బ్యూటీరియా

4 Dec, 2019 01:03 IST|Sakshi
శుభ్రంగా లేని బ్లెండర్‌ స్పాంజీలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది

అవునా!

మేకప్‌ చేసుకుంటున్నారు బాగానే ఉంది. వాటి ఎక్స్‌పైరీ డేట్లు చూస్తున్నారా? పోనీ.. వాడిన బ్రష్‌లను, స్పాంజ్‌లను ఎన్నడైనా శుభ్రం చేశారా? లేదంటున్నారా! అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. ఎందుకంటే.. ఇలాటి వాటిల్లో హానికారక బ్యాక్టీరియాలు బోలెడు ఉండిపోతాయి అంటోంది ఓ తాజా అధ్యయనం!

మేకప్‌కు ఉపయోగించే వాటిల్లో కనీసం 90 శాతం వాటిల్లో స్టాఫైలోకాకస్‌ ఔరియస్, ఈ–కోలీ, సిట్రో బ్యాక్టర్‌ ఫ్రెండీ వంటి హానికారక బ్యాక్టీరియా ఉంటుందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఆస్టన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. ఇవన్నీ ఒకసారి వాడిన మేకప్‌ సామగ్రిలో మాత్రమే ఉండేవే అయినప్పటికీ, అలా ఉన్నట్లు తెలియకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్త అమ్రీన్‌ బషీర్‌ తెలిపారు. అధ్యయనం కోసం తాము లిప్‌స్టిక్, లిప్‌గ్లాస్, ఐ లైనర్, మస్కారాలను ఎంచుకున్నామని, వీటిల్లో నీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా సంతతి అంత ఎక్కువగా ఉన్నట్లు తెలిసిదని చెప్పారు.

ఫౌండేషన్, కాంటూరింగ్‌ల కోసం వాడే బ్లెండర్‌ స్పాంజిల్లో పరిస్థితి మరీ దారుణమని అన్నారు. మొత్తమ్మీద తాము 467 ఉత్పత్తులను పరిశీలించామని వీటిల్లో 96 లిప్‌స్టిక్‌లు కాగా, 92 ఐ లైనర్లు, 93 మస్కారా ప్యాకెట్లతోపాటు 107 లిప్‌ గ్లాస్‌లు, 79 బ్లెండర్‌ స్పాంజిలు ఉన్నాయని వివరించారు. మేకప్‌ ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అస్సలు ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఒక ప్రశ్నపత్రం ద్వారా తాము మేకప్‌ సామాగ్రిలో బ్యాక్టీరియా ఎలా చేరుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశామని, అందుకు వాడకందారులదే ఎక్కువ బాధ్యతని తేలిందని అన్నారు. ప్రతి మేకప్‌ సామగ్రికీ ఒక ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని, వినియోగదారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ సమయం తరువాత బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుందని అమ్రీన్‌ వివరించారు.

మీరు ఉండే ప్రాంతా న్ని బట్టి ఈ విషయాన్ని తయారీదారులు తెలియజేసే పద్ధతి ఉంటుంది. అమెరికాలోనైతే ప్యాకేజింగ్‌పైనే ఈ సమాచారం ప్రింట్‌ చేస్తారు. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిన తరువాత కూడా మేకప్‌ సామగ్రిని చెత్తబుట్టలోకి పడేయడం లేదని వెల్లడైంది. బ్లెండర్‌ స్పాంజిల విషయంలో తేలిందేమిటంటే.. 93 శాతం మంది వీటిని ఎప్పుడూ శుభ్రం చేసుకోరూ అని! నేలపై పడిన తరువాత కూడా వాటిని అలాగే వాడేస్తామని 65 శాతం మంది ఒప్పుకున్నారు. వీలైనంత వరకూ ఈ బ్లెండర్‌ స్పాంజిలను గోరువెచ్చటి నీటిలో, సబ్బులతో శుభ్రం చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశోధన వివరాలు అప్లయిడ్‌ మైక్రోబయాలజీ తాజాసంచికలో ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు