అమ్మ అభయం

12 Dec, 2016 14:26 IST|Sakshi
అమ్మ అభయం

అమ్మ పరబ్రహ్మ స్వరూపమేనని చెప్పినా, మొదటి నమస్కారం అమ్మకే చేయాలని వేదం ఎందుకు చెప్పిందో తెలుసుకుంటున్నాం. అయితే కేవలం సంతానవతి అయినంత మాత్రాన అందరి చేత పరబ్రహ్మ స్వరూపంగా ఒక స్త్రీ గుర్తింపు పొందుతుందా? శాస్త్రం అలా చెప్పలేదు. ఏ బిడ్డల్ని తల్లిగా కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మ స్వరూపిణి. ఏమీ తెలియకపోయినా,  ఏ శాస్త్రం చదవక పోయినా, ఆమె తన భర్తచేత ఉన్నతిని పొందుతుంది. ఆమెకు నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. అలాగే బ్రహ్మ సృష్టిచేసేటప్పుడు తనువు, కరణం, భువనం, భోగం అని నాలుగింటిని దృష్టిలో పెట్టుకుంటాడని అనుకున్నాం కదా! ఆ క్రమంలో సృష్టికి సంబంధించి బ్రహ్మ అంశ అమ్మ ‘తనువు’(శరీరం)లో ఎలా ఉంటుందో భాగవతంలోని ‘కపిలగీత’ ఇలా అంది....

‘‘స్త్రీ పురుషుల సంయోగ ప్రక్రియతో విడుదలైన పదార్థాలు సంయోగం చెంది, ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి, గర్భవాసం చేసినప్పుడు లోపల – రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అనే ఏడు ధాతువులు ఏర్పడాలి. దానిలో మళ్ళీ 9 రంధ్రాలు – రెండు కళ్ళు, రెండు శ్వాస రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం ఏర్పడాలి. అలాగే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకల, ధనంజయ, దేవదత్తాలనే పది వాయువులు ప్రవేశించడానికి అవకాశం కలిగి, అమ్మ కడుపు గర్భాలయమై, లోపల జీవుడు ప్రాణం పోసుకుని పుణ్య కర్మాచరణం చేయడానికి, తాను గతంలో చేసుకున్న పాపాలను అనుభవించడానికి కావలసిన శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ  తయారయ్యే గర్భాలయం మాతృగర్భంలోనే ఉంటుంది.’’

చేసుకున్న పాపాలు పోగొట్టుకోవడానికి, అద్భుతమైన శరీరం బ్రహ్మ ఇవ్వాలనుకున్నా, తయారవ్వాల్సింది– అమ్మ కడుపులోనే. తండ్రి కర్తవ్యం బీజాన్ని నిక్షిప్తం చేయడం వరకే. శరీర నిర్మాణం జరగాల్సింది అమ్మ కడుపులోనే!

ఇక రెండోది – ‘కరణం’. అంటే అంతఃకరణ చతుష్టయం– మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగూ సూక్ష్మరూపంలో ఉంటాయి. జీవుడు అమ్మ గర్భంలోకి ప్రవేశించినప్పుడు, అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైన ద్వారాలను తెరవగలిగిన స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది. ఎందుకలా అంటే... అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోనికి ప్రవేశించి ఇంద్రియాలను, పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్నీ, శక్తినీ నిక్షేపించడానికి ఆమె తాను తిన్న ఆహారంలోని శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకు పంపుతుంటుంది. దాని వల్ల కరణం.. అంతఃకరణ చతుష్టయం ఏర్పడింది.

ఇక మూడోది ‘భువనం’. అంటే... బయట ఉండే సమస్త భోగోపకరణ సంఘాతం. కాస్త సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే– ఉపశాంతి పొందడానికీ, ‘హమ్మయ్య!’ అని మొట్టమొదట సేద తీరడానికీ అసలు అవకాశం ఎక్కడుంటుందో దాన్ని ‘భువనం’ అంటారు. ఈ లోకంలో జీవుడు తెలిసి కానీ, తెలీక కానీ మొదట ఉపశాంతి పొందేది అమ్మ దగ్గరే! తొమ్మిది నెలలు కటికచీకట్లో ఉంటాడు. దాన్ని ‘గర్భస్థ నరకం’ అంటారు.

కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు. తిమ్మిరెక్కి పోతుంటుంది. లోపల వాత, పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నం చేసిన వాడిని పరమేశ్వరుడు ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేస్తాడు. బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. వెంటనే పూర్వజన్మ విస్మృతిని పొందుతాడు. పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞానం మరుగున పడుతుంది. ఆ చీకట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏవేవో ఆకారాలు కనబడి ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఊపిరి ఆగినంత భయానికి లోనవుతాడు.అమ్మ కడుపు దగ్గరకు జరుగుతాడు. ఆ భయానక స్థితిలో శిశువు ఉన్నప్పుడు ‘నా బిడ్డ’ అన్న భావనతో అమ్మ చేయి వేస్తుంది. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అందుకే అమ్మ – బ్రహ్మ. అమ్మ – దైవం.

నిజానికి జీవుడు మొదట ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొదట పొందేది పరమ భయం. దానికి పూర్తి ఉపశాంతి అమ్మ దగ్గరే లభిస్తుంది. అందుకే అమ్మ – బ్రహ్మ. అమ్మ – దైవం. ఆమె – పరమాత్మ స్వరూపం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు