ఒక మేక... ఒక ఏనుగు...

8 Oct, 2015 08:22 IST|Sakshi
ఒక మేక... ఒక ఏనుగు...

హిట్ క్యారెక్టర్
 
పూర్తి పేరు    :    మామిళ్లపల్లి వీరభద్రరావు
పుట్టింది    :    1948 జూన్ 6న
ఫస్ట్ మూవీ    :    జాతర (1980)
లాస్ట్ మూవీ    :    చూపులు కలిసిన శుభవేళ (1988)
టోటల్ పిక్చర్స్    :    180కు పైగా
మరణం    :    1988 జూన్ 30న
 
టాప్ టెన్ మూవీస్

1.    నాలుగు స్తంభాలాట (1982)
2.   శ్రీవారి ప్రేమలేఖ (1984)
3.    ఆనంద భైరవి (1984)
4.    బాబాయ్-అబ్బాయ్ (1985)
5.    పుత్తడి బొమ్మ (1985)
6.    రెండు రెళ్లు ఆరు (1986)
7.    మారుతి (1986)
8.    అహ నా పెళ్లంట (1987)
9.    వివాహ భోజనంబు (1988)
10.    చూపులు కలిసిన శుభవేళ (1988)
 
 
 సినిమా పేరు: పుత్తడి బొమ్మ (1985) 
డెరైక్ట్ చేసింది: జంధ్యాల 
సినిమా తీసింది: ఎస్. వెంకటరత్నం 
మాటలు రాసింది: జంధ్యాల
 
‘సుత్తి’ వీరభద్రరావు రేర్ కమెడియన్. సీరియస్ ఫేస్‌తో కనిపిస్తూనే సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేల్చినన్ని ఫన్ గన్‌లు ఇంకెవరూ పేల్చలేదేమో. ఎంత త్వరగా క్లిక్కయ్యాడో, అంతే తొందరగా వెళ్లిపోయాడాయన. 41 ఏళ్లకే కన్ను మూయడం తెలుగు హాస్యాభిమానుల దురదృష్టం. ఎయిటీస్‌లో రిలీజైన సినిమాలన్నింటిలోనూ దాదాపుగా వీరభద్రరావు ఉన్నారు. ఇక జంధ్యాల డెరైక్షన్‌లో సినిమా అంటే  వీరభద్రరావు ఉండి తీరాల్సిందే. ‘పుత్తడి బొమ్మ’ సినిమా ఫ్లాప్ అయినా, ఈయన కేరెక్టర్ మాత్రం సూపర్ హిట్.
 
ఆ ఊళ్లో వాళ్లు పులిని చూస్తే భయపడరు. సింహం కనబడితే పారిపోరు. ఏ ఖడ్గమృగం ఎదురుపడ్డా వణికిపోరు.కానీ, ‘మేక’ ఆమడదూరంలో కనిపిస్తే మాత్రం అందరికీ ఒకటీ రెండూ వచ్చేస్తాయ్. మేక అంటే అంత భయం. కాదు కాదు అంత వణుకు. చిత్రంగా ఉంది కదూ! అయితే మీకు మేకను ఇంట్రడ్యూస్ చేయాల్సిందే!
   
మేక అంటే జంతువనుకునేరు. అదో మనిషి పేరు. లాల్చీ పైజామా, మెడలో శాలువా, గాంధీగారి కళ్లద్దాలు, మెడలో వేలాడే సంచి... ఇదీ అతని గెటప్. దాదాపుగా మీకు అర్థమైపోయే ఉంటుంది. మేక అంటే ‘మేధావి కవి’ అని అర్థం. శ్రీశ్రీ లాగా షార్ట్ నేమ్ పెట్టుకోవాలని ఇలా పెట్టుకుని తగలడ్డాడన్నమాట. ఇతగాడి అడుగుల శబ్దం వినబడితే చాలు... ఆ రోడ్డంతా కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీ. ముక్కుతూ మూల్గుతూ కాళ్లీడ్చుకుని నడిచేవాళ్లు సైతం... ఇతగాడికి దొరికితే హుసేన్ బోల్ట్ కన్నా స్పీడ్‌గా పరిగెట్టేస్తారు. అవును మరి... అదంతా అతగాడి కవితల మహత్యం. మచ్చుకు ఒకటి రుచి చూడండి.

‘‘నీలి ఆకాశానికి జలుబు చేసింది...వెండి నేలకు వేడి చేసింది... చల్లగాలికి పైత్యం చేసింది...ఈ ప్రకృతికే జబ్బు చేసింది...’’ నిజంగా ఈ కవిత వింటే మనకే జలుబు చేసి, పైత్యం వచ్చి, జబ్బు వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది కదూ. ఇంకొక్కటి రుచి చూడండి...‘‘కోడి కూసింది... కొక్కొరక్కో కొక్కొరక్కోమేక అరిచింది... మే మే మే మే...కుక్క మొరిగింది... భౌ భౌ భౌ భౌ’’ ఇదెలా ఉంది? అసలు విషయం మరిచిపోయాం. ఇతగాడికో ఊతపదం కూడా ఉంది. ప్రతి మాటకీ వెనుక ‘నీ మొహం మండ’ అని అంటుంటాడు.
 
ఆ ఊళ్లోవాళ్లు ఇతని కవిత్వం దెబ్బకి జడుసుకుని పారిపోతున్నారు. దాంతో ఏటిగట్టున తిష్ట వేసి కొత్తగా ఊళ్లోకొచ్చేవాళ్లకి తన కవితల దెబ్బ రుచి చూపిస్తున్నాడు మేక. చిన్న పిల్లలు కనపడితే పది పైసలు ఆశ చూపించి మరీ కవితలు వినిపిస్తుంటాడు. ఆ దెబ్బకు వాళ్లు వారం దాకా లేవలేనంత నీరసపడిపోతుంటారు.ఆ ఊళ్లో తాగుబోతు కిష్టిగాడున్నాడు. ఎప్పుడూ ‘మందో రామచంద్రా...’ అని అల్లల్లాడిపోతుంటాడు. ఆ కిష్టిగాడికి 200 రూపాయలు లంచమిచ్చి మరీ వాళ్లమ్మాయి పెళ్లిలో తన కవి సమ్మేళనం పెట్టించుకుంటాడు మేక. పెళ్లి భోజనం తిందామని లొట్టలేసుకుని వచ్చిన వాళ్లంతా... ఈ మేకను చూసి పరుగో పరుగు...
   
 ఆ ఊళ్లో కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు. ‘‘ఈ మేక వల్ల మనకూ మన ఊరికీ భద్రత లేకుండా పోయింది. ఏదో ఒకటి చేయాలి’’ అని ఒకడు ఆవేశపడిపోయాడు. ‘‘మర్డర్ చేసేయమంటారా?’’ అని ఇంకొకడు కత్తి నూరడం మొదలుపెట్టాడు. ‘‘ముల్లుని ముల్లుతోనే తీయాలి. కవిని కవితోనే కనుమరుగు చేయాలి. మన ఊరంతా కలిసి ఈ మేకకు ఘనసన్మానం చేద్దాం. ఏనుగుపై ఊరేగించి ఆ ఏనుగునే బహుకరించేద్దాం. కాకినాడలో ఇంతకు మించి మెదడు తినేసే కవి ఒకడున్నాడు. వాడి పేరు క్షుర. అంటే క్షుద్ర రచయిత. అతగాడికి మన మేకను అంటగడదాం. ఆ బాధ పడలేక, ఈ ఏనుగుని మేపలేక మేకగాడు కుయ్యోమొర్రోమంటాడు’’ అని ఒక పెద్దాయన ఉచిత సలహా పారేశాడు.
 
అందరూ ఈ సన్మానానికి చందాలేసుకోవడానికి సిద్ధమయ్యారు. అటుగా వెళ్తున్న మేక ఈ గుంపుని చూసి దగ్గరకొచ్చాడు. తనకు సన్మానం చేయబోతున్నారనే సంగతి తెలుసుకుని సంకలు గుద్దుకున్నాడు. ‘‘గజారోహణంతో పాటు గజ బహుమానం కూడానా. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత నాకే దక్కుతోందీ గౌరవం. నేను కూడా నా వాటాగా నూటపదహార్లు ఇస్తా’’ అని సంబరపడిపోయాడు.
   
సన్మానం అద్దిరిపోయింది. మేకను ఏనుగు మీద ఊరేగించారు. ఆ తర్వాత ఆ ఏనుగుని మేకకు గిఫ్ట్‌గా ఇచ్చేశారు. ఏనుగుని చూసుకుని తెగ మురిసిపోయాడు మేక. ఆ రాత్రి ఆనందంతో నిద్రపోలేదు. తెల్లారింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.పేద్ద మేడ. అది మేక గారి మేడ. ఆ మేడ ముందు ఏనుగు. ఆకలితో ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. ఉలిక్కిపడ్డాడు మేక. ‘‘ఓహో... దీనికి టిఫిన్ తినే టైమ్ అయ్యిందన్నమాట’’ అని బయటికొచ్చాడు. ఏం పెట్టినా గుట్టుక్కుమనిపిస్తోంది ఏనుగు. ఎంత పెట్టినా చిటికెలో స్వాహా. ఫస్ట్ రోజు బానే ఉంది. రెండో రోజు బానే ఉంది. ఇక రోజూ దీన్ని మేపలేక మేక, నిజంగానే పీక తెగిన మేకలాగా అరుస్తున్నాడు.
   
 చిన్న డాబా. అది మేకగారి డాబానే. ఏనుగు గారి క్షుద్బాధ తీర్చడం కోసం మేడ అమ్మేసి ఈ డాబాలో చేరాడు. ‘‘తినవే నీ మొహం మండా... నీ ఆకలి మండిపోను... ఏది తిన్నా దిగదుడుపే... పందులు తిన్నా పరగడుపే... ఆదమరిస్తే నన్నూ మింగేసేలా ఉన్నావే. నీకు లాగూ చొక్కా కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసై పోయుండేవాణ్ణి’’ అని తిడుతూనే ఏనుగుకి మేత పెడుతున్నాడు మేక.
 ఇంతలో ‘జై వీరేంద్రాయనమః’ అంటూ ‘క్షుర’ ప్రత్యక్షమయ్యాడు. ‘‘నేను రాసిన ‘మహా పీనుగ’ నవలలోని ఓ ఘట్టాన్ని వినిపిస్తాను తమరికి’’ అంటూ కపాలాలు, ప్రేతాలు, రక్తం, శ్మశానం, జబ్రకదబ్ర అంటూ ‘క్షుర’ తాను రాసింది వినిపిస్తుంటే, ఇక్కడ ‘మేక’కు మూర్ఛవచ్చినంత పనైంది.
   
పెంకుటిల్లు. ఇప్పుడు మేకగారు ఇక్కడే ఉంటున్నారు. ‘‘ఇక నా వల్ల కాదు. మేడ మింగేసావ్. డాబా నమిలేశావ్. ఇదిగో ఈ పెంకుటింట్లోకి తెచ్చావ్. కావాలంటే ఆ పెంకులన్నీ మింగేయ్’’ అంటూ మేక ఆ ఏనుగుని తెగ తిడుతున్నాడు. అదేమో ఆకలితో అరుస్తోంది.‘‘నువ్వు శాకాహారివి కాబట్టి సరిపోయింది. అదే ఏ చికెనో, మటనో, ఫిష్షో అంటే చచ్చుండేవాణ్ణి’’ అని వాపోయాడు మేక. ఇంతలో ‘క్షుర’ ఎంటరయ్యాడు. మూలిగే మేక మీద తాటిపండు పడటమంటే ఇదేనేమో! పాపం... మేక!
   
 పూరి పాక. ఇది మేకగారి ప్రెజెంట్ అడ్రస్. పాక ముందు నులక మంచం వేసుకుని పీనుగులా పడున్నాడు మేక. ఆ పక్కనే ఏనుగు.ఇంతలో ఊళ్లోవాళ్లొచ్చి గొడవ గొడవ. ‘‘ఈ ఏనుగుని ఇంట్లో కట్టేసుకోవచ్చుగా. ఇలా రోడ్ల మీద వదిలేస్తే ఎలా?’’ అని అరిచాడొకడు. ‘‘అది పట్టే ఇల్లే ఉంటే ఈ గుడిసెలో ఎందుకుంటాను నాయనా’’ అన్నాడు మేక చాలా నీరసంగా. ‘‘ఈ ఏనుగు మా కల్లు పాకలో దూరి కల్లంతా తాగేసింది. ఇప్పుడు మా పరిస్థితేంటి?’’ అని అడిగాడు ఇంకొకడు. ‘‘దీని మొహం మండ. నాకు గంజి లేకుండా చేసి, ఇది మాత్రం కల్లు తాగిందా? నేను మాత్రం ఏం చేయగలను?’’ అని దీనంగా అన్నాడు మేక. చివరకు మేకకు ఈ గుడిసె కూడా మిగిలేట్టు లేదు.

‘‘అయ్యా... పది పైసలు దానం చేయండి’’ అంటూ అడుక్కుంటున్నాడు మేక. నడిచే ఓపిక లేదు. అందుకే ఏనుగెక్కి మర అడుక్కుంటున్నాడు. అప్పుడు గాని, మేకకు జ్ఞానోదయం కాలేదు. ఊళ్లో వాళ్లనెలా హింసించాడో తెలిసింది. సన్మానం పరమార్థం బోధపడింది.తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడట. మన మేకగారికి అదే జరిగింది. ఇక మేక జన్మలో కవిత్వం చెప్పడు. ఇది ఏనుగు గ్యారంటీ.
 - పులగం చిన్నారాయణ

మంచి కామెడీ ఎపిసోడ్ ఇది!
జంధ్యాలగారి దగ్గర నేను చాలా చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశా. జంధ్యాలగారు, వీరభద్రరావుగారు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. జంధ్యాలగారు 39 సినిమాలు డెరైక్ట్ చేస్తే, 18 చిత్రాల్లో వీరభద్రరావు ఉన్నారు. ‘పుత్తడి బొమ్మ’ షూటింగంతా రాజమండ్రికి సమీపంలోని తొర్రేడు గ్రామంలో జరిగింది. ఏనుగు ఎపిసోడ్ మాత్రం మద్రాసుకు సమీపంలోని ఓ పల్లెటూళ్లో చేశాం. ఈ కామెడీ ట్రాక్ చాలా బావుంటుంది. ఈ సినిమా అంతా హెవీ సెంటిమెంట్. ఈ ఎపిసోడ్ బాగా రిలీఫ్ ఇస్తుంది. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు తలుచుకున్నా ఈ ట్రాక్ బాగా నవ్వు తెప్పిస్తుంది.
  - పుల్లారావు, దర్శకుడు-నిర్మాత (ఈ చిత్రానికి అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశారు)

మరిన్ని వార్తలు