సభాముఖి

18 Nov, 2018 23:50 IST|Sakshi
చంద్రముఖి

ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కోసం పోరాడుతున్న చంద్రముఖి.. సభాముఖంగానూ తన గళం వినిపించేందుకు బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్‌ వేస్తున్నారు.

చంద్రముఖి మువ్వల! ట్రాన్స్‌జెండర్‌ మాత్రమే కాదు. ప్రావీణ్యం గల భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత. సినీనటి. అంతేకాదు, ఒక దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త. చంద్రముఖి ఇప్పుడు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. చక్కటి రూపం, శ్రావ్యమైన గొంతుక ఉన్న చంద్రముఖి ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో తమ స్వరాన్ని వినిపించేందుకు, ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధిగా ముందుకొస్తున్నారు.

ఈ ఎన్నికల్లో  బీఎల్‌ఎఫ్‌ (బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌) అభ్యర్ధిగా గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ బహుశా చంద్రముఖే కావచ్చు. సామాజిక జీవనంలో ట్రాన్స్‌జెండర్లు కూడా భాగస్వాములేనని, వారిపై కొనసాగుతున్న అన్ని రకాల హింస, వివక్ష తొలగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అమలును ఆకాంక్షిస్తూ, వారి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం, సమానత్వం కోసం ఒక నినాదమై చంద్రముఖి ముందుకొస్తున్నారు.  

అస్తిత్వానికి ప్రతీక
‘‘వందల ఏళ్లుగా హింసకు, అణచివేతకు గురవుతూనే ఉన్నాం. మహిళలపై కొనసాగుతున్న అన్ని రకాల అణచివేతలు ట్రాన్స్‌జెండర్లపైన కూడా ఉన్నాయి. సామాజికంగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నాం. కుటుంబాల బహిష్కరణకు గురవుతున్నాం. అడుగడుగునా అవహేళన. చూపులతో, సూటిపోటి మాటలతో, రకరకాల హావభావాలతో చేసే వెకిలి చేష్టలు. అన్ని రకాల  వేధింపులను భరిస్తున్నాం. దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనల ఫలితంగా సుప్రీం కోర్టు ట్రాన్స్‌జెండర్ల హక్కులను గుర్తించింది. సమాజంలో భాగమేనని చెప్పింది. ఏ వివక్షా లేని స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవించే హక్కుకు  భరోసాను ఇచ్చింది.

కానీ ఆచరణలో ఆ ఆదేశాలు అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నాయి. లక్ష మందికి పైగా ఉన్న  తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై గళమెత్తుతూనే ఉన్నాం. ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఒక్క ట్రాన్స్‌జెండర్ల సమస్యలపైనే కాదు. సామాజిక జీవితంలో భాగంగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా అనేక రకాల సమస్యలపైనా మా కమ్యూనిటీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేపడుతూనే ఉంది. ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచని అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు, మా సమస్యలను మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాం’’ అంటున్నారు చంద్రముఖి.

‘‘వందల ఏళ్లుగా హిజ్రాలు ఈ సామాజిక జీవనంలో భాగంగానే ఉన్నారు. ఒకప్పుడు గౌరవప్రదంగా బతికినప్పటికీ  ఇప్పుడు యాచకులుగా ఎంతో దయనీయమైన జీవితాలను గడుపుతున్నారు. ఇప్పటికైనా మా బతుకులు మారొద్దా...’’ అని ప్రశ్నిస్తున్న చంద్రముఖి డిగ్రీ పూర్తి చేశారు. ‘అలయన్స్‌ ఇండియా పహెచాన్‌’ అనే సంస్థలో కొంతకాలం పాటు ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు. ఒక టీవీ చానల్‌లో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో  పనిచేసే ఉద్యోగులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు.

హక్కులకు భరోసా కావాలి
‘‘మేమెందుకు యాచకులుగా బతకాలి. అందరిలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల వృత్తులు చేసుకొనే అవకాశాలు మాకెందుకు లభించకూడదు’’ అంటున్న చంద్రముఖి సమాజంలో తమ జనాభాకు అనుగుణమైన అవకాశాలు లభించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు ఉండాలని కోరుతున్నారు.

ట్రాన్స్‌జెండర్ల గౌరవప్రదమైన జీవితం కోసం 2011లోనే ‘ తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌సమితి’ని ఏర్పాటు చేశారు. ఒకవైపు తనకు నచ్చిన కెరీర్‌లో కొనసాగుతూనే మరోవైపు  ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో భాగస్వామిగా నిలిచారు. ‘‘ట్రాన్స్‌జెండర్లుగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకోలేకపోతున్నాం. అనేక రకాల అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది.

తమ కొడుకు ట్రాన్స్‌జెండర్‌ అని తెలియగానే ఆ కుటుంబాలు ఇళ్ల నుంచి బహిష్కరిస్తున్నాయి. అలా వీధిన పడ్డవాళ్లకు ఎక్కడా రవ్వంత ఆదరణ లభించదు. ఇటు కుటుంబం, అటు సమాజం  బహిష్కరిస్తే మేము ఎక్కడికి వెళ్లాలి. అలా పుట్టడం మా తప్పా’’ అని అడుగుతున్న చంద్రముఖి ఆవేదన మాత్రమే కాదిది. వేలాది మంది ట్రాన్స్‌జెండర్ల హృదయ వేదన. తమ పోరాటం కేవలం తమకే పరిమితం కాకూడదని, అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్‌జెండర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని చంద్రముఖి కోరుతున్నారు.

గెలుపుపై ధీమా
బీఎల్‌ఎఫ్‌ అభ్యర్ధిగా గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్న చంద్రముఖి నవంబర్‌ 19న  (నేడు) నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్‌ కూటమి పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా, హక్కుల సంఘాల మద్దతుతో పోటీకి దిగుతున్న తనను ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు.

తనను గెలిపిస్తే కేవలం ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధిగానే కాకుండా గోషామహల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజల మద్దతు, ఆదరణ తమకు ఉందని, తప్పనిసరిగా గెలిచి తీరుతానని కూడా చంద్రముఖి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గుర్తించండి చాలు
అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్‌జెండర్ల సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో గుర్తించాలి.
‘సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌ అనే ఒక కమ్యూనిటీ ఉంది’ అని గుర్తిస్తే చాలు. అందరిలాగే వాళ్లు కూడా మనుషులేనని గౌరవిస్తే చాలు. 
అన్ని రకాల హింసల నుంచి, వివక్ష, అణచివేతల నుంచి విముక్తి లభించాలి.
ట్రాన్స్‌జెండర్లందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌లు కల్పించాలి.
అన్ని ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి.
వయోధికులైన వారికి పెన్షన్‌ సదుపాయం అమలు చేయాలి.
అన్నింటికీ మించి ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు సామాజిక భద్రత కల్పించాలి.

– పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు