లబ్‌డబ్ టాటూ

29 Nov, 2015 02:21 IST|Sakshi
లబ్‌డబ్ టాటూ

పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాతపాట ఈ కాలానికి చెల్లదు. కానీ నేటి పచ్చబొట్లు చాలా హైటెక్ అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఎలాగంటారా? ఈ ఫొటో చూడండి. ఇందులో కనిపిస్తున్న పచ్చబొట్టు మీ గుండెకొట్టుకునే వేగంతోపాటు ఇతర ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. కయాటిక్ మూన్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీలో పచ్చబొట్లను విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోని (ఎలక్ట్రిక్ కన్‌డ్యూసివ్) ఇంక్‌తో పొడుస్తారు.

ఈ ఇంకుతో సర్క్యూట్ మాదిరి చిత్రాలను గీయడం... అవసరమైన చోట ట్రాన్సిస్టర్లు, డయోడ్‌లను అమర్చడంతో మన శరీరంపైనే ఓ చిన్నస్థాయి సెన్సర్ల నెట్‌వర్క్ ఏర్పాటవుతుందన్నమాట. ఫొటోలో పచ్చగా మిణుకు మిణుకుమంటున్న ఎల్‌ఈడీలు రక్త ప్రవాహంపై ఓ కన్నేసి ఆ వివరాలు అందిస్తే... సెన్సర్లు ఇతర పనులను చక్కబెడతాయి. టెక్‌టాట్ అని పిలుస్తున్న ఈ సరికొత్త టాటూలు గుండె కొట్టుకునే రేటు, నాడి, శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేయగలవు.

మరిన్ని వార్తలు