జీవితాలతో ‘సెల్‌’గాటం..!

25 Feb, 2019 13:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ప్రపంచమంతా సెల్‌ మయం. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇవి భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాయి. సెల్‌ ఫోన్‌ను అవసరం మేరకు వినియోగించేవారు పనులు పూర్తిచేసుకుంటున్నారు. సెల్‌నే ప్రపంచంగా భావించేవారు భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. సెల్‌ గేమ్‌లలో మునిగిపోయి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసుకుంటున్నారు. సెల్‌లో వచ్చే ఆటలకు అధికమంది పిల్లలు, యువత బానిసలవుతున్నారని, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు మేలుకోకుంటే పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నారు.

విజయనగరం మున్సిపాలిటీ : బ్లూ వెల్‌ చాలెంజ్‌ గేమ్‌. ఇది ఒక ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌. 50 రోజుల పాటు సాగే బ్లూవెల్‌ గేమ్‌లో చివరి టాస్క్‌ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఏడాదిన్నర కిందట మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో మరొక పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ  ఆటను ఇండియాలో నిషేధించింది. అయితే... ఇది జరిగిన  కొద్దినెలల వ్యవధిలోనే  మరికొన్ని ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు విద్యార్థులు, యువత జీవితాలతో ఆటాలాడుకుంటున్నాయి. తాజాగా పబ్‌జీ ఉరఫ్‌ ‘ప్లేయర్‌ అనోస్‌ బ్యాటిల్‌ గ్రౌండ్‌’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూల్‌ విద్యార్థులను ఆ లోకంలో ముంచేస్తున్న  ప్రమాదకర ఆన్‌లైన్‌ మొబైల్‌ గేమ్‌ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాల స్థాయిలో కాకున్నా పబ్‌జీ విద్యార్థులను హింస, నేరప్రవత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. పాఠశాలలను ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుతోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతుండడంతో మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు. 

విద్యార్థులు... యువత భవిష్యత్తే టార్కెట్‌... 
ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ మల్టీప్లేయర్‌ గేమింగ్‌ యాప్‌. ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని గేమ్‌లో ప్రవేశించగానే ఒక ఐడీ వస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్‌. ఎంత మందితో ఈ గేమ్‌ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించుకుంటారు. ఈ గేమ్‌ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే, ఇది గ్రూప్‌ వాయిస్‌ గేమ్‌. అంటే ఈ గేమ్‌ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న జట్టు తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్‌ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట ప్రధాన లక్ష్యం. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్‌ కిట్‌ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్‌ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లో ప్రవేశించాలనుకుంటారు.

వైరల్‌గా మారుతున్న  వీడియో గేమ్స్‌.. 
మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం.. అదే స్థాయిలో మానవమనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయస్సు, లింగ బేధాలు లేకుండా ఆన్‌లైన్‌ ఆటల్లో నిమగ్నమయ్యేవారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా గేమ్స్‌ కేవలం ధనిక వర్గాలకే పరిమితం కాగా... ప్రస్తుతం అందరివద్ద హస్త భూషణంగా మారిన ఆండ్రాయిడ్‌ ఫోన్‌లతో ఈ సంస్కృతి మరింత పెరిగింది. ఒకసారి ఆడితే చాలు మనకు తెలియకుండానే బానిసలైపోతారు. ఇంట్లో ఖాళీగా ఉండే అండ్రాయిడ్‌ ఫోన్‌లలో వింత వింత వీడియో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తున్న చిన్నారులు వాటిలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. చివరికి ఆహారం తీసుకునేందుకు విముఖత చూపే స్థాయికి చిన్నారులు దిగజారిపోతున్నారు. తాజాగా ఇంటర్నెట్‌ను అనుసంధానం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు  మరింత ప్రమాదకారిగా మారాయన్నది మానిసిక నిపుణుల వాదన. ఒక్కసారి అలవాటు పడితే రోజుల తరబడి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు పిల్లలు. దీనికి సెల్‌ కంపెనీలు  ప్రకటిస్తున్న ఇంటర్నెట్‌ ఆఫర్‌లు మరింత ఆజ్యం పోస్తున్నట్లవుతోంది. తక్కువ మొత్తానికే రోజుల తరబడి ఇంటర్నెట్‌ వాడుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే అదునుగా  ఇంట్లో చిన్నారులు నెట్‌కు అనుసంధానమై గేమ్స్‌ భూతంలో చిక్కుకుంటున్నారు. ఇలా రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి  ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వరకు ఈ తరహా ఉచ్చులో చిక్కుకునే వారిలో ఉంటున్నారు.  

మేలుకుంటేనే మంచిది 
చిన్నారులు, విద్యార్థులు సెల్‌గేమ్‌లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే చాలా రకాల క్రీడలు అడేందుకు ఉన్నా... పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులోకి వచ్చిన వీడియేగేమ్‌ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. కేవలం తమ పిల్లల విద్యాభివృద్ధిపైనే కాకుండా వారి అభిరుచులు, అలవాట్లపై దృష్టి సారించి అవుట్‌ క్రీడల్లో  ప్రోత్సహించాలి. తద్వారా వారిలో మానసిక ఉల్లాసం పెరిగి చదువులో ఏకాగ్రత పెరుగుతోంది. ప్రతిరోజు వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని చెబుతున్నారు. 

భారతీయ క్రీడల్లో ప్రోత్సహించాలి  
ప్రస్తుతం తల్లిదండ్రులు కేవలం చదువు, ఉద్యోగంపైనే దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుతున్నారా..? లేదా..? అన్నదే కాకుండా వారి అలవాట్లను పరిశీలించాలి. ప్రధానంగా  వీడియే గేమ్‌లు ఆడే చిన్నారుల్లో మార్పు తీసుకురావాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటారు కదా అని  చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఒక్కసారి ఈ గేమ్‌ ఆడేందుకు అలవాటుపడితే వారిని అంత వేగంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకురాలేం. ఇంట్లో ఉన్నది కొద్ది సమయమే అయినా మన సంస్కృతికి సంబంధిత క్రీడల్లో ప్రోత్సహించాలి. 
– ఎం.మురళీధరరావు,  ప్రభుత్వ ఉపాధ్యాయుడు  

మానసిక సమస్యలు ఉత్పన్నం
పూర్తిగా మెదుడుకు సంబంధించి వీడియో గేమ్స్‌ను ఆడటం వల్ల చిన్నారులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా మానసికంగా బలహీనంగా మారుతారు. చిన్న వయస్సులోనే దృష్టిలోపం వస్తుంది. తలనొప్పి వంటి వ్యాధులు అనుబంధ క్రమంలో వ్యాప్తి చెందుతాయి. మానసిక సమస్యలు కొనితెచ్చుకోవడం ద్వారా చదువులో వెనుకబడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించి వారి అలవాట్లను మారేలా చేయాలి. లేకపోతే బ్లూ వెల్‌గేమ్‌ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
– ఎన్‌.సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం  

వీడియో గేమ్స్‌తో కలిగే దుష్ఫరిణామాలు... 


  • చిన్నతనంలో కదలకుండా ఒకే చోట కూర్చుని ఆడే వీడియో గేమ్స్‌ వల్ల కండరాల అభివృద్ధి తగ్గిపోతుంది. 

  • నరాల వ్యవస్థ దెబ్బతింటుంది.

  • నెక్‌పెయిన్, అర్థరైటిస్, వీక్‌నెస్‌ వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి.

  • కణజాలం పునరుత్పత్తి తగ్గిపోతుంది. 

  • ఉత్సాహం తగ్గిపోయి.. నిరుత్సాహం ఆవహిస్తుంది. 

  • నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో పాటు నిద్రలో ఇవే ఆలోచనలు వెంటాడుతుంటాయి. 

  • జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరికి ఏం చేస్తున్నారో తెలియని అయోమయ స్థితికి చేరుకుంటారు. 

  • పక్కన కూర్చున్న వారిని సైతం పట్టించుకోరు. దీంతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. 
  • ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. 
మరిన్ని వార్తలు