మూర్తీభవించిన ధర్మతేజం

9 Apr, 2016 22:39 IST|Sakshi
మూర్తీభవించిన ధర్మతేజం

శ్రీరాముడు



పశుప్రాయమైన స్థాయి నుంచి పరిపక్వత చెందిన మాననీయ స్థాయికి మనిషిని తీర్చిదిద్దిన మహోన్నత గ్రంథం రామాయణం. కేవలం భారతదేశం మాత్రమే కాదు.. యావత్ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మంత్రరాజం రామనామం. రామచంద్రమూర్తి పాటించిన ధర్మమార్గమే మనకు సదా శ్రీరామరక్ష.

 

వేల సంవత్సరాల తర్వాత కూడా రామచంద్రమూర్తి కథ మనం ఎందుకు చెప్పుకోవాలన్న ప్రశ్నకు రామాయణమనే పేరులోనే సమాధానం దొరుకుతుంది. రామ+ఆయనం = రామాయణం. అంటే ఇది రాముని మార్గం. జీవితంలోని ప్రతి అడుగులోనే కాదు.. శరీరంలోని ప్రతి అణువులోను ధర్మపరాయణత్వాన్ని నింపుకున్నవాడు కావటం వల్లనే రామచంద్రమూర్తి మార్గం మనకు శిరోధార్యమైంది.

 

విశ్వామిత్రుని యాగరక్షణ కోసం సోదరుడు లక్ష్మణుడితో కలసి బయలుదేరిన రామచంద్రమూర్తి, ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారే తాటక, అహల్య, సీతాదేవి. తాటక తమోగుణానికి సంకేతం. అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి సంకేతం. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. ఇటువంటి వ్యక్తుల విషయంలో సహనం అవసరం. అందుకే రామయ్య రాతిని నాతిని చేసి, సంస్కరించాడు. చివరగా కలుసుకున్న (గెలుచుకున్న) స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి ప్రతీక. వెదకి చూచినా లోపం కనిపించదామెలో. అందుకే స్వయంవరంలో పందెం గెలిచి మరీ ఆమెను (సీతమ్మ మనసు) గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశాన్ని అందించాడు. ఏ వ్యక్తి అయినా ఈ మూడు గుణాల (సత్త్వ, రజ, తమో గుణాలు) విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషీ తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజోగుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపట్ల దృష్టిని కేంద్రీకరించాలి. సత్త్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ, సాధన ద్వారా క్రమంగా గుణాతీత స్థితికి చేరుకుని, చివరగా మోక్షం పొందాలి. ఇదీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి రామచంద్రమూర్తి ఇచ్చిన ఆచరణాత్మక సందేశం.

 

మాయలేడిపై ఏర్పడిన మోహం కారణంగా రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని నదులు, కొండలు, గుట్టలు, పశుపక్ష్యాదులు.. ఒకటేమిటి చరాచర జీవరాశనంతటినీ సీతమ్మను చూశారా అని అడుగుతాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సైగలతో సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని చెబుతాయి.

 

మంచిమార్గంలో పయనించేవాడికి పశుపక్ష్యాదులు కూడా సహాయం చేస్తాయట. దుర్మార్గుడిని సొంత సోదరుడు కూడా పరిత్యజిస్తాడట. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టడటమే ఇందుకు ఉదాహరణ. ధర్మం ఎందుకు పాటించాలో, ధర్మాన్ని పాటిస్తే ఎలాంటి రక్షణ మనకు దొరుకుతుందో ఈ వృత్తాంతం ద్వారా రామచంద్రమూర్తి లోకానికి చాటిచెప్పాడు.

 రావణాసుర సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, అన్నగారి పార్థివ దేహాన్ని తమకి అప్పగించమని, అలాచేస్తే వంశాచారం ప్రకారం ఉత్తరక్రియలు నిర్వహించుకుంటామని అనుమతి అడుగుతాడు. అందుకు రామయ్య ఇచ్చిన సమాధానం ఒక్కటిచాలు మన జీవితాల్ని మార్చుకోవటానికి.

 
‘‘ఓ విభీషణా! శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవటం వల్ల యుద్ధం చేయవలసివచ్చిందే కానీ ఇంతటి ప్రాణనష్టం చేయటం నాకు ఇష్టం లేదు. మీ అన్నగారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లి, శాస్త్ర, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు నిర్వర్తించు. ఇకనుంచి ఈయన నీకు మాత్రమే కాదు, నాకూ అన్నగారే’’ అంటాడు. అదీ రామయ్య ధర్మవర్తన. రామరావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను వానరులతో సహా లంకలో ఉండి, పది రోజులు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థిస్తాడు. అందుకు రామయ్య ఇలా అంటాడు. అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

 
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥‘‘లక్ష్మణా! ఎంతటి స్వర్ణమయంగా ఉన్నా లంక, అందులోని భోగాలపై నాకు దృష్టి లేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెండిటికీ మిన్న ఈ లోకంలో ఏదీ లేదు. పధ్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే ఈ క్షణమే వాటిని చూడాలని ఆరాటపడుతోంది’’ అన్నాడు. ఇదీ రామయ్య దేశభక్తి. మాతృభక్తి.

 
రామరాజ్యంలో దొంగతనాలు లేవు. అకాల మృత్యువు లేదు. దరిద్రం లేదు. వంచకులు లేరు. ఇంకా... ‘‘రామమేవాను పశ్యన్తో నాభ్యహింసః పరస్పరమ్’’ - శ్రీరాముని నిత్యం తలచుకుంటూ, రామనామం జపిస్తూ ఒకరినొకరు హింసించుకోవటం మానేశారట అయోధ్యావాసులు. నేటి సమాజానికి ఆచరణీయమైన మాట ఇది.

 

ఇన్ని సుగుణాల పోగు కనుకనే రామయ్య యావజ్జాతికీ ఆరాధ్యుడయ్యాడు. రామకథ నాగరకులతో పాటు జానపదుల జీవితాల్లో ఊపిరిగా మారింది. ‘రాముని మేలు కొలుపు’, ‘లక్ష్మణ దేవర నవ్వు’, ‘ఊర్మిళాదేవి నిద్ర’ వంటి జానపద గేయ సాహిత్యానికి రామకథే ప్రాణగీతిక. రాములోరు, సీతమ్మతల్లి, హనుమ.. అంటూ రామచంద్రుని కుటుంబాన్ని తమ చుట్టాలుగా భావిస్తారు జానపదులు.

 

అన్నమయ్య, త్యాగయ్య, గోపయ్య వంటి వాగ్గేయకారుల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అఖండమైన రామభక్తి సామ్రాజ్యంలో తనివితీరా సంచరించి, తనువులో, మనసులో... అణువణువులో రామయ్యను దర్శించి, చివరి ఊపిరి వరకు రామకథ పాడి, ఆ తర్వాత రామునిలోనే ఐక్యమయ్యారు.

 -కప్పగంతు లక్ష్మీనారాయణ

 

 

 

 

మరిన్ని వార్తలు