చంటి పెసరట్టు

1 Dec, 2018 05:27 IST|Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

భోజనాలు పెట్టే అరిటాకుల్లో టిఫిన్‌ పెడతాడు చంటి. రెండు ఇడ్లీలు అని అడిగితే, ఇవి కూడా ఒకసారి తిని చూడండి సర్‌ అని రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, నల్లకారం పొడి, పచ్చడిలో నెయ్యి వేసి ఇస్తారు. ఇడ్లీల మీద వేసుకోవడానికి చిన్న గిన్నెలో నెయ్యి విడిగా ఇస్తారు. ఇడ్లీల మీద చెర్రీ పండుని గుచ్చిన టూత్‌ పిక్, పక్కనే నిమ్మకాయముక్క ఇస్తారు చంటి. ఇంతా చేసి రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, నెయ్యి, పచ్చళ్లు, కార ప్పొడి, అంతటి అరిటాకు అంతా కలిసి 30 రూపాయలే. చంటి ఆత్మీయ వడ్డనకు మాత్రం వెలకట్టలేం.

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లాలో ‘కానూరు’ ఒక మారుమూల పల్లె. నిడదవోలు నరసాపురం ఆర్‌ అండ్‌ బి రహదారి మీదుగా ఉంది కానూరు. ఊరి మొదట్లో కొండాలమ్మ అమ్మవారి ఆలయం... ఆ ఆలయం సమీపిస్తుంటే, గుడి గంటల గణగణలతో పాటు, పెసరట్ల ఘుమఘుమలు ప్రయాణికులను ఆకర్షిస్తాయి. పచ్చటి పొలాల సమీపంలో నిత్యం రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం. అది స్టార్‌ హోటల్‌ కాదు. అతి చిన్న కాకా హోటల్‌. అందరూ ముద్దుగా ‘చంటిహోటల్‌’ అని పిలుచుకుంటారు. కానూరు చంటిహోటల్‌లో టిఫిన్‌ తిన్నాక టీ, కాఫీలు తాగడం మరచిపోకండి.... అని ప్రత్యేకంగా చెబుతారు.  ఉన్న ఊళ్లోనే హోటల్‌ పెట్టుకుని నాణ్యమైన టిఫిన్స్‌ చేసి అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. వ్యాపారం చేయాలంటే కస్టమర్స్‌ అభిమానం పొందాలని తెలిసిన చంటి కస్టమర్స్‌ని గౌరవిస్తూ హోటల్‌ పెట్టిన కొద్దిరోజుల్లోనే చంటి హోటల్‌లో టిఫిన్స్‌ బావుంటాయి అనే నమ్మకం కలిగించారు. 

1967 ప్రాంతంలో సాదా తాతారావు కుటుంబం కానూరులో పేదరికంతో ఉండేది. పొట్ట నింపుకోవడం కోసం కానూరులోనే చిన్న కాఫీ హోటల్‌ ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ‘బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని, ఒక్కోసారి గుడి దగ్గర ఉండే కొబ్బరి చెక్కలను తిని బతికిన రోజులు కూడా ఉన్నాయని, నెమ్మదిగా నిలదొక్కుకుని తన తండ్రి రెండు ఎకరాల పొలం కొన్నారని, నాన్నగారు కాలం చేశాక, ఊరి శివారులో చంటి హోటల్‌ ప్రారంభించాన ’ని చెబుతారు రెండో అబ్బాయి సూర్యారావు ఉరఫ్‌ చంటి. 

చిన్న పెసరట్టు...
ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ హోటల్‌ పనిచేస్తుంది. ‘‘మొదట్లో పెద్ద పెసరట్టు వేసేవాడిని. కాని రుచిగా అనిపించలేదు. చిన్న పెసరట్టు వేసి, పైన ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కమ్మని నేతితో వేస్తే బాగా నచ్చింది. అప్పటి నుంచి చిన్న పెసరట్లు వేయడం ప్రారంభించాను’’ అంటారు చంటి. కారప్పొడితో పాటు నాలుగురకాల చట్నీలు జత చేసి, అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తారు. ‘వేడి వేడి పెసరట్లు అరటి ఆకు మీద పడగానే, అరటి ఆకు నుంచి కమ్మటి వాసన బయటకు వస్తుంది. ఆ రుచి కోసం అందరూ ఎగబడతారు. ఇక వండి వడ్డించడంలో, సర్వీస్‌ అందించడంలో గోదావరి వారికి ఉన్న పేరు తెలిసిందేగా’ అంటున్న చంటి, స్వయంగా పెసరట్లు తయారు వేస్తారు. ఎవ్వరినీ వెయ్యనివ్వరు. 

ప్రముఖులు రుచి చూశారు...
కానూరుకి సమీపంలో ఉన్న చాగల్లుకి చెందిన ప్రముఖ సినీ దర్శకులు వి. వి. వినాయక్‌కి ఈ పెసరట్టు అంటే ప్రీతని, అటు వచ్చినప్పుడు తప్పనిసరిగా పెసరట్టు రుచి చూసి వెళ్తారని, అటుగా వెళ్లే ప్రతి రాజకీయనాయకుడు తప్పనిసరిగా పార్సిల్‌ తెప్పించుకుంటారని సంతోషంగా చెబుతారు చంటి. 

పువ్వుల్లో కాఫీ...
కాఫీ, టీలు ప్రత్యేకంగా అందిస్తారు. అల్లం టీ, మిరియాల టీ, ఏలకుల టీలతో పాటు కొత్తరకమైన కాఫీని కనిపెట్టారు చంటి. కాఫీని అటు ఇటు గ్లాసులతో తిరగబోశాక, పైన వచ్చిన నురుగు మీద బూస్ట్‌ వేసి నిండుగా గులాబీ రేకులు చల్లిన ఒక ప్లేటు మధ్యలో గ్లాసు ఉంచి అందిస్తారు. ఇక్కడి కాఫీ, టీ, టిఫిన్లు రుచి చూడటానికి దూరాల నుంచి కూడా వస్తుంటారు. ‘రాజమండ్రి నుంచి ప్రతి వారం స్టూడెంట్స్‌ గ్రూప్‌గా వచ్చి, çకడుపు నిండా తినేసి లెక్క పెట్టకుండా రెండు లేదా మూడు వేలు ఇచ్చి వెళ్లిపోతార’ని ఎంతో సంతోషంగా చెబుతారు చంటి.  తండ్రి దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల క్రితం సొంతంగా ప్రారంభించి, అందరి అభిమానం పొందుతూ, విజయవంతంగా నడుపుతున్నారు చంటి హోటల్‌ని. పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఎంతో దూరాల నుంచి తన పెసరట్టు కోసం వస్తున్న కస్టమర్లను దేవుళ్లుగా భావిస్తూ, ప్రేమతో కలిపిన పెసరట్లను అందిస్తున్నారు చంటి. కానూరుకి చెందిన చంటి హోటల్‌ అతిథ్యానికి మారుపేరు అనే పేరు తెచ్చుకుంది. 
– సంభాషణ: వైజయంతి పురాణపండ
– ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, 
సాక్షి, పెరవలి మండలం 

మరిన్ని వార్తలు