నైట్‌షిఫ్ట్‌లతో డీఎన్‌ఏలో మార్పులు

30 Jan, 2019 00:30 IST|Sakshi

ఇతరులతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వారి డీఎన్‌ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ఫలితంగా గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. అనెస్థీషియా అకడమిక్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారి డీఎన్‌ఏ మార్పులు... మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువ ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్‌ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువ ఉంటుంది.

డీఎన్‌ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం.. మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డబ్ల్యూ.చోయి తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని విశ్లేషించామని, కాకపోతే ఈ పరీక్షలు చాలా తక్కువ మందితో జరిపామని చోయి వివరించారు. మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే డీఎన్‌ఏ విడిపోవడానికి.. వ్యాధులకూ ప్రత్యక్షసంబంధం ఉందని చెప్పగలమని వివరించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు