చీమలు, మొక్కల విషంతో  కేన్సర్‌ కణాలకు చెక్‌!

10 Jan, 2018 23:57 IST|Sakshi

శరీరంలోని కేన్సర్‌ కణాలను మాత్రమే విజయవంతంగా నాశనం చేసేందుకు కొన్ని రకాల మొక్కలు, చీమల్లోని రసాయనం ఉపయోగపడుతుందని వార్విక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కేన్సర్‌ కణాలు వేగంగా విడిపోయేందుకు కారణమైన వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ తెలిపారు. మొక్కలు, చీమలతోపాటు అనేక జీవజాతుల్లో సోడియం ఫార్మాట్‌ అనే రసాయనం ఒకటి ఉంటుంది. దీనిన జేపీసీ11 అనే సేంద్రీయ పదార్థంతో కలిపి ప్రయోగించినప్పుడు కేన్సర్‌ కణాల విభజనకు ఉపయోగపడే పైరువేట్‌ రసాయనం కాస్తా అసహజమైన లాక్టేట్‌గా మారిపోతుంది. ఫలితంగా కణ విభజన స్తంభించిపోతుంది.

కేన్సర్‌ కణాలు నాశనమైపోతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఒకే కేన్సర్‌ కణంపై ఈ రసాయనం మళ్లీమళ్లీ దాడి చేయగలదు కాబట్టి ఏ కణం కూడా దీని ప్రభావం నుంచి తప్పించుకోలేదని అంచనా. ఈ సరికొత్త రసాయన మిశ్రమం కేన్సర్‌పై పోరులో కీలక పాత్ర పోషించగలదని పీటర్‌ అంటున్నారు. కీమోథెరపీలో వాడే విషపూరిత రసాయనాల మోతాదును అతితక్కువ మోతాదులో వాడటం ద్వారా దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గింవచ్చు. కేన్సర కణాలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థలే లక్ష్యంగా పనిచేస్తూండటం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని జరగదని పీటర్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు