభిమానబంధం, ఆత్మీయబంధం, అనిర్వచనీయ బంధం!
ఈ అన్ని బంధాల్లోకి శిఖర బంధం, శిఖరాగ్ర బంధం...
బాధ్యతను తీసుకునే బంధం.
బాధ్యతలో ఇవ్వడం మాత్రమే ఉంటుంది. తీసుకోవడం ఉండదు.
అందుకే అది శిఖరంపై ఉంటుంది.
ఎవరో ఇచ్చేది బాధ్యత కాదు. ఎవరికి వారు తీసుకునేది బాధ్యత.
బాధ్యత... తీసుకునే కానుక కాదు. స్వీకరించే కర్తవ్యం.
అందుకే బాధ్యత, నాయకత్వం వేర్వేరు కాదు.  
ఇలాంటి నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది.
అరుదైనదే కాదు, అందమైనది కూడా.
which is rare and beautiful. అదొక అందమైన నాయకత్వం.
ఎలాగైతే బాధ్యతను అడక్కుండా తీసుకుంటామో...
అలాగే ప్రేమను అడక్కుండా ఇచ్చేవారుంటారు. వారే నాయకులు. వారే లీడర్‌!
అంత గొప్ప బాధ్యతను తీసుకునే లీడర్‌కి అడక్కుండానే ప్రేమ దొరుకుతుంది.
ప్రేమ పొందిన నాయకుడు... బాధ్యతను భుజంపై నుంచి దించుకోడు.
దించుకోవాలని అనుకోడు.
బాధ్యతలను తప్పించుకుంటూ,
ప్రేమను పొందుతూ ఉండే బంధం కూడా ఒకటి ఉంటుంది.
అది అబద్ధపు బంధం. అశాశ్వత బంధం.
ఆ అబద్ధపు బంధం కొద్దిపాటి సమయమే చెల్లుబాటు అవుతుంది.
కొన్నాళ్లపాటే ఉంటుంది. మహా అయితే ఐదేళ్లు ఉంటుంది!
నిజం.. శాశ్వతం.
విశ్వసనీయత.. శాశ్వతం.
ఆత్మబంధుత్వం.. శాశ్వతం.
నిజం, విశ్వసనీయత, ఆత్మబంధుత్వం కలిసిందే.. లీడర్‌షిప్‌.
ఇవాళ డిసెంబర్‌ 21.
డిసెంబర్‌ 21ని ‘సాక్షి’ ఫ్యామిలీ ‘లీడర్‌షిప్‌ డే’గా సెలబ్రేట్‌ చేస్తోంది.
ప్రేమను పంచి, ప్రగతి వైపు నడిపించిన, నడిపిస్తున్న..
నిజమైన కొందరి నాయకత్వాలకు సలామ్‌ చేస్తోంది.


జ్యోతిబా పూలే (1827)
త్రేతాయుగంలో పరశురాముడు, కలియుగంలో మనువు, అగ్రరాజ్యంలో శ్వేతవర్ణం, అగ్రవర్ణ రాజ్యంలో వేదవాఙ్మయం! జ్యోతిబా పూలే రగిలిపోయాడు. దాస్యపీడనలో, దాష్టీకంలో ఏ యుగానికి ఏ యుగమూ తక్కువ కాదు. మనువు ఏం చేశాడు? మంచిని చేస్తున్నట్లే చేసి మంచిది కాని దాన్ని చేశాడు. దారి వేస్తున్నట్లే వేసి, దారులన్నీ మూసేశాడు. సృష్టి గురించి చెప్పాడు. సృష్టిలోని నికృష్టులెవరో చెప్పాడు! ఇంద్రియ నిగ్రహం అన్నాడు. అగ్రవర్ణ కక్కుర్తి అకృత్యాలకు అడ్డదారులు చూపాడు. స్త్రీల బాధ్యతలన్నాడు. స్త్రీలకు స్వేచ్ఛలేకుండా చేశాడు. రాజధర్మాలు అన్నాడు. ప్రజలను పడి వుండమన్నాడు. కులధర్మాలు నూరి పోశాడు. కడ జాతులు అన్నాడు. న్యాయం లేని నీతుల్ని, రీతుల్ని రచించాడు. ఇదంతా చూసి పూలే కన్నెర్ర చేశారు. కులబలాడ్యులను ఢీకొని, ‘కడ’బలహీనులకు అండగా, చేతికండగా ఉండి మహాత్ములకే పితామహాత్ముడయ్యారు పూలే.
లీడర్‌కి కులం ఉండదు. గుణం ఉంటుంది.

అల్లూరి (1897)
ఉద్యమంలో రక్తాన్ని చిందనివ్వని జాతీయ కథానాయకుడు గాంధీజీ అయితే,  మన ఊరి విప్లవ నాయకుడు అల్లూరి! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవై రెండు సార్లు కాల్పులు జరిగినా, రక్తపాతం జరక్కుండా సీతారామరాజు నిరోధించాడు. విరోధిని నిలువరించాడు. రామరాజు బాణంలాంటి లీడర్‌. విరిగి ముక్కలవడానికి, మెలితెరిగి వంకర్లు పోవడానికి, శిరస్సు వంచి నమస్కరించడానికి... వింటిని వదిలి రయ్యిన కంటికందని వేగంతో దూసుకుపోదు ఉద్యమబాణం. ఎక్కడ దిగబడాలో అక్కడ దిగబడేందుకే వెళ్తుంది. గూడెం చెట్టు ఏదో, తెల్లవాడి గుండె ఏదో దానికి తెలుసు.తెల్లవాడు అడవితల్లిని, అడవి బిడ్డల్ని వేరు చేస్తున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నందుకు బిడ్డలకు పన్ను విధిస్తున్నాడు. తల్లిపాలు తాగనివ్వకుండా  కాపలా కాస్తున్నాడు. ఒళ్లారని ఆడ పడుచుల్ని కళ్లారా చిదిమి, మేత మేస్తున్నాడు. అడ్డొచ్చిన అన్నని, తమ్ముడిని, తండ్రిని తలతెగ్గొట్టి ఊరేగిస్తున్నాడు. రామరాజు ఊరుకుంటాడా? అగ్నిజ్వాలై భగభగమన్నాడు. ఉద్యమ దావానలం అయ్యాడు. దాపనపల్లి, అడ్డతీగల, చోడవరం, రామవరం, జోగంపేట, పెద్దగడ్డ పాలెం, లింగాపురాలను రగిలించాడు. అప్పుడొచ్చాడు రూథర్‌ఫర్డ్‌. రామరాజు... రామరాజు... రామరాజు... ఎవరీ రామరాజు! అన్నాడు. ‘ఇక్కడున్నాడు కాల్చుకొమ్మని’ కొండదళం గుండెలు చూపించింది! రామరాజు ముందుకొచ్చాడు. ‘కాల్చుకోరా కుక్కా..’ అని తన గుండెను చూపించాడు. లీడర్‌ ముందుకు నడిపిస్తాడు. ముందుకు వచ్చి నిలబడతాడు.

బిపిన్‌ చంద్ర పాల్‌ (1858)
గాంధీజీది ఏ లక్ష్యమో, బిపిన్‌ చంద్రపాల్‌దీ అదే లక్ష్యం. దారులే వేరు. ప్రతిఘటనకు పిడిగుద్దులే సమాధానం అన్నారు బిపిన్‌. గాంధీజీ జాతి పిత అయితే, బిపిన్‌ ‘ఫాదర్‌ ఆఫ్‌ రివల్యూషనరీ థాట్స్‌’. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్‌ అగ్రెసివ్‌ లీడర్‌. అరబిందో అన్నట్లు బిపిన్‌ ఒక మహాశక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త.ముక్కుసూటి ఉక్కుమనిషి పాల్‌. విమర్శించాల్సిన చోట మృదువుగా మాట్లాడడం లేదా మౌనం వహించడం ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీస్తుందని బిపిన్‌ చంద్రపాల్‌ నమ్మారు. చివరి వరకు ఆ నమ్మకం మీదే నిలబడ్డారు. అందుకోసం గాంధీజీనే విభేదించారు. లీడర్‌ విభేదిస్తాడు. అవసరమైతే విడిపోయి వచ్చేస్తాడు!


గాంధీజీ (1869)
గాంధీజీ డర్బన్‌ నుంచి ప్రిటోరియా వెళ్తున్నారు. ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్‌ కొని రైలెక్కారు. రైలు మారిట్ట్‌బర్గ్‌ స్టేషన్‌లో ఆగింది. ఒక తెల్ల ప్రయాణికుడు గాంధీజీ ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. గాంధీజీని చూశాడు. ‘నువ్విందులోకి ఎందుకు ఎక్కావ్‌? దిగిపో’ అన్నాడు. ‘ఎందుకు దిగిపోవాలి?’ అని గాంధీజీ అన్నారు. తెల్ల ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక పోలీసు వచ్చి గాంధీజీని ప్లాట్‌ఫామ్‌ మీదికి తోసేశాడు. అది చలికాలం. ఆ రాత్రంతా గాంధీజీ చలికి గజగజమని వణుకుతూ స్టేషన్‌లోనే గడిపాడు. ఒంటి రంగు కారణంగా తను అవమానానికి గురవడం గాంధీజీలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో అహింసాయుత ప్రతిఘటనకు ఊపిరిపోసింది. అదే సత్యాగ్రహం అయింది. భారత స్వాతంత్య్ర సమరానికి ఆయుధం అయింది. లీడర్‌.. దీక్షతో, దక్షతతో అనుకున్నది సాధిస్తాడు.

అంబేడ్కర్‌ (1891)
అం»ే డ్కర్‌ అణగారిన వర్గాల నాయకుడు. ధర్మశాస్త్ర పండితుడు. భారత రాజ్యాంగ నిర్మాత. సామాజిక తత్వవేత్త. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం కూడా దేశ ప్రజల స్థితిగతులపై, దేశ రాజకీయాలపై తన సిద్ధాంతాలతో అత్యంత ప్రభావం చూపిన ప్రయోగశీలి. అవమానాలను, అవరోధాలను, అవాంతరాలను తట్టుకున్న ధీశాలి. కులం వద్దన్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలన్నాడు. భిన్నత్వంలో ఏకత్వ విధానాన్ని పాటించాడు. ఐక్యతా స్ఫూర్తితోనే ఫెడరల్‌ పాలనా విధానాన్ని ప్రతిపాదించాడు. ప్రాథమిక హక్కులనేవి సమానత్వాన్ని, స్వేచ్ఛనూ ప్రసాదించే వరాలుగా ఆయన భావించాడు. సామాజిక న్యాయం గురించి  పరితపించాడు. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలన్నాడు. అస్పృశ్యతను నిషేధించారు. ఒకే వ్యక్తి, ఒకే విలువ అన్నాడు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌. అలాగని రాజ్యాంగం శిలాక్షరం కాదనీ, పరిస్థితుల్ని బట్టి సవరించుకోగలిగే అవకాశం ఉండాలనీ అన్నాడు. దేశ సమైక్యతని పరిరక్షించేందుకు బలమైన పార్లమెంటరీ వ్యవస్థను ఆయన కోరుకున్నాడు. అంబేడ్కర్‌కు బదులు ఏ విదేశీయుడో భారత రాజ్యాంగ రచనకు పూనుకుని ఉంటే బ్రిటిష్‌ తరహా నియంతృత్వ పాలనలోనే భారత్‌ మగ్గుతూ ఉండేది. లీడర్‌ మనకు ఏం కావాలో చేస్తాడు. మనకు ఏం వద్దో చెప్తాడు.

కొమురం భీమ్‌ (1901)
చట్టం, న్యాయం.. ప్రభువుల కోసం కాదు. ప్రజల కోసం. నిజాంలు మనుషుల్ని మనుషుల్లా చూడలేదు. అప్పుడొక మనిషి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. న్యాయాన్ని తుంగలో తొక్కిన అసఫ్‌ జాహిల గొంతుపై కాలుపెట్టాడు. ఆ వీరుడు.. కొమురం భీమ్‌. గిరిజనోద్యమ నాయకుడు. జల్, జంగిల్, జమీన్‌.. కొమురం నినాదం. కొండ కోనల్ని, పచ్చటి భూముల్ని దోచుకుని, భూమి పుత్రులపై దౌర్జన్యం చేస్తున్న నిజాం సర్కార్‌ని నిలదీశాడు. ఆయుధం చేతబట్టి సింహస్వప్నం అయ్యాడు. ఆదివాసీల ఆత్మగౌరవం కొమరం భీమ్‌. నిరంకుశంపై తుపాకీ ఎక్కుపెట్టిన వేగుచుక్క కొమురం భీమ్‌. అతడొక సెల్ఫ్‌ స్టెయిల్డ్‌ లీడర్‌. పోరాడుదాం రమ్మని పిలుపును ఇవ్వలేదు. పోరాటానికి గొంతు కలుపు చాలు అన్నాడు. మిగతాదంతా తనే చూసుకున్నాడు. లీడర్‌ సైన్యం కోసం చూడడు. తనే దళపతి, తనే సైన్యం అవుతాడు.

మదర్‌ థెరిసా (1910)
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్‌ థెరిసాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్‌  వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్‌. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! మదర్‌కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున  ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్‌  తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్‌ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్‌కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ప్రేమ ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది. మదర్‌ చెప్పింది ఇదే. లీడర్‌ ప్రేమను పంచుతారు. లీడర్‌ ఆకలిగొన్న కుటుంబానికి ధాన్యం పంపుతారు.

నెల్సన్‌ మండేలా (1918)
నల్లవాళ్లందరూ తక్షణం జోహాన్నెస్‌బర్గ్‌ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకుం జారీ అయింది.  ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు! జాతి విచక్షణ అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, విచక్షణను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. మండేలాను విడుదల చెయ్యాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు పి.డబ్ల్యూ.బోతా ఆయనకొక రాయబారం పంపారు. దేశం వదిలి వెళ్తానంటే వెంటనే విడుదల చేస్తామన్నాడు! మండేలా అంగీకరించలేదు. ‘‘పోనీ, మీ మనుషుల్ని హింస మానేయమని చెప్పండి. మిమ్మల్ని వదిలిపెడతాం’’ అని రెండో రాయబారం పంపాడు. మండేలా వినలేదు. నల్లజాతి ప్రజలకు జైలునుంచే ఒక లేఖను రాసి విడుదల చేశాడు. ‘‘జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను’’ అని తన జాతికి నమ్మకాన్ని, ధీమాను ఇచ్చారు.   లీడర్‌ ఒదిగి ఉంటాడు. మది ఎరిగి ఉంటాడు.

మార్టిన్‌ లూథర్‌కింగ్‌ (1929)
‘‘ఐ హావ్‌ ఎ డ్రీమ్‌’’... అన్నాడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. వాషింగ్టన్‌లోని లింకన్‌ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు!  ‘‘ఐ హావ్‌ ఎ డ్రీమ్‌’’ అన్నాడు మరింత గట్టిగా. మళ్లీ అదే హోరు.

ఏమిటి ఆయన కల?
‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్‌. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అది. నెల తిరక్కుండానే ఆ కల నిజమవడానికి తనింకా చాలా కష్టపడాలని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కి తెలిసి వచ్చింది. లూథర్‌ ప్రత్యర్థులు బర్మింగ్‌హామ్‌ చర్చిలో జరిపిన వర్ణవివక్ష పేలుళ్లలో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మార్టిన్‌ మనసు చెదిరింది. కానీ కల చెక్కు చెదరలేదు. పడనివ్వని వారు ఉంటారు. వారితో పడాలి. అడ్డుపడేవారుంటారు. వారిని దాటి వెళ్లాలి. దుష్ప్రచారం చేసేవారుంటారు. తట్టుకుని నిలబడాలి. తను నిలబడి, ప్రజల్ని నడిపించాలి. ప్రజల కలని తను కనాలి. ఆ కలను తనే నిజం చేసి పెట్టాలి. అప్పుడే లీడర్‌. అతడే లీడర్‌. మార్టిన్‌ లూథర్‌ లీడర్‌గా నిలబడ్డాడు.  అతడి స్వప్నం ఫలించింది. నల్లవారికి పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అమెరికన్‌ ఆఫ్రికన్‌లందరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించాయి. అమెరికన్లంతా ఎవరీ నల్లనాయకుడు అని తలతిప్పి చూశారు. కానీ మార్టిన్‌ తన ని తాను∙నాయకుడు అనుకోలేదు. లీడర్‌ తనని లీడర్‌ అని అనుకోడు. కార్యకర్త అని మాత్రమే అనుకుంటాడు.

అబ్దుల్‌ కలామ్‌ (1931)
కలామ్‌ నవ్వు చూస్తే ధైర్యం వస్తుంది. దగ్గరికెళ్లాలనిస్తుంది. రాష్ట్రపతి ఐతే నాకేంటి? సైంటిస్ట్‌ అయితే నాకేంటీ.. హి ఈజ్‌  మై ఫ్రెండ్‌ అని మనసుకు అనిపిస్తుంది. నవ్వుకు ప్రతినవ్వును ఇవ్వాలనిపిస్తుంది. సెల్యూట్‌ చెయ్యాలనిపిస్తుంది. కలామ్‌ సింపుల్‌ మనిషి. పీపుల్స్‌ ప్రెసిడెంట్‌.  ‘పెద్ద పెద్ద కలల్ని కనండి. వాటిని నిజం చేసుకోండి’ అని యూత్‌కి స్ఫూర్తిని ఇచ్చారు. ఖురాన్‌ను, భగవద్గీతను, బైబిల్‌ని అనుసరించారు. వాటి నుంచి మానవతామతాన్ని స్వీకరించారు. గాంధీజీ తన జీవితాన్ని సందేశంగా ఇచ్చి వెళితే, కలామ్‌ భారతీయ సమాజాన్నే సందేశాత్మకం చేశారు. కలామ్‌ భారతరత్న. అది సరిపోదు. కలామ్‌ విశ్వమానవ రత్నం. సహనం, ప్రేమ, ఆలోచన, సాధన, కృతనిశ్చయాలను ప్రబోధించిన మునీశ్వరుడు అబ్దుల్‌ కలామ్‌. లీడర్‌ నవ్వు ప్రశాంతత ఇస్తుంది. ప్రగతివైపు నడిపిస్తుంది.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి (1949)
వీళ్లందరిలోని గుణాలు, వీళ్లందరిలోని గొప్పతనాలు ఉన్న మన కాలపు మన లీడర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. అసమానుడు, ఆత్మబంధువు, ఆశాజ్యోతి వై.ఎస్‌! దార్శనికుడు, ప్రజాబంధువు వై.ఎస్‌! స్నేహశీలి, సేవా తత్పరుడు, రైతు బాంధవుడు అవిశ్రాంత పథకుడు, మహాయాత్రికుడు వై.ఎస్‌! పొలాలకు జలాలిచ్చాడు. పథకాలకు జవసత్వాలు ఇచ్చాడు. అభివృద్ధికి బాటలు వేశాడు. పేదలకు ధీమా ఇచ్చాడు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చాడు. చరిత్ర సృష్టించాడు. చెరగని ‘రాజ’ముద్ర వేసి వెళ్లిపోయాడు. ఒక్కమాటలో వై.ఎస్‌. జనహృదయ నేత. మహానేత. లీడర్‌ వై.ఎస్‌లా ఉంటాడు. లీడర్‌షిప్‌కే వారసత్వాన్ని ఇచ్చి వెళతాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు