రెండో స్థితి

10 May, 2018 00:18 IST|Sakshi

సచ్చిదానంద శివాభినంద నృసింహ భారతి అనే శృంగేరి పీఠాధిపతులు అరణ్యం గుండా వెళుతున్నారు. చీకటి పడటంతో, ఆ అరణ్యంలోనే ఒకచోట గుడారం వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్‌ అక్కడికి వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. అతనితో కొంత సంభాషణ అనంతరం, ‘‘నేను మూడు లక్షణాలు చెబుతాను. వాటిల్లో నువ్వు ఏ లక్షణాలు గలవాడివో నాకు చెప్పు’’ అన్నారు పీఠాధిపతి. ‘‘అడగండి’’ అన్నాడతను.

‘‘నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వారిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపమున్నవాడివా! లేక విషయం తెలుసుకున్నాక విరుచుకుపడే కోపమున్నవాడివా?’’ అని అడిగారు పీఠాధిపతులవారు. ‘‘నేను మొదటి కోవకి చెందినవాణ్ణి స్వామీ! నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను’’ అని చెప్పారు రేంజర్‌.

‘‘అలాగా... అయితే, నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు. ‘‘ఎందుకిలా చేశావ్‌’’ అని అడుగు’’ అని సెలవిచ్చారు స్వామివారు. అతను ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికి బాగా చీకటి పడింది. వంటవాడిని ‘‘బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు’’ అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే రెండు పలుచటి గోధుమ రొట్టెలు  తీసుకువచ్చి ఒణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు వంటవాడు. ఈయనకి ఎక్కడాలేని కోపం వచ్చింది.

‘నేను రాననుకొని వీడు తినేశాడు’ అనుకుని వెంటనే లేచి అతణ్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది. ఇవాళ రెండోస్థాయికి మారి చూద్దామని. ‘‘ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్‌’’ అని అడిగాడు. అతనన్నాడు. ‘‘మీ అటెండర్‌ని పంపించి కదా.. సరుకు తెప్పించుకుంటాం. అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నా కోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో రారో  అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి’’ అన్నాడు.

ఆ రేంజర్‌ వలవలా ఏడ్చేశాడు. ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నేను రెండోస్థాయికి వస్తేనే కానీ నాకిన్ని దోషాలు కనబడలేదు! ఇలా నేను ఎంతమందిని కొట్టానో అని విచారించి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. (చాగంటి కోటేశ్వరరావు ప్రసంగ భాగం)

మరిన్ని వార్తలు