దేవుడికి సమర్పించాల్సిన... ఆ ఎనిమిది పూలు

13 Nov, 2016 00:39 IST|Sakshi
దేవుడికి సమర్పించాల్సిన... ఆ ఎనిమిది పూలు

మానవీయం

ధర్మం అన్న మాటకు పర్యాయపదమే భక్తి. గోనెసంచుల్లో మారేడు దళాలు తీసుకొచ్చి, పూలదండలు మోసుకొచ్చి పూజ చేయడాన్ని భక్తి అనరు. కూర్చొని, ఊరికే స్తోత్రాలు చేసి, పూలు వేసేస్తే - పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్య నిష్ఠతో ధర్మపాలన చేసినవాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసినవాడే ధర్మాన్ని అనుసరిస్తునట్లు! భగవంతుడు విహిత కర్మ చెప్పాడు!! విశుద్ధ కర్మ చెప్పాడు!! ‘‘ఒరేయ్ ! నీకు అయిదు ఇంద్రియాలిచ్చాను. సుఖం అనుభవించు... నేను వద్దనడం లేదు. వీణావాదన వినాలని ఉందా, పాట వినాలని ఉందా? ‘సాంబశివాయని అనరే..’ అని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటారు. విను! భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే ‘కంజ దళాయతాక్షీ’ అంటూ కీర్తన చేస్తుంటే మురిసిపో! కానీ, లౌల్యానికి కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దన్నదాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు! విశుద్ధకర్మ విడిచిపెట్టకు! ఇతరుల ద్రవ్యాన్ని కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నీకు ఇచ్చినదేదో అదే పరమానందదాయకం అన్న భావనతో జీవితాన్ని అనుభవించు. అలా బతికినవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు!

పరమ భక్తితత్పరుడు అన్నదానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపఃశిల్పం సకలమపి ముద్రా విరచనా...’’ నేను మాట్లాడుతున్నానంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు. మనుష్యుడిగా నాకు జన్మనిచ్చి, పరమేశ్వరుడు 83 లక్షల 99 వేల 999 జీవులకు ఇవ్వని చక్కటి స్వరపేటికను ఇచ్చి, ఇన్ని మాటలు నా చేత పలికించగలుగుతున్నాడు. ఆయన పలకించిన ఆ ఒక మంచి మాటతో ఎంత కష్టంలో ఉన్న వాళ్ళనైనా శాంతి పొందేలా చేయగలుగుతున్నాను. ‘‘అయ్యా. బెంగ పెట్టుకోకండి. ‘భయకృత్ భయనాశనః’ - ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీసేస్తాడు. చింతించకండి’’ అని ఒక్క మంచి మాట అన్నాననుకోండి. అంత కష్టాన్నీ మర్చిపోయి వెళ్ళగలుగుతున్నారు.

‘‘మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు’’. మాట అంత గొప్పది. ‘‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం’’ అన్నారు. ఆ మాటచేత ఏదైనా పొందవచ్చు. శత్రుత్వాన్ని, చివరకు మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ‘‘ఈశ్వరా! నాకు ‘మాట’ ప్రసాదించావు. నీవిచ్చిన ‘మాట’ను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేది కాకుండా నేను చూసుకుంటా’’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మాట్లాడే ముందు జాగ్రత్తపడేవాడెవడో... వాడు పరదేవత పట్ల భక్తితో ఉన్న వాడు. అంతేకానీ నాలుగుపూలు వేసి పూజ చేసి, బయట రావణుడిలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే భక్తుడెలాఅవుతాడు?

‘‘ధార్మికమైతే నేను మాట్లాడతా. కాకపోతే మాట్లాడను’’ అన్నాడనుకోండి. ఇప్పుడది భక్తి. ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘‘సకలమపి ముద్రా విరచనా’’ - నా చేతులు, కాళ్ళు ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది అవయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే!

ఇలా ఏది చేస్తున్నా భగవంతుని అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్నవాడు నిత్యం భగవంతుడికి ఉత్సవం చేస్తున్నవాడితో సమానం. కేవలం ‘అష్టదళ పాదపద్మారాధన’ టికెట్ కొనుక్కుని ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకున్నవాడు ఆ పద్మారాధన సేవ చేసినవాడు కాడు. ‘అష్టదళ పాదప ద్మారాధన’ ప్రతిరోజూ ప్రతిక్షణం చేసేలా అనుగ్రహించమని వేడుకోవాలి.

ఆ పూజెలా ఉండాలి? 8 రకాల పూలతో పూజ. ఏమిటా పూలు? ‘అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియనిగ్రహః, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తతై  ్తవచ సత్యం అష్టవిధం పుష్పమ్ విష్ణోః ప్రీతికరమ్ భవత్’ అన్నారు. అహింస (ప్రేమ), ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, ధ్యానం, సత్యమనే 8 రకాల పుష్పాలతో నీ మనస్సుని ఈశ్వరుని పాదాల వద్ద పెట్టు. భక్తిమార్గంలో పయనించడమంటే అదీ! 

ఈశ్వరుడు వద్దన్నదాన్ని చేయకుండా ఉండడం- బ్రేకు. చేయమన్నదాన్ని చేయడం -యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం. గమ్యం ఈశ్వరానుగ్రహం. ఇది ఎవడికి సాధ్యపడుతుందో వాడు ఉద్రేకపడడు, ప్రలోభాలకు లొంగడు. రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు... ‘ఒకడు మంచివాడా, చెడ్డవాడా అని దేన్నిబట్టి నిర్ణయించాలి’ అని. ‘ఎవడో సంతోషంతో పొగిడాడనో, లేదా అక్కసుకొద్దీ తిట్టాడనో కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి దాన్ని నిర్ణయించాలి.’

చాలామంది రాముడికి సీతమ్మ ఇష్టమనుకుంటారు. కానీ ఆయనకు ఏది ఇష్టమో తెలుసా? తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టమొచ్చినా రాముడు నిత్య తృప్తుడు. నవమి (9వతిథి)నాడు పుట్టాడు. తొమ్మిదిని ఏ అంకెతో హెచ్చవేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుంది. రాముడికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా! ‘నా ధర్మం నేను నెరవేర్చా’ అన్న తృప్తి ఒక్కటే అందుకు కారణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ మనుష్యుడిగా పుట్టిన రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే ప్రతివాడూ ‘నేనీ రోజు భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ! ఆయన వద్దన్నది చేయలేదు కదూ!’ అని మననం చేసుకోవాలి. ఇక జీవితంలో ఎదురయ్యే ఉత్థాన పతనాలంటారా... ‘ఈశ్వరుడున్నాడు, ధర్మముంది. నా ధర్మానుష్ఠానం నన్ను రక్షిస్తుంది’ అని భావన చేయాలి. ధర్మంతో మనిషి తరిస్తాడు. ధర్మం మనకు నిగ్రహశక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైతికబలాన్నిస్తుంది. అదే భక్తి. అదే మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి హితకారిణి. ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది.

పరమ భక్తితత్పరుడు అన్న దానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపః శిల్పం సకలమపి ముద్రా విరచనా.’’ ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘సకలమపి ముద్రా విరచనా’ - నా చేతులు, కాళ్ళు... ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధ ముద్రలే.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు