ఒడిశా విశ్వ కవి సమ్మేళనం

7 Oct, 2019 12:04 IST|Sakshi

రిపోర్టు

ప్రతి ఏటా నిర్వహించే విశ్వ కవి సమ్మేళనం, అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు, కళింగ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 39వ సమ్మేళనాన్ని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రారంభించారు. 82 దేశాల నుంచి 1,300 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (గిఇ్క) 1969లో ప్రారంభమైంది.

మనదేశంలో జరుగుతున్న మూడో విశ్వ కవి సమ్మేళనం ఇది. తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో  నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని సామాజిక వేత్త, లోక్‌సభ సభ్యులు  ప్రొఫెసర్‌ అచ్యుతా సామంత తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. గత ఏడాది చైనాలో నిర్వహించిన సమ్మేళనంలోకన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కవిత్వం, ప్రపంచ శాంతి దిశగా మానవీయ తత్వపు లక్ష్యాల దిశగా కొనసాగగలదని వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్రీ అధ్యక్షుడు డాక్టర్‌ మారస్‌ యంగ్‌ ఆశించారు. గతంలో రెండు ఉత్సవాలను భారతదేశంలో ఎంతో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

నాటి సభలకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారనీ, కలామ్‌ రెండు పుస్తకాలను తాను చైనీస్‌లోకి అనువాదం చేయగా అవి ఎంతో పాఠకాదరణ పొందాయనీ అన్నారు. వేదిక ఉపాధ్యక్షులు, అర్జెంటీనా కవి ప్రొఫెసర్‌ ఎర్నెస్టో కహాన్, కవులంతా మానవత్వాన్ని ఆపేక్షించే విశ్వ కుటుంబమని కొనియాడారు. ఈ సభలో ప్రసిద్ధ రచయిత రస్కిన్‌ బాండ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. సమ్మేళనం మొదటి రోజు ఆఫ్రికా, ఫ్రాన్స్, మంగోలియా, జపాన్, చైనా తదితర దేశాల యువ కవులు తమ కవితలను సొంత భాషలోనూ, ఇంగ్లిష్‌ అనువాదాలనూ వినిపించడం సభలో ఉత్సాహాన్ని నింపింది. సమ్మేళనం రెండో రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యుల చేతుల మీదుగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్‌ వాటర్‌ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ ఘనంగా జరిగింది.

కరుణ ప్రధానంగా సాగిన ఈ సంపుటి ప్రపంచ పాఠకులను ఆకట్టుకోగలదని మారస్‌ యంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భావావేశాన్ని తెలుగులో పట్టినంత ఉద్వేగంగా ఆ అంతస్సారాన్ని ఇంగ్లిష్‌లోకి కూడా తర్జుమా చేయడంలోనూ సిద్ధార్థ కృతకృత్యులయ్యారు. ఈ కవితా సంపుటిని విశ్వవేదిక మీద ఆవిష్కరించేలా కృషి చేసిన బ్లూజే ప్రింట్స్‌ నిర్వాహకులు, పాత్రికేయులు, డాక్యుమెంటరీ డైరెక్టర్‌ రాజా రమేశ్‌ అభినందనీయులు. 

మరిన్ని వార్తలు