ప్రతి ఇంట గంట మోగాలంటే

18 Aug, 2019 08:23 IST|Sakshi

స్త్రీ వైశిష్ట్యం –4

ఆడపిల్ల మెట్టినింట కాలుమోపిన క్షణం నుంచే అదే తన స్వస్థలం అయినట్లు అక్కడి వారితో మమేకమయి పోతుంది. అది ఒక్క స్త్రీకే  సాధ్యం. పరమేశ్వరుడి సృష్టిలో ఉన్న అద్భుతం. అలా ఆమె అక్కడికి చేరుకోకపోతే ఈ సృష్టి లేదు. ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే.. ‘‘యత్రనార్యస్తు పూజ్యంతే..’’ ఎక్కడయితే స్త్రీలు పూజింపబడతారో, ‘రమంతే తత్ర దేవతాః’’... అక్కడ దేవతలు సంతోషిస్తూ సంచరిస్తుంటారని అన్నారు. 

పుట్టుకతోటే ఆప్యాయతకు, త్యాగానికి మారుపేరు ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎంత పొగిడినా తెగిడినా అంతగా పట్టించుకోని ఆడపిల్ల కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రాన కన్నీరు పెడుతుంది. ‘నువ్వే నా ఐశ్వర్యానివి’ అన్నంత మాత్రం చేత ఉబ్బితబ్బిబ్బయి పోతుంది.  అంత ఆర్ద్రత కలిగిన హృదయం పురుషుడికి ఉండదు.

మగపిల్లవాడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని మాత్రం తరింప చేయగలడు లేదా ఏడుతరాలో, పదితరాలో తరింపచేయగలడు. అదే ఒక స్త్రీ రెండు వంశాలను ఉద్ధరింప చేయగలదు. ఉత్తమమైన నడవడి కారణంగా ఆ పిల్లను కన్న తల్లిదండ్రులు, వాళ్ళ వంశం తరిస్తుంది. మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింప చేస్తుంది. 

పురుషుడి ధర్మం అంతా స్త్రీ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్షధర్మంలో ‘పత్ని’ అనే మాట వాడతారు. పత్ని అంటే తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువుల్లో పీటమీద కూర్చునే అధికారాన్ని పొందిన స్త్రీని పత్ని అంటారు. భార్య–అంటే తన చేత భరింపబడునది అన్న అర్థం కారణంగా ఆ మాటను ఎక్కువగా ఉపయోగించరు. ఒక దేవాలయానికి వెళ్ళి పూజచేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా... ‘ధర్మపత్నీ సమేతస్య..’ అంటారు. ‘ధర్మపతీ సమేతస్య...’ అనరు. ఆమెయే ధర్మానికి మారుపేరు. ఆమె లేని నాడు పూజ లేదు. శాస్త్రం ఆధారంగానే మాట్లాడుతున్నా... ఇవి నా సొంతమాటలు కావు. శాస్త్రం... ప్రతి ఇంటా గంట తప్పనిసరిగా మోగాలంటుంది. అంటే పూజ జరగాలి – అని. అది ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మమే రాశీభూతమై ధర్మస్వరూపిణిగా వస్తుంది. ఆమె మళ్ళీ వేరుగా పూజ చేయాల్సిన అవసరం లేదు. తాను ఉదాత్త సంస్కారవతియై సంసారాన్ని ఉద్ధరిస్తుంది. ఆమె లేకుండా భర్త చేసిన పూజ నిష్ప్రయోజనం అవుతుందంటుంది శాస్త్రం. బ్రహ్మచర్యం దాటాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఆ తరువాత ఆచమనీయానికి నీళ్ళను ఎడమచేత్తో వేసుకోకూడదు. పూజాప్రారంభంలో ఆమె వచ్చి ఆయన ఎడమ పక్కన నిలుచుని ఆచమనీయం వేస్తేనే అతడి పూజ ప్రారంభం. అందుకే దేశకాల సంకీర్తనం లో ‘ధర్మపత్నీ సమేతస్య...’ అని చెప్పేది.

పైగా ఆమె ఉన్నది కనుక కామం ధర్మం చేత ముడిపడుతుంది. కామం విశృంఖలత్వాన్ని పొందితే లోకంలో ధార్మికమైన సంతానోత్పత్తి ఉండదు. వావి వరుసలు ఉండవు. అందుకే తన కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు. ‘నాతి చరామి’ అంటే... ‘నేనీమెను అతిక్రమించను’ అని ఇద్దరూ అంగీకరించుకున్న తరువాతనే ఆమె చెయ్యిపట్టుకుంటున్నాడు. ఇప్పడు ఆయన తేజస్సును ఆమె భరిస్తుంది. అలా కామాన్ని ధర్మంతో ముడిపెట్టడంతో సమాజం సుఖశాంతులతో సజావుగా ధార్మికంగా సాగుతున్నది. అర్థం, ధర్మం, కామం ముడిపడ్డాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా