నాన్నా! నేనున్నాను

16 Jun, 2019 10:16 IST|Sakshi

అమ్మ పాలు పడితే.. నాన్న జీవితాన్ని పిండి చెమట చిందిస్తాడు. పాలు తియ్యగా ఉంటాయి. చెమట ఉప్పగా ఉంటుంది. ఇవాళ తిన్న ఆ ఉప్పుకి రుణం తీర్చుకోవాలి. ‘నాన్నా! నేనున్నాను’ అని అయినా చెప్పండి.
జనరల్‌గా అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడతాం.. నాన్న గురించి తక్కువ మాట్లాడినట్లనిపిస్తుంటుంది. ఎందుకు అమ్మ గురించే ఎక్కువ మాట్లాడతాం?
నిజమే. సమాజంలో అమ్మ గురించి మాట్లాడినంత ఎక్కువగా నాన్న గురించి మాట్లాడం. అలాగని నాన్నను తగ్గించినట్లు కాదు. నాన్నను అర్థం చేసుకోవడంలో మనదే లోపం. సత్యం మాతా; పితా జ్ఞానం అన్నారు. సత్యం తల్లి. జ్ఞానం తండ్రి. కానీ నా దృష్టిలో ఇది సత్యం... ఇది అసత్యం అని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. కాబట్టి నాన్న ఎప్పుడూ గొప్పవాడే. నాన్నను తక్కువ చేసినా అది తక్కువయ్యేది కాదు. ఎందుకంటే ‘‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా.. నడిపించిన మా నాన్నకు నాన్నయ్యానుగా’’ అని ‘మనం’ సినిమా కోసం పాట రాశాను. చెడ్డ ప్రియురాలు ఉండొచ్చు. చెడు స్నేహితురాలు ఉండొచ్చు. కానీ చెడ్డ తల్లి ఉండదు అంటారు. అమ్మ  కని పెంచుతుంది. అసలైన జీవన మార్గంలో మనం ముందుకు వెళ్లడానికి, మన లక్ష్యం వైపు వెళ్లడానికి శక్తిని, సామర్థ్యాన్ని, తెలివిని, విద్వత్తును  ఇచ్చి దారిని చూపించి .. ఇలా వెళ్లు నీ గమ్యం వస్తుంది అని ఒక సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపించేవాడు నాన్న.  నా దృష్టిలో కని పెంచడంకన్నా.. నడిపించేవాడు ఇంకా గొప్ప. ఎందుకంటే... తల్లి కన్న తర్వాత వాడు మంచివాడు కావొచ్చు. చెడ్డవాడు కావొచ్చు. కానీ నడిపించేవాడు.. నడిపించే శక్తి లేకపోతే వారు దుర్మార్గులు కూడా అవొచ్చు. రాక్షసులు కావొచ్చు. నడిపించేవాడు సరిగ్గా ఉంటేనే కని పెంచినదానికి ఓ అర్థం.

నాన్న గురించి ఇంత బాగా చెప్పారు. అమ్మ గొప్పతనం గురించి ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’ అని రాశారు. ఆ పాట రాసిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటారా?
మా అమ్మగారిని ఊహించుకునే ఆ పాట రాశాను. ఎందుకంటే ఆ ట్యూన్‌ నా దగ్గరకు వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. నేను భోజనం చేసి అంతా సిద్ధం చేసుకునే సరికి 12 అయ్యింది. పాట రాయడానికి అప్పుడు కూర్చున్నాను. ఆ  ట్యూన్‌ కొత్తగా ఉంటుంది. ఆస్వాదించి రాయాలి. ఒంటి గంటకు  ఆ ప్రవాహం ప్రారంభమైంది. రాసే ముందు మా అమ్మను ఓసారి తలుచుకున్నాను. ఆమె పడ్డ కష్టాన్ని, చేసిన త్యాగాన్ని, శ్రమను గుర్తు చేసుకున్నా. అలాగే నా పిల్లలకు తల్లి అయిన నా భార్య గురించి ఆలోచించాను. అలా నాకు ఇద్దరు అమ్మలు. వారిద్దరినీ నా మనోఫలకంపై గుర్తు చేసుకున్నాను. నాకు తెలియకుండానే, నాలో ఏదో శక్తి ప్రవేశించి ఆ పాట రాయించిందని నా అభిప్రాయం. ఆ రోజు ఆ పాటను నేను రాశానా? లేక మా అమ్మ రాయించిందా. నా భార్య రాయించిందా? లేక పైన ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ రాయించిందా? తెలియదు. ప్రపంచంలోని అమ్మలందరికీ చెందుతుంది ఈ పాట. ఎందుకంటే మనలోని ప్రాణం అమ్మ. మనదైన రూపం అమ్మ. ఎనలేని జాలిగుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ. కరుణించే కోపం అమ్మ. వరమిచ్చే తీపి శాపం అమ్మ. అమ్మ కోప్పడినా అది కోపం కాదు కరుణ. కరుణకు మరో రూపం. అమ్మ శాపనార్థాలు పెట్టినా అవి మనకు దీవెనలే. అమ్మ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మనకు అది అర్థం అవుతుంది. ఆ దూషణలే తర్వాత భూషణలు అవుతాయి అని. ఆ ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుని మనల్ని మనం మార్చుకుంటే..మనల్ని మనం మలుచుకుంటే ఆ తిట్లు మనం జీవితంలో పైకి రావడానికి మెట్లుగా వాడుకోవచ్చు. ప్రతి తిట్టు మనం పైకి ఎదగడానికి దోహదపడటానికి మెట్టు.

నాన్న గురించి పాట రాయలేదేమో?
ఆ అవకాశం నాకు ‘శత్రువు’ అనే చిన్న సినిమాకి వచ్చింది. అయితే ‘మనం’ సినిమాలో అమ్మ గురించి, నాన్న గురించి ఒకే పాటలో రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘ఒకరిది కన్ను.. ఒకరిది చూపు’ అని రాశాను. కన్ను అమ్మ అయితే చూపు నాన్న. కన్ను మూసుకుంటే లాభం ఏముంది? తెరిచి చూడాలి. కంటికి ప్రయోజనం చూపు. చూపుకి ఎంత ప్రయోజనం ఉందో చెబుతున్నాం. అలాగే ‘ఒకరిది మాట ఒకరిది భావం’ అని రాశాను. అంటే మాట ఒకరు.. అర్థం ఒకరు అని. మాట లేనిదే అర్థం లేదు. అలాగే మాటల్లేని భావం కూడ వ్యర్థమే. మాట, అర్థం రెండూ ఉండాలి. తల్లిదండ్రుల్లో ఎవరు  గొప్పవారు అనే విషయం పక్కనపెడితే ఇద్దరి కలయికలోనే మనం వచ్చింది. మన శరీరంలోని ప్రతి కణంలో వారి తాలుకూ అంశలు ఉంటాయి. అమ్మలోని ఓర్పు... నాన్నలోని చాకచక్యం. తెలివి ఇలా అన్నీ ఉంటాయి. బీజం, క్షేత్రం రెండూ ఉంటేనే కదా ఫలం వచ్చేది. వారిద్దరికీ సమప్రాధాన్యం ఉంది కాబట్టే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. 

అమ్మానాన్నను పాటల రూపంలో కీర్తించడం బాగుంది. కానీ మనం వారిని ఎలా చూసుకోవాలి? 
మన కోసం ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలను ఓర్చుకుంటారు. త్యాగాలు సపర్యలు, సేవలు చేసీ చేసీ వాళ్ల యవ్వనాన్నంతా మనకోసం ధారపోస్తారు. వాళ్లు తాజాగా ఉన్నప్పుడు మన కోసం కరిగిపోతారు. వారి శరీరం వంగిపోయినప్పుడు, ముడతలు పడేలా కష్టపడినప్పుడు, వారి వృద్ధాప్యంలో మనం వారికి ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది ముఖ్యం. ‘అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా.. అడుగులు, నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా’ అని పాటలో రాశాను. చిన్నప్పుడు మనకు అడుగులు, నడకలు నేర్పించిన నాన్నకు మనం నేడు మార్గం కావాలి. దారి చూపించాలి. ఇప్పటి కాలంలో మనం సాంకేతికంగా చాలా ముందు ఉన్నాం. ఇదంతా నాన్నకు తెలియదు. మనం నాన్నకు తెలియజెప్పాలి. చెప్పడానికి విసిగించుకోకూడదు. చీదరించుకోకూడదు. నాన్నకు అన్నీ బోధపడేలా చెప్పాలి.

ఆయన మనకోసం చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా మనం ఏం ఇస్తున్నాం? ఆ వయసులో వారు కోరుకునేదేంటి? కాస్తంత ప్రశాంతత. వాళ్లు ప్రశాతంగా ఉండేలా చూడాలి. మన పిల్లలతో ఆడుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆయన తన అనుభవాలను చెబుతుంటే శ్రద్ధగా వినాలి. విని వారిని సంతోషపెట్టాలి. వారి మాటల్లోని అనుభవసారాన్ని గ్రహించి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు వారి వృద్ధాప్యం కూడా బాగుంటుంది. వృద్ధాప్యం వారికి శాపంలా అనిపించకూడదు. స్వామి వివేకానంద ‘భరత భూమి నా బాల్యడోల. నా యవ్వన నందనవనం. నా వార్ధక్యం వారణాసి’ అన్నారు. వారణాసి అంటే పుణ్యక్షేత్రం. వృద్ధాప్యం అంత పవిత్రమైనది అని అర్థం. మనం అంత పవిత్రంగా వారిని చూసుకోవాలి. వారు ఉండే వాతావరణం కానీ ప్రదేశాన్ని బాగా ఉంచాలి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటే వారి రుణం తీర్చుకున్నట్లే అంటారు. కానీ ఆ రుణం తీరనిది. మనం దయారుణాన్ని మాత్రమే తీర్చుకుంటాం. అది ప్రయత్నం. మనకు ఇంత గొప్ప శరీరాన్ని, మనస్సును, జ్ఞానాన్ని అందించారు. ప్రపంచంలోకి తెచ్చారు. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అడుగులు తడబడే వయసులో ఉన్నప్పుడు వారికి మనం ఊతకర్ర అవ్వాలి.

మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు?
పిల్లలం ఒక్కోసారి తల్లి చెప్పింది చేస్తాం. ఒక్కోసారి చేయం. కానీ తండ్రి చేసేది మాత్రం కచ్చితంగా వింటాం. అంటే ఆచరిస్తాం అని అర్థం. మా అమ్మ మాకు రకరకాల విషయాలు చెబుతుండేది. జీవితం అంటే ఏంటి? కష్టం, సుఖం ఇలా తనకు తెలిసిన మాటల్లో చెప్పేది. కానీ నాన్న మాత్రం చేస్తుండేవారు. మా నాన్నను చూసి ఒకటే నేర్చుకున్నాం. అది చాలా గొప్ప విషయం. అది గొప్పదని ఎలా తెలిసిందంటే... నాకు జ్ఞానం కలిగాక, చాలా అధ్యయనం చేశాక తెలిసిందే. ఒక శ్లోకం చదివాను. ‘శ్లోకార్థేన ప్రవక్ష్యామి యద్యుక్తం గ్రంథకోటిబిం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం’. దీని అర్థం ఏంటంటే.. కోటి గ్రంథాలను కాచి వడపోసి ఒక సగం శ్లోకంలో ఇమిడిస్తే  ‘పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అయింది’. గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు.. అన్నింటి సారాంశం ఇదే. ఈ విషయాన్ని మా నాన్న  అమలు చేశారు. నేను విన్నాను, చూశాను. నాన్న పరోపకారం చేశారు. పరపీడన చేయలేదు. ఆయన చర్యలు, ఆయన చేష్టలు, ఆయన క్రియల ద్వారా ఇది తెలుసుకున్నాను. పరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల సొమ్ము ఆశించడం ఎప్పుడూ చేయలేదు. దీన్నంతా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఒకే ఒక్క విషయం అది. దాన్ని పాటిస్తున్నాను. కుదిరితే సాయం చేయాలి కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. 

మీ నాన్నకు, నాన్నగా మీకు ఉన్న తేడాలేంటి? 
అప్పట్లో మా నాన్నకు ఉన్న పరిధులు వేరు. మేం నలుగురు సంతానం. ఆయనకు సంపాదన అంతగా లేదు. మాది పల్లెటూరు. మమ్మల్ని పెంచడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. మేం కూడా వాటిని అర్థం చేసుకొని పెరిగాం. నేను నాన్న అయ్యేసరికి ఆ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు లేవు. కాబట్టి పిల్లల్ని పెంచడానికి కష్టపడలేదు. అయితే సాధారణంగా కష్టాల నుంచి సగం నేర్చుకుంటారు. మేం నేర్చుకున్నాం. జీవితం గురించి తెలుసుకున్నాం. నా పిల్లలకు నేర్చుకునే అవకాశం పోయింది. అన్ని సదుపాయాలు కల్పించి, అందించి పిల్లల్ని పెంచడానికి మించిన దురదృష్టం ఇంకోటి లేదు. దాని వల్ల వాళ్లు చాలా కోల్పోతారు. ఇప్పుడు వాళ్లని పెంచడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను. మంచి మార్గంలో నడపడానికి, బోధించడానికి కష్టపడుతున్నాను. మా నాన్న జీవించడానికి కష్టపడారు. నేను జీవితాన్ని బోధించడానికి కష్టపడుతున్నాను. 

ఇప్పటి పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నాం కదా?
అవును. ఇప్పుడు నా పిల్లలకు వారు ఎంచుకునే మార్గంలో నడిచే స్వేచ్ఛ ఉంది. చిన్నప్పుడు నాకు అది లేదు. పాటలు పాడకుండా మంచి ఉద్యోగం చేయి అంటూ అప్పుడప్పుడు కోప్పడేవారు నాన్న. మనకు అవి తిండిపెట్టవు, చదువుకోమని చెప్పేవారు. అలా నా చేతికి సంకెళ్లు ఉండేవి. ఆ సంకెళ్లతోటే నేను స్వేచ్చగా ఎగరగలిగాను. ఆ సంకెళ్లు వేసుకునే ఎగిరే విద్య నాకు అబ్బింది. ఆ సంకెళ్లు నాకు వరం అయ్యాయి. విహరించే శక్తి, ఓర్పు నేర్చుకున్నాను.  ప్రతికూల పరిస్థితులలో కూడా నన్ను నేను మలుచుకున్నాను, చెక్కుకున్నాను. దానివల్ల ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తి ఏర్పడింది. ఇప్పటి తరానికి ఆ అవకాశం తక్కువ. ఇప్పటి పిల్లలకు సంకెళ్లు లేవు. పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్చ దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలో మనం చెప్పాల్సి వస్తొంది.

పిల్లల్ని ఒకప్పుడు అమ్మే ఎత్తుకునేది. ఇప్పుడు నాన్న కూడా పిల్లల్ని ఎత్తుకుంటారు. ఈ మార్పు గురించి చెప్పండి? నాన్నకు అమ్మతనం వచ్చిందా?
ఈ విషయాన్ని మనం  రెండు కోణాల్లో చూడొచ్చు. చిన్నప్పుడు మా నాన్న దర్జాగా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. మా అమ్మ మమ్మల్ని ఎత్తుకొని వెళ్లేది. ఇప్పుడు నాన్న ఎత్తుకుంటున్నారు. వంట పని షేర్‌ చేసుకుంటున్నారు, ఆర్థిక స్వాతంత్య్రం స్త్రీకి వచ్చింది. ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆర్థిక భారాన్ని ఇద్దరూ పంచుకుంటున్నప్పుడు, బాధ్యతనూ ఇద్దరూ మోస్తున్నారు. వంటలు అమ్మకే పరిమితం కాదు. స్త్రీకి లభించిన విద్య, ఉద్యోగ అవకాశాలు వల్ల ఆర్థికంగా వాళ్లు భర్తకు తోడు రావడంతో ఇప్పుడు అన్నీ ఇద్దరూ పంచుకునేలా మారాయి. ఇది మంచి పరిణామం.

మగవాళ్లు ఇంటి పనులు పంచుకుంటే తక్కువ అయిపోతారనే భావన సమాజంలో పూర్తిగా పోయిందంటారా?
పూర్తిగా పోయిందని చెప్పలేం. అక్కడక్కడా ఇంకా ఇలాంటి భావాలు ఉన్నాయి. అయితే నేను ‘మాతృత్వపు మాధుర్యానికి మగ రూపం నాన్న’ అనే వాక్యం ఓ పాటలో విన్నాను. ఇప్పుడు నాన్న కూడా చాలా మెత్తబడిపోతున్నాడు. ఇంతకుముందు  అమ్మ మృదువుగా ఉండేది నాన్న కఠినంగా ఉండేవారు. ఇప్పుడు నాన్న కూడా మృదువుగా మారిపోతున్నాడు. ఇంతకుముందు హూంకరించేవాడు, గర్జించేవాడు. ఇప్పుడు లాలించడమే. నాన్న కూడా ఎత్తుకుంటున్నాడు, వంట చేస్తున్నాడు, డైపర్‌ మార్చడం చేస్తున్నాడు. ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. పిల్లల సంరక్షణ భారంలో పాలుపంచుకుంటున్నాడు. ఓ రకంగా చాలా మంచి మార్పు. ఇద్దరు కలసి కన్నారు.. ఇద్దరు కలసి పెంచాలి. ఇద్దరూ కలసి తీర్చిదిద్దాలి. ఇలా చేయడం హర్షణీయం.  

మీ చిన్నతనంలో పేదరికం అనుభవించారు. ఇప్పుడు పరిస్థితి వేరు. మరి మీ నాన్న కోసం మీరు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి?
చిన్నప్పుడు పాటలు వినడానికి మాకు రేడియో లేదు. ఒక కరెంట్‌ బల్బ్‌ ఉండేది. పాటలు ఎలా వినేవాడిని అంటే.. అప్పట్లో రేడియోలో జనరంజని ప్రోగ్రామ్‌ వచ్చేది. మా చుట్టుపక్కల చాలామందికి రేడియో ఉండేది. పక్కవాళ్ల ఇంట్లో పల్లవి వచ్చేది. ఆ ఇల్లు దాటేలోపే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌. ఇంకో ఇంటికి చేరుకునే సరికి చరణం వచ్చేది. అలా పాటలు వినేవాణ్ణి. రేడియో లేదు అని నిరాశ చెందకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి అనుకునేవాణ్ణి. ఏకసంథాగ్రాహిత్వం ఆ పేదరికం నుంచే వచ్చింది. రేడియో లేకపోవడం నుంచి వచ్చింది. ఫ్యాను, కనీస వసతులు లేకపోవడం వల్ల ఏ చిన్న అవకాశం దొరికినా కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ రూపాయి, పాటల పుస్తకం దాచుకోవడం లాంటి లక్షణాలు వచ్చాయి. మా ఊళ్లో మా నాన్నకు మేం పిల్లలందరం కలసి ఇల్లు కట్టాం. కలర్‌ టీవీ, ఫ్రిజ్, గీజర్‌ ఇలా అన్నీ పెట్టాం. అన్ని సౌకర్యాలతో కట్టాం. మేమెలా ఉన్నామో వాళ్లు అలానే ఉండాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం.  మా అమ్మగారు ఈ మధ్య చనిపోయారు. అది పెద్ద బాధ. 

రచయితగా మీరు సంపాదించిన కీర్తి ఎంతో. ఆ విజయానికి మీ నాన్న వ్యక్తపరిచిన ఆనందం గురించి? 
అదో అంతు చిక్కని ప్రశ్న. నేను మా ఊరు వెళుతుంటాను. నా చిన్నప్పుడు ఎలా ఉండేవారో నాతో నాన్న ఇప్పుడూ అలానే ఉంటారు. వేరేవాళ్లతో అలానే ఉంటారు. నా గురించి గొప్పగా మాట్లాడినా అలానే ఉంటారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు సైకిల్‌ మీద 20 కిమీ వెళ్లినప్పుడు ఎలాంటి వ్యక్తిత్వం ఉందో ఇప్పుడు బెంజి కారులో తీసుకెళ్లినా అదే వ్యక్తిత్వం. మట్టిని వదలని మనస్తత్వం ఆయనది. పిల్లల విజయాన్ని బయటకు వ్యక్తపరచకుండానే ఆస్వాదిస్తారు.

తల్లి ఎక్కువా? తండ్రి ఎక్కువా?
ఇద్దరూ సమానమే. మనకు తల్లి అందించే చనుబాలు ఎంత గొప్పవో తండ్రి చిందించే చమట నీళ్లు కూడా అంతే గొప్ప. రెండిటికీ ఒకటే విలువ అని అంటాను. తల్లి 9 నెలలు మోస్తుంది. తండ్రి తాను బతికున్నంత కాలం మనల్ని మోస్తూనే ఉంటాడు. తన ఊహల్లో, జ్ఞాపకాల్లో తన ఆలోచనల్లో తన కలల్లో నిరంతరం మోస్తూనే ఉంటాడు. 

నాన్న పాటల్లో మీకు నచ్చినవి?
నాన్న మీద చాలా తక్కువ పాటలు వచ్చాయి. కవులందరూ అమ్మల్నే కీర్తించారు. ఈ మధ్య నాన్న గురుంచీ రాస్తున్నారు. విన్నారో లేదో కానీ ఈ మధ్య ఓ గజల్‌ బాగా ఫేమస్‌ అయింది. ‘నాన్న నాకు చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను. కానీ కనిపించని ఒక కవచం అది. నన్ను గాల్లో ఎగరేస్తున్నాడు అనే అనుకున్నాను కానీ నాలో ధైర్యాన్ని నింపుతున్నాడు’ అంటూ ఆ గజల్‌ సాగుతుంది. అది విన్నప్పుడల్లా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నాన్న పాట కూడా బావుంటుంది.  

మరి.. వృద్ధాప్యంలో ఉన్న నాన్న ఒంటరి జీవితం గడపబోతున్నారా?
ఇప్పుడు మా నాన్న ఒక్కరే ఉంటున్నారు. అయితే నాన్నని ఇకనుంచి నా దగ్గరే పెట్టుకుంటాను. నాతోపాటే మా నాన్న ఉంటారు. నా పెళ్లయిన తర్వాత పదేళ్ల వరకూ కూడా నాతోనే ఉన్నారు. ఇల్లు కట్టాక సరదాగా ఉందాం అని అక్కడ ఉన్నారు.

సో.. ఈ ఫాదర్స్‌ డే తర్వాత మీ నాన్న ఇక మీతోనే ఉంటారన్న మాట.. అవును. నేనున్నంతవరకూ నాన్న నాతోనే ఉంటారు.
డి.జి. భవాని
 

మరిన్ని వార్తలు